నవతెలంగాణ – ఇల్లంతకుంట : మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామంలో ధాన్యం తరలించడానికి లారీలు రాక పోవడంతో బుధవారం రైతులు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజులుగా ధాన్యం తూకం వేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం చెందారు. తూకం వేసిన ధాన్యాన్ని సకాలంలో మిల్లుకు తరలించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. లారీలు రాక తూకం వేసిన ధాన్యం బస్తాలు ఎండకు ఎండి వానకు నానుతున్నాయని వాపోయారు. లారీ డ్రైవర్లు ఒక బస్తాకు రూ.2చొప్పున వసూలు చేస్తున్నారని, మరోవైపు బస్తాకు 2నుంచి 3 కిలోలు అధిక తూకం వేస్తున్నారని తెలిపారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు రోజుల తరబడి కేంద్రాల్లో ఉండడం వల్ల తరుగు వస్తోందన్నారు. మండుటెండలో ప్రధాన రహదారిపె గంట పాటు ధర్నా చేయడంతో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. స్థానిక ఏఎస్సై మోతీరాం తన సిబ్బందితో వచ్చి సదరు సెంటరుకు రోజువారీగా లారీలు పంపిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.