ఏపీలో ‘ఫైటింగ్‌’.. ఇక్కడ బెట్టింగ్‌

'Fighting' in AP.. Betting here– ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో జోరుగా పందేలు
– రూ.లక్షల్లో పందేలు కాస్తున్న ‘రాజకీయ’ అభిమానులు
– రూ.లక్షలు మధ్యవర్తులకు ముట్టజెప్పి మరీ తంతు
– జూన్‌ 4 నాటికి రూ.కోట్లలో సాగనున్న బెట్టింగ్‌
– ఖమ్మంలో కాంగ్రెస్‌ మెజార్టీ.. బీజేపీ ఓట్ల పైన కూడా.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కాక పుట్టిస్తున్నాయి. అక్కడి ఎన్నికలపై ఇక్కడ జోరుగా బెట్టింగ్‌ సాగుతోంది. అధికార మార్పిడి ఉంటుందా? వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీల్లో ఎవరికెన్ని సీట్లు వస్తాయి? పెరిగిన ఓటింగ్‌ ఆ రాష్ట్రంలో ఎవరికి లాభిస్తుంది? పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురంలో గెలుస్తాడా? చంద్రబాబు కుప్పంలో గెలవటం ఖాయమేనా..? జగన్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందా? ఇలాంటి అనేక అంశాలతో పాటు కొన్ని కీలక స్థానాలపైనా బెట్టింగ్‌ కొనసాగుతోంది. ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల గెలుపోటములపైన కూడా పందేలు కాస్తున్నారు. వృద్ధులు, మహిళలు, పేదలు, గ్రామీణ ప్రాంత ఓటింగ్‌ పెరగటం ఏపీ ప్రభుత్వానికి సానుకూలమా? ప్రతికూలమా? అని కూడా ఆరా తీసి.. బెట్టింగ్‌కు దిగుతున్నవారూ ఉన్నారు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి కూడా సమాచారం సేకరిస్తుండటం గమనార్హం. తెలంగాణ లోక్‌సభ ఫలితాల కన్నా.. కేంద్రంలో అధికార మార్పడికన్నా.. ఏపీ ఎన్నికల పైనే సరిహద్దు ప్రాంతాల్లో చర్చ జరుగుతుండటం.. రాజకీయాలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే వారు బెట్టింగ్‌లకు పాల్పడటం కనిపిస్తోంది.
మధ్యవర్తులు.. బాండ్ల రూపంలో..
రూ.5వేలు మొదలు రూ.10 లక్షల వరకు సాగుతున్న ఈ బెట్టింగ్‌లన్నీ ముగ్గురు, నలుగురు ఓ బృందంగా ఏర్పడి పందేలు కాస్తున్నారు. విడివిడిగానూ పందేలు కాసే వారూ ఉన్నారు. డబ్బులున్న వాళ్లు మధ్యవర్తికి రూ.లక్షలు ముట్టజెప్పి బాండ్‌ పేపర్లపై సంతకాలు చేస్తూ.. సాక్షులతోనూ సంతకాలు చేయిస్తున్నారు. డబ్బులు లేనివారు రూ.లక్షల విలువ చేసే భూములు, ప్లాట్‌లను తాకట్టు పెట్టి మరీ పందేలు కాస్తున్నారు. బాండ్‌ పేపర్లు, ప్రాంసరీ నోట్ల మీద అగ్రిమెంట్‌ చేసుకుంటున్నారు. ఇప్పటికే మొదలైన ఈ బెట్టింగ్‌ ప్రహసనం జూన్‌ 4వ తేదీ ఫలితాల వరకు సాగే అవకాశం ఉంది. అంటే దాదాపు రూ.కోట్లలో డబ్బులు మారే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఎగ్జిట్‌, ఒపీనియన్‌ పోల్స్‌ నిషేధించిన నేపథ్యంలో గతంలో సర్వేలు, పోలింగ్‌ సరళి, విశ్లేషకుల అంచనాలు, మీడియాలో కథనాల ఆధారంగా బెట్టింగ్‌ చేస్తున్నారు. ఏపీలో పరిచయమున్న జర్నలిస్టులు, రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఆ రాష్ట్ర బంధుమిత్రులకు ఫోన్లు చేసి ఆరా తీస్తూ పందేలు కాస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంతో పాటు సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాలు, భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఈ తరహా పందేలు ఎక్కువగా సాగుతున్నట్టు సమాచారం. అగ్రిమెంట్‌ చేసుకున్న బాండ్లను బయటపెట్టేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. వాటిని చూపిస్తున్నారు కానీ ఫొటో తీసుకునేందుకు మాత్రం ఇవ్వట్లేదు. కొందరైతే పందెం ఓడినవాళ్లు స్నేహితులకు మందు, విందులు ఇవ్వాలనే ఒప్పందం కూడా చేసుకుంటుండటం గమనార్హం.
పార్టీ సొసైటీలు ఉన్నచోట మరీ ఎక్కువగా…
సామాజిక కోణంలో ఏపీ.. పార్టీల వారీగా విడిపోయింది. అదే సంస్కృతి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనూ ఉంది. ముఖ్యంగా ఖమ్మం నగరంలోని కొన్ని కాలనీలు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గంలోని కొన్ని ఏరియాల్లో ఇది కనిపిస్తోంది. వేంసూరు, ఎర్రుపాలెం, మధిర, బోనకల్‌, చింతకాని, కల్లూరు తదితర మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా పరిస్థితి ఉంది. అటువంటి చోట జగన్‌, వైఎస్‌ఆర్‌సీపీ ఫ్యాన్స్‌ ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. టీడీపీ, జనసేన అభిమానులు ఎన్డీఏ కూటమికి పీఠం దక్కుతుందని పందేలు వేస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌, చంద్రబాబు గెలుపోటములపైనా బెట్టింగ్‌లు పెడుతున్నారు. టీడీపీకి వందకు పైన స్థానాలు వస్తాయని కొందరు అంటుంటే.. 2019 కన్నా కొన్ని సీట్లు తగ్గినా 100-130 స్థానాలతో మళ్లీ జగనే సీఎం అవుతారని పందేలు కడుతున్నారు. పార్టీ సొసైటీలున్న ప్రాంతాల నుంచి ఏపీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అనేక మంది ఈ తరహా బెట్టింగ్‌లపై అమితాసక్తి చూపుతున్నారు. ఈ ఫలితాలపై కొందరు స్నేహితుల మధ్య కూడా మనస్పర్థలు, గొడవలు జరుగుతుండటం గమనార్హం. ముఖ్యంగా రెస్టారెంట్లు, మద్యం సిట్టింగ్‌ల వద్ద పొలిటికల్‌ డిస్కషన్స్‌ ఎక్కువగా జరిగి విభేదాలకు దారితీస్తున్నాయి. ఏపీలోని ఉమ్మడి కృష్ణ, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల నుంచి అనేక మంది ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌ తదితర జిల్లాల్లో స్థిరపడ్డారు. వీరు ఏపీ పరిస్థితులపై ఆరా తీసి.. అవసరమైతే అక్కడికి వెళ్లి తెలుసుకొని మరీ బెట్టింగ్‌ చేస్తున్నారు.
ఖమ్మం లోక్‌సభ మెజార్టీపైన కూడా..
విచిత్రమేమంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అనేక మంది ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ గెలవాలని ఆకాంక్షిస్తుంటే.. మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఖమ్మం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌కు చెందినవారు ‘కూటమి’ గెలుపును కాంక్షిస్తున్నారు. ఈ గందరగోళ సమీకరణాల కారణంగానే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయి ఒకటి బీజేపీకి, మరొకటి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి రెండు లక్షలకు పైగా మెజార్టీ, లక్ష ఆధిక్యతతో గెలుస్తారని కూడా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. మధిర నియోజకవర్గంలో కొన్నిచోట్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కొద్దిపాటి ఓట్లతోనైనా బయటపడతారని బెట్టింగ్‌లు పెడుతుండటం గమనార్హం. ఇక బీజేపీకి వచ్చే ఓట్లపైనా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో 24వేల పైచిలుకు ఆ పార్టీకి వచ్చాయి. ఈసారి డిపాజిట్‌ దక్కుతుందని, దక్కదని కొందరు పందేలు పెడుతున్నారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికలపై బెట్టింగ్‌ మాత్రం నామమాత్రంగానే సాగుతోంది.

Spread the love