నాలుగేండ్లలో రూ.1.2 లక్షల కోట్ల ఎగవేత

Evasion of Rs.1.2 lakh crore in four years– సగటున రోజుకు రూ.100 కోట్లకు పైబడే
– ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ వెల్లడి నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో ఉద్దేశపూర్వక ఎగవేతల సొమ్ము అంతకంతకూ పెరిగిపోయింది. ప్రజలు దాచుకున్న సొమ్మును బ్యాంకుల నుంచి రుణాల రూపంలో కాజేసిన బడా పెట్టుబడిదారులు, కంపెనీలు ఉద్దేశపూర్వకంగా చెల్లించని సొమ్ము 2019 మార్చి నుంచి రూ.1.2 లక్షల కోట్లు ఉన్నట్లు వెల్లడైంది. యుపిఎ ప్రభుత్వం ‘స్కామ్‌ల’తో బ్యాంకింగ్‌ రంగాన్ని నాశనం చేసిందని, తమ ప్రభుత్వం ‘మంచి ఆర్థిక ఆరోగ్యాన్ని’ పునరుద్ధరించిందని ప్రధాని నరేంద్ర మోడీ జులై 22న ప్రకటన చేశారు. ఆయన ప్రకటనకు భిన్నంగా… ఎగవేతదారులు చెల్లించాల్సిన బకాయిల మొత్తం సగటున రోజుకు రూ.100 కోట్లకు పైగా పెరిగింది. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో మొత్తం రూ.3 ట్రిలియన్‌ మార్క్‌ కంటే ఎక్కువగానే ఉందని ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ డేటా తెలిపింది. ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చే అటువంటి రుణాల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు చెల్లించాల్సి న డబ్బులో వాటా 77.5 శాతంగా ఉంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు ప్రైవేట్‌ బ్యాంకులకు రూ.53,500 కోట్లు బకాయిపడ్డారు. 10 జాతీయ బ్యాంకులకు జూన్‌ నాటికి రూ.1.5 లక్షల కోట్ల బకాయిలు ఉండగా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వాటా రూ.80 వేల కోట్లు ఉంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, తమిళనాడు ఉన్నాయి. చెల్లించాల్సిన మొత్తంలో (గత ఆర్థిక సంవత్సరం చివరి వరకు) 70 శాతం కంటే ఎక్కువ ఈ రాష్ట్రాల నుంచే ఉన్నాయి. ఈ సమయంలో బకాయి ఉన్న మొత్తం రూ.0.6 ట్రిలియన్‌ నుండి రూ.1.3 ట్రిలియన్లకు పెరిగింది. ఆర్‌బిఐ ఇటీవలే ఉద్దేశపూర్వక ఎగవేతదారులను రుణం నిరర్థక ఆస్తి (ఎన్‌పిఎ)గా మారిన ఆరు నెలల్లోగా ప్రకటించాలని ప్రతిపాదించింది. అక్టోబరు నెలాఖరులోగా ఈ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్రం కోరింది. ఆర్‌టిఐ ప్రత్యుత్తరాలు, పార్లమెంటు ప్రశ్నలు, బ్యాంకు డేటా పెద్ద రుణగ్రహీతలు చెల్లించాల్సిన భారీ మొత్తంలో ప్రజాధనాన్ని వెల్లడించాయి. ది ఎకనామిస్ట్‌ ‘క్రోనీ క్యాపిటలిజం’ ఇండెక్స్‌లో ఇండియా 10వ స్థానంలో ఉంది. 2013 నుండి ‘క్రోనీ-క్యాపిటలిస్ట్‌ సెక్టార్ల’ నుండి సంపద ఇండెక్స్‌ ప్రకారం దాని జిడిపిలో 5 శాతం నుండి 8 శాతానికి పెరిగింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాద్‌ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (ఆర్‌బిఐ) మొత్తం రూ.10,57,326 కోట్లు మాఫీ చేశాయని వెల్లడించా రు. కరాద్‌ ప్రకారం, టాప్‌ 10 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులకు రూ.40,825 కోట్లు బకాయిపడ్డారు. మొదటి 50 మంది రుణ ఎగవేతదారులు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.87,295 కోట్లు బకాయిపడినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. పరారీలో ఉన్న మెహుల్‌ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌ రూ.8,738 కోట్లతో అతిపెద్ద ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా, ఎరా ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ రూ.5,750 కోట్లు, ఆర్‌ఇఐ ఆగ్రో లిమిటెడ్‌ రూ.5,148 కోట్లు, ఎబిజి షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ రూ.4,774 కోట్లు, పవర్‌ స్టైల్‌ వద్ద రూ.3,911 కోట్లు రుణ ఎగవేతదారులుగా ఉన్నారు.

Spread the love