ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలం

నవతెలంగాణ – సిర్పూర్‌(టి)
నియోజకవర్గ ప్రజల సమస్యలను 20 ఏండ్ల నుండి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్న చందంగా మారిందని బీజేపీ నాయకుడు డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. బుధవారం పల్లెపల్లెకు పాల్వాయి గడపగడపకు బీజేపీ పాదయాత్రలో భాగంగా మండలంలోని చీలపెల్లి, రావన్‌పెల్లి, లింబుగూడ, మేడిపెల్లి, కాగజ్‌నగర్‌ మండలంలోని మాలిని, చిన్నమాలిని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామసభలు నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిర్పూర్‌ మండలంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లైనా అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. మారుమూల గ్రామాలకు సరైన రోడ్డు మార్గం లేక నిత్యం రాకపోకల విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వీరి బాధలు వర్ణనాతీతమన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టి 10 ఏండ్లు కావస్తున్నా గ్రామాల్లో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు మాత్రమే అన్ని రకాలుగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కోనప్ప మూడుసార్లు అధికారం చేపట్టినప్పటికీ మారుమూల గ్రామాలు అలాగే ఉన్నాయని, బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.

Spread the love