అబుదాబి : యుఎఇలో భారత మహిళ షెహజాది ఖాన్‌కు ఉరిశిక్ష అమలైంది. ఆమె సంరక్షణలో ఉన్న చిన్నారి మృతి కేసులో హత్య అభియోగాలు నమోదుకావడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన షెహజాదికి యుఎఇ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. షెహజాదిని రక్షించాలంటూ ఆమె కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఫిబ్రవరి 15నే ఈ శిక్ష అమలైంది. ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా తెలియజేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లా గోయ్రా ముగ్లి గ్రామానికి చెందిన షెహజాదికి ఉజైర్ అనే వ్యక్తి యుఎఇలో జీవితం బాగుంటుందని అక్కడకు తీసుకువెళ్తానని 2021లో ఆశ పెట్టాడు. ఆమెను ఉజైర్ ఆగ్రాలోని తమ బంధువులైన ఫైజ్, నాడియా దంపతులకు విక్రయించగా, వారు అబుదాబీకి తీసుకెళ్లారు. ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో ఫైజ్-నాడియా దంపతులపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. అదే సమయంలో వారిబిడ్డ బాగోగులు షెహజాదినే చూస్తోంది. ఆ బిడ్డ చనిపోవడంతో.. ఆ దంపతులు ఆమెపై హత్య ఆరోపణలు మోపారు. ఔషధాల విషయంలో ఆ దంపతులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే చిన్నారి ప్రాణాలు పోయినట్లు షెహజాది తెలిపింది. కానీ, కోర్టు మాత్రం ఆమెకు మరణశిక్షను విధించింది.