‘ఎంపీ’ కన్నా ‘ఏపీ’పైనే ఫోకస్‌

 Focus on 'AP' rather than 'MP'– ఏపీ ఎన్నికల ఫలితాలపై ఖమ్మంలో ఉత్కంఠ
– కూటమిపై ఆశతో అమరావతిలో రియల్టర్ల పెట్టుబడులు
– జోరుగా బెట్టింగ్‌లు.. ఆస్తులు, ఇండ్ల తాకట్టు
– రూ.50వేల నుంచి రూ.కోట్ల వరకూ సాగుతున్న పందేలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లువలా వెలువడుతున్నాయి. తదనుగుణంగా బెట్టింగ్‌లు మరింత ఊపందుకున్నాయి. మరొక రోజులో (ఈనెల 4వ తేదీన) ఫలితాలు రానున్న నేపథ్యంలో వివిధ పార్టీల అభిమానులు బెట్టింగ్‌ వేగం పెంచారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో విడతలో మే 13వ తేదీన ఎన్నికలు పూర్తయ్యాయి. నాటి నుంచి ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నికల కంటే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపైనే ఎక్కువగా బెట్టింగ్‌ సాగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలవుతుండటంతో బెట్టింగ్‌ మరింతగా ఊపందుకుంది. ఆరా అనే ఓ సర్వే సంస్థ ఎగ్జిట్‌పోల్స్‌తో శనివారం కొద్ది గంటల్లోనే రూ.20 కోట్ల బెట్టింగ్‌ను సాగించినట్టు తెలుస్తోంది.
ఇండ్లు, ఆస్తులు తాకట్టు.. అమరావతిలో భూముల కొనుగోళ్లు
ఇప్పటికే ఇండ్లు, ఆస్తులు తాకట్టుపెట్టి పలువురు పందేలు కాస్తున్నారు. వైఎస్సార్‌సీపీ 110కి పైగా స్థానాల్లో నెగ్గుతుందని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అభిమానులు రూ.లక్షల్లో బెట్టింగ్‌ పెడుతున్నారు. దానికి దీటుగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొందరు పందేలు కాస్తున్నారు. భద్రాచలంలో ఓ యువకుడు జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని రూ.33 లక్షలు పందెం కాశాడు. అదే సమయంలో పవన్‌కల్యాణ్‌ పిఠాపురంలో ఓడిపోతారని మరో రూ.3లక్షలు మొత్తంగా రూ.36 లక్షలు అతను బెట్‌ పెట్టడంతో పాటు వెంటనే మధ్యవర్తికి ఆ మొత్తం ఇచ్చేశాడు. ఖమ్మం రూరల్‌ మండలం వెంకటాయపాలెంకు చెందిన ఓ వ్యక్తి ఖమ్మంలో తనకున్న రూ.40 లక్షల విలువ చేసే ప్లాట్‌ను తాకట్టుపెట్టి టీడీపీకి అనుకూలంగా బెట్టింగ్‌ పెట్టాడు. ఇదే మండలంలోని పెద్దతండాకు చెందిన ఓ వ్యక్తి జగన్‌ మళ్లీ సీఎం అవుతారని రూ.50లక్షలకు పైగా విలువ చేసే ఇంటిని తాకట్టుపెట్టాడు. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌ సాగుతోంది.
అమరావతిపై ‘రియల్‌’ చూపు..
ఎన్డీఏ కూటమి విజయంపై నమ్మకంతో ఓ సామాజిక తరగతికి చెందిన రియల్‌ వ్యాపారులు అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారు. భూములు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే 1/4 వంతు చెల్లించి ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఇలా పెట్టుబడులు పెట్టిన వారు వైఎస్సార్‌సీపీ వస్తే పరిస్థితి ఏంటని భయాందోళనతోనూ ఉన్నారు. కొద్దిరోజుల క్రితం వరకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లో భూముల కొనుగోలు కోసం పరిశీలించిన వీరంతా అనూహ్యంగా అమరావతిపై దృష్టి సారించటం ఆసక్తి గొలుపుతోంది.
మంత్రుల అనుచరులు విభిన్నంగా బెట్టింగ్‌
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు భట్టివిక్రమార్క అనుచరులు విభిన్నంగా బెట్టింగ్‌కు దిగుతున్నారు. కొందరు వైఎస్సార్‌సీపీకి, మరికొందరు ఎన్టీఏ కూటమికి అనుకూలంగా పందేలు కాస్తున్నారు. నలుగురైదుగురు అనుచరులు కలిసి ఓ గ్రూప్‌గా ఏర్పడుతున్నారు. దానిలోనే ఓ గ్రూపు వైఎస్సార్‌సీపీకి, మరో గ్రూపు టీడీపీకి అనుకూలంగా బెట్టింగ్‌ పెడుతోంది. తలా రూ.50వేల చొప్పున నలుగురు కలిసి రూ.2 లక్షల వరకు ఈ బెట్టింగ్‌ పెడుతున్నారు. పవన్‌కళ్యాణ్‌ గెలుపోటములపైనా పందేలు కాస్తున్నారు. కొందరు ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయంపై బెట్టింగ్‌ పెట్టారు. ఆయన 2.05 లక్షల మెజార్టీతో గెలుస్తారని పందెం కాశారు. మరికొందరు లక్ష ఓట్లకు పైన మెజార్టీ సాధిస్తారని బెట్‌ పెట్టారు.
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు సైతం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు లక్ష మంది వరకు ఐటీ ఉద్యోగులు ఉంటారు. వీరిలో ఎక్కువ మంది ఓ మూడు సామాజిక తరగతులకు చెందినవారే. వీరు అమెరికా మొదలు వివిధ దేశాల్లో ఉన్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైతో పాటు వర్క్‌ఫ్రమ్‌ హౌమ్‌ జాబ్స్‌ చేస్తున్నారు. వీరు కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఒక్కొక్కరు రూ.50వేల నుంచి రూ.లక్షకు పైగా బెట్టింగ్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఏపీలో ఉండే తమ ఫ్రెండ్స్‌, బంధువులతో మాట్లాడి బెట్టింగ్‌ చేశారు. శనివారం నుంచి ఎగ్జిట్‌పోల్స్‌ విడుదల అవుతుండటంతో తదనుగుణంగా పందేలు కాస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.

Spread the love