చైనా రుణాలపై అబద్ధపు ప్రచారం

ఫలానా చోట మహా సరస్సు ఉందని కొందరు చెప్పిన చోట చూస్తే అక్కడ నీటి జాడలేని ఎడారి ఉంటుంది. చైనా గురించి కూడా అనేక ప్రచారాలు అలాగే ఉన్నాయి. అక్కడ ఉన్న సోషలిస్టు సమాజ వృద్ధి రేటు అంకెల గారడీ అని, ఎప్పుడైనా కుప్పకూలిపోతుందని అనేక మంది ముహూర్తాలు కూడా పెట్టారు. అలాంటిదేమీ జరగలేదు. ఇటీవలి కాలంలో పేద దేశాలను అప్పుల ఊబిలోకి లాగి వాటిని వనరులను ఆక్రమిస్తున్నదని, తన పలుకుబడిని పెంచుకుంటున్నదనే ప్రచారం నిరంతరం సాగుతూనే ఉంది. పోనీ అందుకు ఎలాంటి రుజువులనైనా చూపారా అంటే ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఉదంతాన్ని కూడా ఎవరూ చెప్పలేదు. అమెరికా విత్తమంత్రి జానెట్‌ ఎలెన్‌ చైనా రుణ ఊబి గురించి అనేక సార్లు గోబెల్స్‌ ప్రచారం చేశారు. చైనాను ఎదుర్కోవా లంటే అమెరికా కూడా అప్పులు ఇవ్వాలని ఆమె కొద్దిరోజుల క్రితం చెప్పారు. ఇతర దేశాలన్నీ చైనాతో విడగొట్టుకొని దానికి బుద్ది చెప్పాలని ప్రబోధించే అమెరికా తన వరకు వచ్చే సరికి చైనాతో విడగొట్టుకొనే పరిస్థితిలో తాము లేమని ఎలెన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అమెరికా, ఐరోపా ధనిక దేశాలు, వాటి కనుసన్నలలో కథలు అల్లే మీడియా చైనా రుణాల గురించి వాటిని తీసుకున్న దేశాల గురించి కార్చిన మొసలి కన్నీరు గురించి చెప్పనవసరం లేదు. ఆధారాల గురించి గట్టిగా నిలదీస్తే ఊబిలో దింపిందని కాదు, ఊబిని తయారు చేస్తున్నదని సన్నాయి నొక్కులు నొక్కుతారు. నిజానికి పేద దేశాలు విపరీతంగా అప్పులు తీసుకొని అవి తీర్చలేకపోతే నష్టపడేది చైనా అన్నది స్పష్టం. శతాబ్దాల తరబడి ఆఫ్రికాను ఆక్రమించి అక్కడ ఎలాంటి అభివృద్ధి జరపకుండా చీకటి ఖండంగా ఉంచి సహజ సంపదలను దోపిడీ చేసింది పశ్చిమ దేశాలే అన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఒక రైలు మార్గం, ఒక రేవు నిర్మాణం, ఒక విద్యా సంస్థ ఇలా కనీస మౌలిక వసతుల కోసం ముఖం వాచిన ఆఫ్రికా దేశాలు స్వాతంత్య్రం పొందిన తరువాత పశ్చిమ దేశాలు లేదా అవి ఏర్పాటు చేసిన బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు రుణాలు ఇచ్చి ఉంటే ఈ రోజు చైనా అడుగుపెట్టే అవకాశమే ఉండేది కాదు. జాంబియా ప్రభుత్వం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చైనాతో అనేక ఒప్పందాలు చేసుకుంది. ఇటీవలి కాలంలో అక్కడ జరిగిన పరిణామాల పూర్వరంగంలో వాటిలో అనేక ప్రాజెక్టులను రద్దు చేసుకుంది. కొన్నింటిని చైనా వారే రద్దు చేశారు. ఇటీవల ఐఎంఎఫ్‌ నుంచి 130 కోట్ల డాలర్ల రుణం తీసుకుంది. రోడ్లు, వంతెనల వంటి మౌలిక సదుపాయాల నుంచి తగినంత రాబడి రావటం లేదు కనుక మిగిలిన ప్రాజెక్టులను రద్దు చేసుకున్నట్లు ఐఎంఎఫ్‌ నిపుణులు చెప్పారు. దీనికి ఎలాంటి రుజువులను వారు చూపలేదు.
అమెరికా, ఐరోపా దేశాలు కబుర్లు తప్ప ఇప్పటికీ ‘ఆ ఒక్కటి అడక్కు’ అన్నట్లుగా ఉన్నాయి. ఆఫ్రికాలో ప్రస్తుతం చైనాతో పోటీ పడే స్థితిలో అమెరికా, మరొక దేశమూ లేదు.2021లో ఆఫ్రికాతో చైనా వాణిజ్య లావాదేవీల విలువ 254బిలియన్‌ డాలర్లు కాగా, 2022 అమెరికా జరిపిన లావాదేవీలు 40బి.డాలర్లు మాత్రమే. నికీ ఆసియా పేర్కొన్న సమాచారం ప్రకారం ఆఫ్రికాలో మొత్తం పశ్చిమ దేశాల పెట్టుబడుల కంటే ఒక్క చైనా రెండున్నర రెట్లు ఎక్కువగా పెట్టింది. అందువలన సహజంగానే దాని పలుకుబడి కూడా అదే విధంగా ఉంటుంది. పచ్చి నిజం ఏమిటంటే ప్రపంచ బాంకు సమాచారాన్ని విశ్లేషించి ఆఫ్రికా పొందిన రుణాల్లో చైనా వాటా పన్నెండు శాతం కాగా పశ్చిమ దేశాల ప్రయివేటు రుణాలు 35శాతం ఉన్నట్లు గతేడాది ఒక నివేదిక వెల్లడించింది. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ ఇచ్చే రుణాల మీద 1.3, చైనా ఇచ్చే వాటి మీద 2.7శాతం వడ్డీ విధిస్తుండగా పశ్చిమ దేశాల సంస్థలు ఐదుశాతం వసూలు చేస్తాయి. ఇరవై నాలుగు దేశా వివరాలను చూస్తే వాటి రాబడిలో రుణం-వడ్డీలకు 15శాతం ఖర్చు చేస్తున్నట్లు, చైనాకు 11, పశ్చిమ దేశాల సంస్థలకు 32శాతం చెల్లిస్తున్నట్లు తేలింది. వాస్తవాలు ఇలా ఉన్నా ఆఫ్రికాను చైనా రుణ ఊబిలోకి దించుతుందని ఎవరైనా ఎలా చెప్పగలరు? చైనా కరోనా సమయంలో జి20 కూటమి నిర్ణయం మేరకు రుణాల చెల్లింపును వాయిదా వేసింది తప్ప పశ్చిమ దేశాల ప్రయివేటు సంస్థలు ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. మరోవైపు ఐఎంఎఫ్‌ 2021లో ఇచ్చిన రుణాలకు గాను ఆహారం, ఇంథనం వంటి వాటి మీద ఇస్తున్న రాయితీల కోత లేదా కొత్తగా పన్నుల విధింపు వంటి షరతులను రుద్దింది. రుణాలను తగ్గించుకొనేందుకు అదే ఏడాది పశ్చిమ ఆఫ్రికా దేశాలు 2,680కోట్ల డాలర్ల మేర బడ్జెట్లు తగ్గించుకోవాలని అదేశించింది. చైనా ఇలాంటి షరతులను రుద్దటం లేదు. ఎవరు ఆఫ్రికాకు హాని చేస్తున్నట్లు, ఎవరు మేలు చేస్తున్నట్లు?

Spread the love