పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత కలిదిండి వర్మ (47) గుండెపోటుతో శనివారం ఆకస్మికంగా మృతి చెందారు. ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన ఆయన చేపల మేత కంపెనీలో పని చేస్తూ భీమవరంలో స్థిరపడ్డారు. అనంతరం ఉద్యోగ నిమిత్తం బెంగళూరుకు వెళ్లారు. శనివారం రాత్రి స్నేహితులతో కలిసి టివి చూస్తుండగా గుండెపోటుతో అక్కడే కుప్పకూలి మృతి చెందారు. ఆయనకు తల్లిదండ్రులు, భార్య, కుమార్తె ఉన్నారు. వర్మ రాసిన నేను మాత్రం ఇద్దరిని, గోదారి పలకరింపు పుస్తకాలను ప్రచురితమయ్యాయి. పశ్చిమగోదావరిలోని ఆయన స్వగ్రామంలో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్మ మృతి పట్ల సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది. రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్, ప్రధాన కార్యదర్శి కె.సత్యరంజన్.. వర్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.