‘వందేభారత్‌’లో ఫుడ్‌ ఆర్డర్‌..

– ప్రయాణికుడు షాక్‌
భోపాల్‌ : వందేభారత్‌ రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి ఇటీవల షాకింగ్‌ అనుభవం ఎదురైంది. రైల్లో తనకు ఇచ్చిన చపాతీల్లో బొద్దింక కనబడటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు సోషల్‌ మీడియాలో ఐఆర్‌సీటీసీకి ఫిర్యాదు చేశాడు. జూలై 24న భోపాల్‌ నుంచి గ్వాలియర్‌ వెళుతున్న రైల్లో ఈ ఘటన వెలుగు చూసింది. తనకిచ్చిన ఆహారం పార్శిల్‌లోని చపాతీపై బొద్దింకను సుబోధ్‌ పహలాజన్‌ గుర్తించాడు. వెంటనే దాన్ని ఫొటో తీసి నెట్టింట్లో షేర్‌ చేస్తూ ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేశారు. ”వందేభారత్‌ రైల్లో నాకు ఇచ్చిన ఫుడ్‌లో బొద్దింక కనిపించింది” అని ట్వీట్‌ చేశారు. ఈ ఫిర్యాదుపై రైల్వే శాఖ వెంటనే స్పందించింది. ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పిన రైల్వే శాఖ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. పీఎన్‌ఆర్‌ నెంబర్‌, ఇతర వివరాలను నేరుగా మెసేజ్‌ చేస్తే తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Spread the love