పార్టీపై అసంతృప్తితో … బీజేపీకి సినీనటి గౌతమి రాజీనామా

నవతెలంగాణ హైదరాబాద్: ప్రముఖ సినీ నటి గౌతమి (Gautami) బీజేపీ (BJP)కి రాజీనామా చేశారు. ఆ పార్టీతో తన పాతికేండ్ల అనుబంధం తెగిపోయిందని ప్రకటించారు. పార్టీ నుంచి తనకు ఎటువంటి సహకారం లభించడం లేదని, పైగా ఆర్థిక లావాదేవీల విషయంలో తనను మోసం చేసిన ఓ వ్యక్తికి కొంతమంది సీనియర్‌ నేతలు అండగా నిలిచినట్టు ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఓ ప్రకటన పోస్టు చేశారు.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు రాజపాళయం టికెట్‌ ఇస్తానని హామీ ఇచ్చి.. చివరి నిమిషంలో మొండిచెయ్యి చూపించారన్నారు. ఇదిలా ఉండగా.. స్థిరాస్తుల విషయంలో అళగప్పన్‌ అనే వ్యక్తి తనను మోసం చేశారంటూ పోలీసులకు గౌతమి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ‘డబ్బు, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్‌ల విషయంలో మోసం చేసిన వ్యక్తిపై కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి 40 రోజులు గడిచినా.. అతడు తప్పించుకు తిరిగేలా పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు సాయం చేస్తున్నారు. అయినప్పటికీ.. పార్టీ పట్ల నిబద్ధతను నిలబెట్టుకున్నాను. కానీ, పాతికేండ్లు నేను ఆ పార్టీకి సేవ చేసినా.. నాకు మద్దతు కరవైంది’ అని గౌతమి పేర్కొన్నారు. నిరాశతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. రాజీనామాతో పాటు గౌతమి సి. అళగప్పన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అతను తనను మోసం చేశాడని, ఫలితంగా ఆమె తన డబ్బు, ఆస్తి, ముఖ్యమైన పత్రాలను కోల్పోయిందని తెలిపారు. తమిళనాడు(thamilnadu) ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(M. K. Stalin), పోలీసులు,  న్యాయవ్యవస్థపై తనకున్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన గౌతమి(Gautami).., తన పోరాటం తనకు న్యాయం చేయడమే కాకుండా తన బిడ్డ భవిష్యత్తు కోసం కూడా అని నొక్కి చెప్పారు.

Spread the love