Wednesday, July 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇంకెన్నాళ్లు!

ఇంకెన్నాళ్లు!

- Advertisement -

తుమిళ్లతో ​రైతుల ఆశలు అడియాసలు
ప్రతిపాదనలకే పరిమితం… నిధులు లేక నిలిచిన పనులు
ఎత్తిపోతలపై మందకొడి చర్యలు
మల్లమ్మకుంట రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు నిర్ణయం
ఆర్డీఎస్ పూర్తివాటా వినియోగానికి ఇదే మార్గం
సీఎంకు నివేదించిన ఇరిగేషన్ అధికారులు
భూ సేకరణకు సిద్ధమైన ప్రభుత్వం

నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
గద్వాల జిల్లా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)ను పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి. నీటి వాటా వినియోగానికి చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఫేజ్-2పై ముందడుగు పడకపోవడం వల్ల తుంగభద్ర నీటిని పూర్తిగా వాడుకోలేని దుస్థితి. దశాబ్దకాలంగా ఆర్డీఎస్ నుంచి రావాల్సిన 15.9 టీఎంసీల నీటి వాటా రావడం లేదు, ఆర్డీఎస్‌లో పూడిక పేరుకుపోవడం, కాల్వలు సక్రమంగా లేకపోవడం, కర్నాటక అక్రమంగా వాడుకోవడంతో 6 టీఎంసీల నుంచి 7టీఎంసీల వరకు నీళ్లు రావడం లేదని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. అదే విధంగా ఆర్డీఎస్ ఆయకట్టు మాజీ చైర్మెన్ తనగల సీతారాంరెడ్డితో పాటు రైతులు ఆర్డీఎస్ పరిస్థితిపై సీఎంకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తుమ్మిళ్ల ప్రాజెక్టుపై చర్చ జరగగా ఫేజ్-1లో పంపు హౌజ్‌లతో పాటు ఆర్డీఎస్ కాలువ వరకు పైపులైన్ పూర్తి చేసి ఎత్తిపోస్తున్నామని, ఫేజ్-2లో నిర్మించాల్సిన రిజర్వాయర్లు పూర్తికాక పోవడంతో పూర్తిస్థాయిలో సాగునీటిని అందించలేకపోతున్నామని అధికారులు వివరించారు.

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం స్వరూపం
ఏపీ, కర్నాటక రాష్ట్రాలతో ఆర్డీఎస్ రైతాంగానికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 15.9 టీఎంసీల పూర్తి వాటా వినియోగానికి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకుంది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం 2017లో రూ.783కోట్లతో నిర్మించేందుకు జీఓ జారీ చేసింది. 2018 జనవరి 9న అప్పటి సీఎం శంకుస్థాపన చేశారు. మొదటి విడతలో రూ. 389 కోట్లతో ఎత్తిపోతల పథకం, పంపులు, పైపులైన్ నిర్మాణం పూర్తి చేశారు. 2019 ఆగస్టు 14న నీటిని ఎత్తిపోసి ఆర్డీఎస్ కాలువకు లింక్ చేశారు. రెండవ దశలో రూ. 386 కోట్లతో మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూరు రిజర్వాయర్లు నిర్మించాలి. కానీ మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు మాత్రమే పరిపాలన అనుమతులు వచ్చాయి. అప్పటి నుంచి రెండవ దశ పెండింగ్‌లోనే ఉంది. మొదటి దశ పూర్తి అయినా రిజర్వాయర్లు లేకపోవడంతో పూర్తిస్థాయిలో సాగుకు నీరందించలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టి నడిగడ్డ రైతులను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మల్లమ్మకుంట రిజర్వాయర్ విస్తరణ
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో ఫేజ్-2లో నిర్మిం చాల్సిన మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు రిజర్వా యర్లలో మల్లమ్మకుంట రిజర్వా యర్‌కు మాత్రమే పరిపాలన అనుమతులొచ్చాయి. సీఎం సమీక్ష సం దర్భంగా పరిపాలన అనుమతులు ఉన్న మల్లమ్మ కుంట రిజర్వాయర్ సామర్థ్యం 1.10 టీఎంసీల నుంచి 6 టీఎంసీలకు విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను తయారు చేయా లని అధికారులను ఆదేశించారు. అయితే మల్లమ్మ కుంట రిజర్వాయర్‌కు 567ఎకరాలు భూసేకరణ చేయాలని గతంలో నిర్ణయించారు. విస్తరిస్తే మరింత భూసేకరణ చేయాల్సి ఉంటుంది. చాలా ఏండ్ల నుంచి భూసేకరణకు అధికారులు ప్రయత్నించినా రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది. అయితే మూడు నెలల కింద భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినా ఫైనల్ నోటిఫికేషన్ పెండింగ్‌లో పెట్టారు.

విస్తరిస్తేనే చివరి ఆయకట్టుకు సాగునీరు
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో భాగమైన మల్లమ్మకుంట రిజర్వాయర్ విస్తరణ పూర్తయితేనే ఆర్డీఎస్ చివరి ఆయకట్టు 42వ డిస్ట్రిబ్యూటరీ వరకు సాగునీరు అందించొచ్చు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం వద్ద మూడు పంపులను ఏర్పాటు చేయగా అందులో రెండు పంపులకు సంబంధించిన నీటి పారుదలను పైపుల ద్వారా నేరుగా ఆర్డీఎస్ కాల్వకు లింక్ చేశారు. వీటిలో ఒక పంపు ద్వారా సాగునీరు అందుతుంది. 70రోజుల పాటు ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ సుంకేసుల బ్యారేజీలో నీటి లభ్యత లేని సమయంలో పంపులను ఆఫ్ చేయాల్సిన పరిస్థితి. దీంతో ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు మళ్లీ ఇబ్బందిలో పడుతున్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్‌ను విస్తరించి నిర్మిస్తే 6టీఎంసీల వరకు నిల్వచేసుకోవడానికి వీలుంటది. ఇప్పటికే మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మించే తనగల గ్రామం వరకు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పైపులైన్ నిర్మాణం పూర్తి అయ్యింది. రిజర్వాయర్ నిర్మించడమే ఆలస్యం. ఇది జరగాలంటే రైతులు సహకరించడంతో పాటు ప్రభుత్వం ఫేజ్-2లో నిధులు విడుదల చేయాలి.​

నాణ్యతాలోపం వల్ల ఒక మోటారుతో నీళ్లు ఎత్తిపోస్తేనే తట్టుకోలేని బలహీనమైన కాలువలు. షట్టర్లు లేని తూములు. అస్తవ్యస్తంగా మారిన డిస్ర్టిబ్యూటరీలు. వీటి మరమ్మతుల కోసం పంపిన రూ. 61 కోట్ల ప్రతిపాదనలు మంజూరీకి నోచుకోలేదు. రెండో దశలో చేపట్టాల్సిన జలాశయాల నిర్మాణాలు ముందుకు సాగడంలేదు. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమవడంతో రైతుల ఆశలు అడియాస లవు తున్నాయి. ఎట్టకేలకు తుమ్మిళ్ల పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మరలా రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. మల్లమ్మకుంట రిజర్వాయర్‌ తో పాటు ఆర్డీఎస్ వాటా పూర్తిగా వినియోగించుకునే‌లా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. పక్కనే ఉన్న తుంగభద్రా నది నీటిని పూర్తిగా ఉపయోగించుకుంటే నడిగడ్డ ప్రాంతం సస్యశ్యామలమవుతోందని రైతులు, రైతు సంఘాలు చెబుతున్నాయి.

ప్రాజెక్టు పూర్తి చేసి నడిగడ్డకు సాగునీరివ్వాలి
కృష్ణా, తుంగభద్ర నదులు సమీపంలో ఉన్నా.. నడిగడ్డకు సాగు నీరు అందడం లేదు. ఏండ్ల తరబడి ఆర్డీఎస్ పనులు పెండింగులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందునుంచే ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురౌతూ వస్తోంది. ఇప్పటికైనా తుమ్మిళ్ల లిప్టును పూర్తి చేసి ఆర్డీఎస్‌కు లింకు చేయాలి. తద్వార ఫేజ్-2 పనులు పూర్తి చేసి నడిగడ్డకు సాగు నీరివ్వాలి. లేనిచో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు.
వెంకటస్వామి, గద్వాల సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -