Monday, May 4, 2026
E-PAPER
Homeదర్వాజఇప్పుడైనా 'ఆ తర్వాత..' కూడా మనిషే మూలం

ఇప్పుడైనా ‘ఆ తర్వాత..’ కూడా మనిషే మూలం

- Advertisement -

కోట్ల కవిత్వం ఇంటి దగ్గర నుండి మొదలై దేశవిదేశాలను చుట్టి వస్తుంది. మట్టి నుండి మొదలై ఆకాశం దాకా విస్తరిస్తుంది. వేరు నుండి మొదలై చిటారు కొమ్మదాకా వ్యాపిస్తుంది. వారు నిరంతరం కవిత్వమై ప్రవహిస్తారు. కాలాన్ని కవిత్వం చేసే కవి కోట్ల. ఇప్పుడు ‘ఆ తర్వాత…’ సంపుటితో మన మనసును, మెదడును కదిలించడానికి వచ్చారు. వారి కవిత్వంలో ప్రవహించే చల్లని నీరు, పరిమళించే పచ్చని చెట్టు కనబడకుండా ఉండదు. అలాగే ఇంటింటి రామాయణం ఉంటుంది, రంగురంగుల రాజకీయం ఉంటుంది. సమాకాలీన సమస్యలపై ప్రశ్నలు సున్నితంగానే సంధించినా సూటిగా గుచ్చుకోకుండా ఉండలేవు. మనిషి ఎప్పుడూ చెట్టును ఆదర్శంగా తీసుకోమంటాడు.
”మనిషి ఇవాళ
మొక్కై వంగిండు
రేపు మానై ఎదుగుతడు” మనమంతా అశోక చక్రవర్తులమై సామూహిక జలగీతాలను వినాలని కోరుకుంటారు.
చెట్టు నేల కూలిందా, నిజానికి మనమే కూలుతున్నామని హెచ్చరిస్తారు. అలాగే ”తాను నిలువునా గాయపడ్డా చిగురుహాసం చేసే చెట్టు స్థైర్యాన్ని నిలుపుకోవాలని ప్రకతికి ఉన్న త్యాగగుణం మనిషి అలవర్చుకోవాలని, నీటిని, మట్టిని కాపాడుకోవాలని కోరుకుంటారు.

ఎవరైనా ఒంగి ఓ మొక్కను నాటుతుంటే
”జ్ఞానోదయమైన మనిషి
నేలతల్లికి మొక్కు చెల్లిస్తున్నట్లుంటది” ఇలా చెట్టు చుట్టూ కవిత్వమై పచ్చగా పరిమళిస్తారు.
”నాగరికతను నిర్వచించాలంటే
భాషా సంస్కతులతో పాటు
ఆ దేశంలో విస్తరించిన అరణ్యాలను లెక్కించాలి” అనడంలో వాస్తవికతను దర్శింపచేశారు.

”మొక్కలు నాటి
అడవులు ధ్వంసం చేసే రాజ్యమా
మనిషికి నీవు కడుతున్నది సమాధులే” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు.
పార్లమెంట్‌ కన్నా పచ్చని పంట పొలాలే పవిత్రమైనవని, అన్నం మెతుకుల వెనుక ఉన్న రైతు స్వేదాన్ని చూడాలని అంటారు.
వర్షాన్ని అనుభూతి చెందుతూనే ప్రతి నీటిచుక్కను కాపాడుకోమంటారు

”చూస్తుంటే ఈ వాన
జలదశ్యాలను కలగన్న
కాకతి వారసునికి స్వాగత గీతంలా ఉంది ”
బావులను, చెరువులను, నదులను కాపాడితేనే జీవనం ఉంటుందని సూచిస్తారు.

”నది మరణించాక
రూపాయి విసిరేస్తుంటే
మా అమ్మ శవయాత్ర గుర్తొచ్చింది” ఇంతకన్నా ఆవేదన ఇంకేం ఉంటుంది.

ఒంటరితనం ఇప్పుడు ఒక పెద్ద నరకం, ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవించే దయనీయ స్థితి
”నలుగురిలో తాను వెలుగై వెలిగిన క్షణాలు
ఒంటరితనం చుట్టూ

క్రమంగా చితిని పేర్చుతుంటాయి
ఎవరూ నిప్పంటించాల్సిన పని లేదు”
”ఎవరింట చూసినా ఇద్దరే
ఆ ఇద్దరి మధ్య పూడ్చలేని నిశ్శబ్దం”
పిల్లలు చదువులకోసం విదేశాలకు వెళ్లడం, అక్కడే స్థిరపడిపోవడం, పెద్దలు ఇక్కడ ఒంటరిగా మిగిలిపోవడం అనేది చెప్పలేని ఆవేదన. ఎవరింట్లో చూసినా ఇలాంటి స్థితే. చించుకుంటే అందరి కళ్ళనిండా ప్రవహించే దుఃఖం ఇదే. పిల్లలు ఆలోచించాల్సిన విషయాన్ని సున్నితంగా చెప్తారు. ఇంటి గురించి చెప్తూ …

”ఎన్ని ఖరీదైన వస్తువులు నింపినా ఇంటికింత తప్తి ఉండదు
అది మనుషుల్ని కోరుకుంటుంది” మనుషులు లేకుండా ఉంటే ఆ ఇల్లు స్మశానమే అవుతుంది.
తలవొంపు, రోలు రోకలి ఓ విసుర్రాయి, పాతింటి దర్వాజ, మా అవ్వ, గురిగి వంటి కవితల్లో ఆనాటి ఇంటి జ్ఞాపకాలను తడుముతారు, ఆరోజుల్లోకి తీసుకెళ్తారు.
అగ్రరాజ్యాల దాష్టికం, ఢిల్లీలో రైతుల ధర్నా, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ భాష యాస, నేటి పాలకులపై వ్యంగ్యాస్త్రాలు, అధికార ప్రతిపక్ష నాయకులపై చురకలు, ఎన్నికల కళలు, రైతు జీవితం, ఇంటిపూల ముచ్చట్లు, మనవడి మురిపాలు, కాలి నడకలు, పాదయాత్రలు, ధూమపానం, మల్లెల పరిమళం…ఇలా పలు విషయాలపై కవిత్వమై స్పందిస్తారు.

”పరిమళం సోకినప్పుడల్లా పూలను కీర్తిస్తుంటే
మల్లెచెట్టు నివ్వెరపోతుంది” ఎవరేం సాధించినా దాని మూలం గుర్తుచేసుకోమంటారు.
ఇందులో నూట అరవైకి పైగా కవితలు ఉన్నాయి. ఇటు జీవితానుభవాలను, అటు సామాజిక అంశాలను రెండుకళ్ళుగా చేసుకొని స్పందించే నేటి మేటి కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి. ఆ తర్వాత… లో ఆలోచన ఉంది, ఆవేశం ఉంది, ఆవేదన ఉంది.

పుట్టి గిరిధర్‌, 9494962080

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -