రైతు రుణమాఫీ కాంగ్రెస్‌ పార్టీ విజయమే

Farmer loan waiver is a victory of Congress party–  టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రైతు రుణమాఫీ కాంగ్రెస్‌ పార్టీ విజయమని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఉద్యమాలు, పోరాటాలు, ఒత్తిడి ఫలితంగానే సీఎం కేసీఆర్‌ రుణమాఫీ ప్రకటించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి రుణమాఫీ చేయాలని కోరినట్టు తెలిపారు. రుణమాఫీ అమలు చేయకపోతే, బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్‌ మెడలు వంచి రైతుల రుణమాఫీ సాధించామని తెలిపారు. కేసీఆర్‌ అసమర్థత వల్ల రుణమాఫీ నాలుగేండ్లు ఆలస్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీపై అన్ని వడ్డీలతోసహా మొత్తం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ అందేవరకు కాంగ్రెస్‌ రైతులకు అండగా ఉండి పోరాడుతున్నదని పేర్కొన్నారు.
సోయంబాపూరావు విద్వేషాలు రెచ్చగొట్టొదు
కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌
బీజేపీ ఎంపీ సోయంబాపూరావు మాటలు విద్వేషాలు రెచ్చగొట్టొదని కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ హెచ్చరించారు. ఎస్టీ నేతలు ఆయన మాటలు విని ఎంపీకి అవగాహన లేదని మాట్లాడుకుంటున్నారని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అధికార ప్రతినిధులు కల్వ సుజాత, కృష్ణ తేజ, రవితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎంపీగా ఉండి గిరిజనులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. లంబాడీ, కోయ కమ్యూనిటీ వేరు, వేరు కాదనీ, రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. లంబాడీలకు రిజర్వేషన్‌ తొలగించడం సాధ్యం కాదన్నారు.
ఆర్టీసీపై కేసీఆర్‌ది ఎన్నికల కపట ప్రేమ
మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌
ఆర్టీసిపై కేసీఆర్‌ది ఎన్నికల కపట ప్రేమ అని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులను మరోసారి మోసం చేసేందుకు విలీన ప్రకటన చేశారని ఆరోపించారు. ఆర్టీసి కార్మికులు తనకు వ్యతిరేకంగా ఉన్నారంటూ కేసీఆర్‌ హడావిడి ప్రకటన చేశారన్నారు. గతంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదన్నారు. విలీనం డిమాండ్‌ చేసే రాజకీయ పార్టీలకు ఏం తెలియదంటూ ఎద్దేవా చేసిన కేసీఆర్‌…ఇప్పుడు ఎన్నికల కోసం యు టర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ట్యాక్స్‌ ఎందుకు ఎత్తేయడం లేదని ప్రశ్నించారు.
గృహలక్ష్మి పథకంలో ఐదు శాతం కోటా మా విజయమే
కాంగ్రెస్‌ వికలాంగుల చైర్మెన్‌ ముత్తినేని వీరయ్య
గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు ఐదు శాతం కోటా కేటాయించడం తమ సంఘం పోరాట ఫలితమేనని కాంగ్రెస్‌ వికలాంగుల విభాగం చైర్మెన్‌ ముత్తినేని వీరయ్య తెలిపారు. మొదట జీవో ఎంఎస్‌ నెం 25లో వికలాంగుల రిజర్వేషన్‌ మరచిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికలాంగుల హక్కుల చట్టం-2016 ప్రకారం కనీసం 25శాతం లబ్ధి పెంచి ఇవ్వాలనే విషయాన్ని మరచిపోయిందని విమర్శించారు. సొంత స్థలాలు ఉంటేనే ఇది వర్తిస్తుందని తెలిపారు. ఎంత మంది వికలాంగులకు స్థలాలు ఉంటాయని ప్రశ్నించారు. ఈ సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయిందని తెలిపారు. ఇండ్ల నిర్మాణంలో10 శాతం ఇండ్లు కేటాయించాలంటూ జీవో 17ను ఇచ్చిందనీ, దాన్ని సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం చేయడమంటే, అది వికలాంగుల సంక్షేవమానికి గొడ్డలి పెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love