– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం
నవతెలంగాణ – ఎర్రుపాలెం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యువతను విస్మరిస్తుందని, సంవత్సరానికి కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని యువతకు ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు విమర్శించారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం రామ్‌శెట్టి పుల్లయ్య భవనం నందు నాగలవంచ వెంకట్రామయ్య అధ్యక్షతన జరిగిన ఎర్రుపాలెం జోన్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని పొన్నం మాట్లాడుతూ సీపీఐ(ఎం) అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంలో నిరుద్యోగం గణనీయంగా తగ్గిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పంట నష్ట పరిహారం డబ్బులు వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు వారంలో పరిహారం అందిస్తామని చెప్పి నేటికీ రెండు నెలలుపై బడిన ఇంత వరకు పరిహారం అందలేదని విమర్శించారు. రైతులు పంట నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్నారని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. పంటనష్ట పరిహారం డబ్బులు రైతులకు అందించలేని ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకోవటానికి డబ్బులు ఎలా వస్తాయో తెలపాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి దివ్యల వీరయ్య, తేలప్రోలు రాధాకృష్ణ, గామాసు జోగయ్య, సగుర్తి సంజీవరావు, షేక్ నాగుల మీరా, దేవరకొండ రామకృష్ణ, తోట సాంబశివరావు, దూదిగం బసవయ్య, బుర్రి రవి, షేక్ మస్తాన్, కోటి సుబ్బారెడ్డి, నక్క పుల్లారావు, శ్యామలరావు, కొండపాటి గురవయ్య, కొండపాటి శివయ్య, మాదల మహేష్, పుచ్చకాయల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.