ఇర్బిల్ (ఇరాక్): ఇరాక్, సిరియాలోని లక్ష్యాలపై ఇరాన్ దాడులు జరిపింది. ఇరాన్ వ్యతిరేక తీవ్రవాద గ్రూపుల సమావేశంపై గూఢచారి కార్యాలయంపై దాడులు చేపట్టినట్లు ఇరాన్ సోమవారం పొద్దు పోయిన తర్వాత తెలిపింది. ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతానికి చెందిన ఇర్బిల్‌పై పలు క్షిపణులతో దాడులు జరిపినట్లు తెలిపింది. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. అమెరికా కాన్సులేట్‌కు సమీపంలో జరిగిన ఈ దాడిలో దాదాపు పది క్షిపణులు పడ్డాయని ఇరాకీ మిలీషియాకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. ఈ దాడుల్లో నలుగురు పౌరులు మరణించగా, ఆరుగురు గాయపడ్డారని కుర్దిష్ ప్రాంతీయ ప్రభుత్వ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. రియల్ ఎస్టేట్, సెక్యూరిటీ సర్వీసెస్‌లతో సహా పలు స్థానిక వ్యాపారాల్లో పేరొందిన పీష్రా దిజాయి ఆయన కుటుంబ సభ్యులు ఈ దాడుల్లో మరణించారు. ఇరాక్ మాజీ ఎంపి మాషన్అల్ జబౌరి ఈ మేరకు ఎక్స్‌్‌లో పోస్టు పెట్టారు. మాజీ ఎంపి నివాసానికి పక్కనే గల దిజాయి ప్యాలెస్‌పై క్షిపణులు పడ్డాయని ఆయన తెలిపారు. ఆ వెంటనే, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్్ నుండి ఒక ప్రకటన వెలువడింది. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ లక్ష్యాలతో సహా తీవ్రవాద కార్యకలాపాలపై దాడి చేసినట్లు తెలిపింది. అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి ఆ లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతంలో ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ హెడ్ క్వార్టర్స్‌పై కూడా దాడి చేసినట్లు మరో ప్రకటన వెలువడింది. కాగా ఒక్కసారిగా ఈ దాడులతో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. గాజాపై కొనసాగుతున్న దాడులతో ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రికత్తలకు తాజాగా ఈ దాడులు మరింత ఆజ్యం పోశాయి. ఈ నెల ప్రారంభంలో ఇరాన్ జనరల్ సంస్మరణార్ధం జరిగిన కార్యక్రమంలో రెండు ఆత్మాహుతి దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద గ్రూపు ప్రకటించింది. ఆ దాడిలో 84మంది చనిపోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఆ నేపథ్యంలో ఇరాన్ ఈ దాడులకు పాల్పడిందని భావిస్తున్నారు.