– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువలో నీళ్లు నింపాలని, వరద కాలువ ఆయకట్టు గ్రామాల రైతాంగానికి వరదకాలువ సాగునీరే ఎంతో ముఖ్యమని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వారంలోగా రివర్స్ పంపింగ్ ప్రతిపాదనలు సిద్ధం చేసి, వరద కాలువ అయకట్టు గ్రామాల చెరువులు నింపాలన్నారు.సబ్ కాంట్రాక్టర్ల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించి వరద కాలువ నుండి సాగుకు నీరు అందించే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గురువారం వేల్పూర్ మండల కేంద్రంలోని తన స్వగృహం నుండి ఇరిగేషన్ శాఖ ఈఈ లాల్ సింగ్‌తో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడారు.నియోజకవర్గ పరిధిలోని గాండ్లపేట్ వద్ద వరద కాలువ మరమ్మత్తు పనులు దాదాపు పూర్తి అయినందున ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు.
వరద కాలువను రివర్స్ పంపింగ్ ద్వారా నింపి, ఆయకట్టు గ్రామాల రైతాంగానికి సకాలంలో సాగునీరు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను కోరారు.ఇటీవల దెబ్బతిన్న వరద కాలువ మరమ్మత్తు పనులు పూర్తి అయినందున సబ్ కాంట్రాక్టర్ల మధ్య నెలకొన్న చిన్నపాటి ఇబ్బందిని ఇరిగేషన్ ఈఈ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ప్రశాంత్ రెడ్డి.. తక్షణమే ఇరు వర్గాల కాంట్రాక్టర్లతో మాట్లాడి, ఒకట్రెండు రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.రైతుల ప్రయోజనాల దృష్ట్యా పనులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని, అవసరమైతే తాను కూడా స్వయంగా ప్రధాన కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
రాబోయే వారం, పది రోజుల్లో రివర్స్ పంపింగ్ విధానం ద్వారా వరద కాల్వకు నీటిని తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. వరద కాల్వపై ఏర్పాటు చేసిన తూముల ద్వారా నియోజకవర్గంలోని కాలువ పరిది గ్రామాల చెరువులు నింపడానికి, ఆయా గ్రామాల రైతాంగానికి సాగునీరు అందించడానికి ఈ వరద కాలువే ఏకైక ఆధారమని ఆయన గుర్తుచేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు తక్షణమే నివేదికలు పంపాలని, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఈఈని కోరారు .ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లో 15.2 టీఎంసీల నీటి నిల్వ ఉందని, ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి 14 గేట్లు ఎత్తి 5.2 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఈఈ లాల్ సింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ఎస్సారెస్పీ నుంచి గానీ లేదా కింది నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా గానీ వరద కాల్వను పూర్తిగా నింపి, ఈ సీజన్‌లో రైతులకు ఎలాంటి సాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.



