Wednesday, March 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలులబ్దిదారుల ముఖగుర్తింపు చేపట్టాలి

లబ్దిదారుల ముఖగుర్తింపు చేపట్టాలి

- Advertisement -

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
మెడికల్‌ కాలేజీలతో సర్కార్‌ దవాఖానాల అనుసంధానం
విద్యాసంస్థల్లో మత్తు పదార్థాలపై ఉక్కుపాదం
యూరియా యాప్‌పై గందరగోళాన్ని తొలగించాలి
సోలార్‌ విద్యుత్‌ను ప్రోత్సహించండి
జిల్లా కేంద్రంలో ఉండని అధికారులపై చర్యలు : కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ముఖ గుర్తింపు (ఫేషియల్‌ రికగ్నైజేషన్‌) చేపట్టాలని ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో సీఎం సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ముఖ గుర్తింపు (ఫేషియల్‌ రికగయిజేషన్‌) అమలు చేయాలని చెప్పారు.

దీనివల్ల అసలైన లబ్దిదారులకు మేలు జరుగుతుందనీ, అక్రమాలను నివారించవచ్చని తెలిపారు. ఇటీవల ఆసరా పింఛన్లలో ముఖ గుర్తింపు చేపట్టడం వల్ల మూడు లక్షల మంది అనర్హుల పేర్లను తొలగించామని సీఎం ప్రస్తావించారు. సాంకేతికతను సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్లే ఇలాంటి పొరపాట్లు దొర్లాయని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామ, వార్డు సభల్లో నూతనంగా ఇచ్చిన రేషన్‌ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200లోపు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు.

అందర్నీ భాగస్వామల్ని చేయండి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులందరి భాగస్వామ్యం ఉండాలన్నారు. వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, చైర్మెన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలన్నారు. వారికి జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, వారి విధులు, బాధ్యతలకు సంబంధించి ప్రింటెడ్‌ మెటీరియల్‌ అందించాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆస్పత్రులకు మెడికల్‌ కాలేజీల అనుసంధానం
మెడికల్‌ కాలేజీలతో సర్కార్‌ దవాఖానాలను అనుసంధానం చేయాలన్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఇతర స్థానిక వైద్య సంస్థలు రోగులను ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలకే రిఫర్‌ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య సంస్థల్లోని అత్యాధునిక సాంకేతికత, వైద్య విద్యార్థులు, వైద్యులు, ప్రొఫెసర్ల సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

యూరియా యాప్‌లో మార్పులు
యూరియా యాప్‌లో గందరగోళాన్ని తొలగించి, సులువుగా వినియోగించేలా మార్పులు చేయాలన్నారు. నానో యూరియా ఉపయోగాలను క్షేత్రస్థాయిలో ప్రదర్శన ద్వారా రైతులకు వివరించాలని చెప్పారు. వ్యవసాయ శాఖ భూసార పరీక్షలు చేపట్టి, సకాలంలో రైతులకు వాటి సమాచారం అందజేయాలనీ, ఏ భూమిలో ఏ పంట బాగా పండుతుందో రైతులకు తెలియజేయాలని సూచించారు.
”మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగు చేసేలా అన్నదాతలను ప్రోత్సహించాలి. పంట మార్పిడి, వైవిధ్య ప్రయోజనాలను వివరించాలి. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగేలా చర్యలు చేపట్టాలి” అని దిశానిర్దేశం చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు చెల్లించాలన్నారు. పిల్లలకు పోషకాహారం అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.

సిటీల్లో హాస్టళ్ల వివరాలు సేకరించండి
నగరాలు, పట్టణాల్లోని వర్కింగ్‌ ఉమెన్స్‌, బాయ్స్, గర్ల్స్‌ హాస్టళ్ల వివరాలు నమోదు చేయాలనీ, వాటి అనుమతులు, పర్యవేక్షణ, యాజమాన్యాలకు జవాబుదారీతనంపై నిఘా పెట్టాలని సూచించారు.

‘మత్తు’ నివారణ బాధ్యత కాలేజీ యాజమాన్యాలదే
పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, డ్రగ్స్‌, ఈ-సిగరెట్ల వినియోగం జరిగితే అందుకు ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రతి ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాల, కళాశాలల్లో సబ్జెక్ట్‌ టీచర్స్‌, పీఈటీలతో పాటు సైకాలజిస్ట్‌లు కూడా ఉండేలా చూడాలని చెప్పారు.

సోలార్‌ను ప్రోత్సహించండి
సోలార్‌ విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ పంప్‌సెట్లకు బదులు సోలార్‌ పంప్‌సెట్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఇండ్లపై సోలార్‌ ప్యానల్స్‌ అమర్చుకుని, స్వీయ అవసరాలకు వాడుకొని, మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసేలా అవగాహన కల్పించాలని చెప్పారు. దీనివల్ల ప్రజలకు లభించే అదనపు ఆదాయంపై గ్రామస్థాయిలో విద్యుత్‌శాఖ అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.

రోడ్ల మరమ్మతులు చేయండి
రహదారులపై భారీ స్థాయిలో గుంతలు, ప్రమాదం జరిగే స్థలాలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టాలన్నారు. అందుకోసం ప్రత్యేక వాట్సప్‌ నెంబర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్ల వెంట చెత్త, ఇతర నిర్మాణ వ్యర్ధాలు డంప్‌ చేసే వారిపై జరిమానాలు విధించాలని ఆదేశించారు.

స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌లు
పాఠశాలల బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలను రవాణా శాఖ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలనీ, దీనివల్ల రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలుగుతామన్నారు.

కలెక్టర్లకు క్లాస్‌
సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పలువురు కలెక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలోని పలువురు జిల్లా కలెక్టర్లు హెడ్‌ క్వార్టర్స్‌లో ఉండటం లేదంటూ వారి పనితీరుపై అసంతప్తి వ్యక్తం చేశారు. రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండకుండా హైదరాబాద్‌కు వస్తున్నారనీ, ఇది సరైన చర్య కాదని హెచ్చరించారు. ”ఆషామాషీగా కలెక్టర్లు కాలేరు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుంది. కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలి. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలి. ఆ అధికారి విద్యార్థులతో పాటు పాఠశాలలో భోజనం చేయాల్సిందే.

కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి. ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలి” అని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం కలెక్టర్ల పనితీరును నిశితంగా గమనిస్తోందని గుర్తు చేశారు. జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. బోగస్‌ ఉద్యోగులను సష్టించే ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ”మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే. మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌ పట్ల కఠినంగా వ్యవహరించకపోతే కలెక్టర్‌, ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్‌ చేస్తాం” అని సీఎం తీవ్రంగానే హెచ్చరించినట్టు తెలిసింది.

ఇదీ యాక్షన్‌ ప్లాన్‌
ఏప్రిల్‌ 2న గ్రామ సభల నిర్వహణ
ఏప్రిల్‌ 16న మండల స్థాయిలో కార్యక్రమం
మే 2న నియోజకవర్గ స్థాయిల్లో సభలు
మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం
జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక

శాఖల వారీగా…
1.గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్‌ పైళ్ల క్లియరెన్స్‌
2.ఆరోగ్యం
3.క్షేత్రస్థాయి పరిశీలనలు
4.సంక్షేమం
5.పిల్లల భద్రత.. డ్రగ్స్‌కు అడ్డుకట్ట
6.రైతు సంక్షేమం.. వ్యవసాయం
7.విద్య
8.యువత.. క్రీడలు
9.మహిళలు
10.పర్యావరణం

ప్రజాప్రతినిధుల షెడ్యూల్‌
మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక
మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు
99 రోజుల్లో శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ప్రారంభం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -