– మృతుల గుర్తింపుకు ఫొటోల సేకరణ
– నెలపాటు కార్యాచరణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాష్ట్రంలో ఫించన్ దారుల వాస్తవ జాబితా రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేపట్టింది. పలు కారణాలతో ప్రస్తుతం ఉన్న ఫించన్ లబ్ధిదారుల వివరాలను పునఃసమీక్షిస్తూ, వారి తాజా వివరాలు మరియు ఫొటోలను సేకరించి డిజిటల్ నమోదుకు చర్యలు ప్రారంభించింది.
గతంలో ఫించన్ మంజూరు సమయంలో సేకరించిన వివరాలు ఇప్పటికీ యథాతథంగా ఉన్నాయా లేదా అన్నది అంచనా వేయడానికి నెలరోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ నిర్వహించనున్నారు. ఇందులో ప్రతి ఫించన్ దారుని ప్రస్తుత నివాసం, జీవన స్థితి, ఆధార్ సంబంధిత వివరాలు, ఫొటోలను సేకరించి కొత్త నివేదిక సిద్ధం చేయనున్నారు.
ఇటీవల ఇతర జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన పరిశీలనలో మృతుల పేర్లపై కూడా ఫించన్ నగదు ఖాతాల్లో జమ అవుతున్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఫోన్ పే, ఏటీఎం తదితర ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఆ నగదును ఉపసంహరించుకుంటున్న ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల పేర్ల తొలగింపు, అర్హుల గుర్తింపు, అక్రమాల నివారణ లక్ష్యంగా ఫించన్ దారుల వివరాల ధృవీకరణకు శ్రీకారం చుట్టింది.
అశ్వారావుపేట ఎంపీడీవో రామకోట రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలో మొత్తం 4,434 మంది ఫించన్ దారులు ఉన్నారు. అందులో వృద్ధాప్య ఫించన్ దారులు 1,796 మంది, వితంతువులు 1,939 మంది, వికలాంగులు 450 మంది, కల్లుగీత కార్మికులు 16 మంది, నేత పనివారు ఒకరు, ఒంటరి మహిళలు 232 మంది ఉన్నారు. వీరందరి వివరాలను పంచాయితీ వారీగా సేకరించి, ఫొటోలను నమోదు చేసి నూతన జాబితా తయారు చేయనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.



