చిత్తశుద్ధి ఉంటే ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి

చిత్తశుద్ధి ఉంటే ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి– ఆ తర్వాతే ఓట్లు అడగాలి :మాజీమంత్రి ఈటల రాజేందర్‌
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని, ఆ తర్వాతే ఓట్లు అడగాలని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఈటల రాజేందర్‌ అన్నారు. హనుమకొండ నయీంనగర్‌ వాగ్దేవి కాలేజీలో మంగళవారం కాలేజీలు, ప్రయివేట్‌ పాఠశాలల యాజమాన్యాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడే ఉపాధ్యాయ, నిరుద్యోగుల, కాలేజీల, పాఠశాలల సమస్యలు గుర్తుకు వస్తాయా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లించే నిజాయితీ ఉందా ? అని అన్నారు. లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకుండా, కేవలం కాంట్రాక్టర్స్‌కి బిల్లులు చెల్లించడానికే ప్రాధాన్యత ఇస్తారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల భృతి ఇస్తామని ప్రియాంకాగాంధీతో చెప్పించారు కదా ఆరు నెలలైనా ఆ ఊసే లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉండగా, 2023 జులైలో కొత్త పీఆర్సీ రావాల్సి ఉన్నా ఇప్పటివరకు చెల్లించలేదన్నారు.
కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది కాబట్టి బండకేసి కొట్టారని, తమరికి కూడా ఇది తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీని గెలిపిస్తే పిల్లిలాగా కూర్చుంటారు తప్ప పట్టభద్రుల కోసం చేసేదేమీ ఉండదని, అందుకే ప్రశ్నించే గొంతుక గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, రావు పద్మ, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, వాగ్దేవి కళాశాల యాజమాన్యం సిహెచ్‌. దేవేందర్‌ రెడ్డి, డాక్టర్‌ విజయచందర్‌ రెడ్డి, సర్వోత్తమ్‌ రెడ్డి, జనార్దన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love