దాడులకు బెదరం..పోరాటం ఆపం..

hut copy– మానుకోటలో పేదల గుడిసెలపై 17వ సారి దాడి
–  ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ భూకబ్జాకోరు
–  ఆయనకు ఓట్లు కాదు.. కోట్లు ముఖ్యం..: సీపీఐ(ఎం) నేతలు జి. నాగయ్య, ఎస్‌. వీరయ్య
నవతెలంగాణ – మహబూబాబాద్‌
మహబూబాబాద్‌ జిల్లా కురవి రహదారిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు వేసుకున్న గుడిసెలను గురువారం తెల్లవారుజామున పోలీసులు 17వ సారి మళ్ళీ నేలమట్టం చేశారని, ఎన్నిసార్లు కూల్చినా మళ్లీ పైకి లేస్తామే కాని దాడులకు బయపడి పోరాటాన్ని ఆపమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌. వీరయ్య స్పష్టంచేశారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ భూ కబ్జాకోరు అని, ఆయన అండతోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు పేదలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదల గుడిసెలను కూల్చిన విషయం తెలుసుకున్న ఆయన.. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌ బృందంతో కలిసి ఘటనాస్థలాన్ని సందర్శించారు. గుడిసెవాసులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం మానుకోట పట్టణంలోని పెరుమాండ్ల జగన్నాథం భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరయ్య మాట్లాడారు.
కురవి రహదారిలో ఉన్న ప్రభుత్వ భూమిలో పేదలు సుమారు రెండువేల మంది గుడిసెలు వేసుకుని ఏడాదిగా నివసిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తున్న స్థానిక ఎమ్మెల్యే బానోతు శంకర్‌ నాయక్‌.. గుడిసెలు వేసుకున్న గిరిజన దళిత పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అధికార యంత్రాంగంతో దాడులు, దౌర్జన్యం చేయిస్తూ ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే.. గుడిసె వాసులు నాన్‌ లోకల్‌ అంటున్నారని, శంకర్‌ నాయక్‌ నాన్‌ లోకల్‌ కాదా అని ప్రశ్నించారు. గుడిసె వాసుల తరపున తమ పోరాటం ఆగదని, కేసులు, దాడులకు భయపడేది లేదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన మేనిఫెస్టోలోనే పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించి.. ఇలా దౌర్జన్యం చేయడమేంటని ప్రశ్నించారు. 19 జిల్లాల్లో 69 కేంద్రాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకున్నారని, కానీ ఎక్కడా లేనివిధంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, మానుకోట ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌.. పేదల గుడిసెలు ఖాళీ చేయించేందుకు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు.
మహబూబాబాద్‌లోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయడం మూలంగానే అంబేద్కర్‌ భవనానికి, దోబీ గాట్లకు జిల్లా కలెక్టర్‌ శంకుస్థాపన చేయగలిగారని తెలిపారు. లేదంటే ఆ స్థలాలు ఎప్పుడో కబ్జా అయి ఉండేవన్నారు. అక్కడ 200 ఎకరాల భూమి ఉన్నదని, అంబేద్కర్‌ భవనం, దోబీ గాట్లకు 20 ఎకరాలు కేటాయించినా ఇంకా 180 ఎకరాలు పేదలకు పంచవచ్చని తెలిపారు. గుడిసెవాసులకు ఎర్రజెండా అండగా ఉంటుందని అన్నారు. జి.నాగయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌.. ఎన్నికల వేళ ప్రచారం చేయకుండా వందలాది ఎకరాల భూములను కబ్జా చేయడం కోసం అధికారాన్ని వినియోగిస్తున్నారని విమర్శించారు. ఆయనకు ఓట్లు కన్నా.. భూములు, కోట్లు ముఖ్యమని విమర్శించారు. ఎమ్మెల్యే బినామీల పేరుతో వందలాది ఎకరాల భూములు సేకరించారని తెలిపారు. గుడిసె వాసులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తాము ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌కు విన్నవించినా.. భూములు ఇచ్చేది లేదంటూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, వరంగల్‌ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ వైఖరి మార్చుకొని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, లేదంటే బీఆర్‌ఎస్‌ను గద్దె దించుతామని హెచ్చరించారు. సమావేశంలో మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుర్ణపు సోమయ్య, ఆకుల రాజు, గునిగంటి రాజన్న, శెట్టి వెంకన్న, అల్వాల వీరన్న, ఆంగోతి వెంకన్న, బానోతు సీతారాం నాయక్‌, సమ్మెట రాజమౌళి, పట్టణ కార్యదర్శి భానోత్‌ సీతారాం పాల్గొన్నారు.

Spread the love