గుజరాత్‌లో ఐసిస్‌ కుట్ర భగం.. నలుగురి అరెస్టు

న్యూఢిల్లీ : గుజరాత్‌ పోలీసు యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఎటిఎస్‌) భారీ ఉగ్ర కుట్రను భగం చేసింది. పోర్బందర్‌ పట్టణంలో ఇస్లామిక్‌ స్టేట్‌ మాడ్యూల్‌ గుట్టు రట్టు చేసింది. ఒక మహిళతో సహా నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసింది. అరెస్టయిన నలుగురు వ్యక్తులు ఐసిస్‌ టెర్రర్‌ మాడ్యూల్‌లో భాగమేనని అందిన సమాచారం మేరకు ఎటిఎస్‌ సిబ్బంది దాడులు నిర్వహించారు. నిందితులంతా ఓ ఏడాది నుంచి సంబంధాలను కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు. దేశం విడిచి వెళ్లడానికి, ఐసిస్‌ ఉగ్రవాద సంస్థలో చేరడానికి వీరు ప్రణాళిక రచిం చారని తెలిపారు. డిఐజి దీపన్‌ భద్రన్‌, ఎస్పీ సునీల్‌ జోషీ నేతృత్వంలో జరిగిన దాడుల్లో సుమేర అనే మహిళతోపాటు, ముగ్గురు పురుషులను శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి అనేక నిషిద్ధ వస్తువులను వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్స్‌ వీరిని రాడికలైజ్‌ చేసినట్లు గుర్తించారు. కాగా, కొన్ని రోజుల క్రితం అహ్మదాబాద్‌లో ముగ్గురు అనుమానిత ఐసిస్‌ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు.

Spread the love