ప్రపంచం డిజిటలైనా పుస్తక ప్రాధాన్యం తగ్గదు

– పురోగతికి పుస్తక పఠనం అవసరం : వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
– వనపర్తిలో నవతెలంగాణ పబ్లిసింగ్‌ హౌస్‌ ప్రారంభం
నవతెలంగాణ- వనపర్తి
ఆధునిక యుగంలో ప్రపంచం మొత్తం డిజిటలైనా పుస్తకం ప్రాధాన్యం తగ్గదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ చౌరస్తాలో మంగళవారం నవ తెలంగాణ పబ్లిషంగ్‌ హౌస్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాహితీ ప్రియులు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపించారన్నారు. పుస్తక పఠనం ద్వారానే ప్రజలకు రాష్ట్ర ప్రత్యేకతపై అవగాహన కలిగిందని చెప్పారు. ఏ దేశమైనా పురోగతి సాధించాలంటే గత చరిత్రను నేటి ఆధునికతను ప్రజలు అర్థం చేసుకోవాలని, అందుకు ఇలాంటి పుస్తక ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని అన్నారు. నేడు యువతీ యువకులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, సాహితీప్రియుల్లోనూ పుస్తక పఠనం తగ్గిందని, దాన్ని పెంచుకోవడం ద్వారానే నేటి సమాజ స్థితిగతులను, చరిత్రను అర్థం చేసుకోగలమని చెప్పారు. పరిశోధన ఫలాలు, శాస్త్ర సాంకేతిక రంగాల విజ్ఞానాన్ని మరొకరికి చేర్చే సాధనమే పుస్తకమన్నారు. చదువు అంటే కేవలం మార్కులు పట్టాలు గుర్తింపు కోసమే అని చాలామంది భావిస్తున్నారన్నారు. కానీ పుస్తకాల ద్వారా నేటి సమాజాన్ని చదివేవారు, అందులోనూ పుస్తక పఠనం చేసేవారు చాలా తక్కువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నవ తెలంగాణ పబ్లిక్‌షింగ్‌ హౌస్‌ శ్రమకోర్చి సమాజాన్ని ఎంతో కొంత మేల్కొల్పాలన్న లక్ష్యంతో ఈ పుస్తకాల ప్రదర్శన ద్వారా ముందుకెళ్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలు ఏవైనా చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాల పఠనం చేయాలని సూచించారు. నవ తెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌కు మంచి ఆదరణ లభించాలన్నారు. ఎన్నికల తరువాత విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు అందర్నీ ఒక చోటికి చేర్చి పుస్తక పఠనంపై అవగాహన కల్పించడంతోపాటు పుస్తకాల కొనుగోలుకు కూడా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా అంజనేయులు, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు డి.కృష్ణయ్య, కవి రచయిత జనజ్వాల, నవ తెలంగాణ జనరల్‌ మేనేజర్‌ వాసు, మహబూబ్‌నగర్‌ రీజియన్‌ మేనేజర్‌ కార్తీక్‌, స్టాపర్‌ పరిపూర్ణం, బాబు, రాము, మన్మోహన్‌, జితేందర్‌ గౌడ్‌ రాధాకృష్ణ, మన్మోహన్‌, మద్దిలేటి, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love