నాలుగు నామినేషన్లు తిరస్కరణ

– 45 మంది నామినేషన్‌…41 మంది అభ్యర్థుల గుర్తింపు
– ముగిసిన నామినేషన్ల స్క్రూటినీ
– ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గౌతమ్‌
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి నామినేషన్‌ ప్రక్రియ ముగిసిందని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో లోక్‌సభ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్‌ సంజరు జి.కోల్టే, పోలీస్‌ పరిశీలకులు చరణ్‌ జీత్‌ సింగ్‌, వ్యయ పరిశీలకులు అరుణ్‌ ప్రసాత్‌ కృష్ణ సామి, శంకర ఆనంద్‌ మిశ్రా, పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌, డిఎఫ్‌ఓ సిద్దార్థ్‌ విక్రమ్‌సింగ్‌లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని, స్క్రూటినీ కూడా చేయడం జరిగిందని, ఖమ్మం పార్లమెంట్‌ బరిలో 45 మంది అభ్యర్థులు 72 నామినేషన్లు వేశారని తెలిపారు. 72 నామినేషన్లు స్క్రూటినీ పూర్తి చేసి నలుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్లు తెలిపారు. 41 మంది అధికారికంగా అభ్యర్థులను గుర్తించామని అన్నారు. 29వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని, అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారి వద్దకు వచ్చి ఉపసంహరణ చేసుకోవాలని అన్నారు. ఉపసంహరణ గడువు పూర్తి అయిన తరువాత గుర్తులు కేటాయిస్తామని పేర్కొన్నారు.
ఓటరు స్లిప్‌లు పంపిణీ కూడా మొదలైందని, ఈవిఎం మిషన్ల కేటాయింపు కూడా జరిగిందన్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్ద నుండే ఓటు వేసే అవకాశం కల్పించామన్నారు. వచ్చే నెల 3 నుండి 8 వరకు ఇంటినుండి ఓటు వేయడం మొదలవుతుందని తెలిపారు. 2,930 మంది హౌం ఓటింగ్‌కు అప్లరు చేశారని, వారికి రహస్య ఓటింగ్‌ ద్వారా ఓటింగ్‌ వేసే అవకాశం ఉంటుందని అన్నారు.
ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 1896 పోలింగ్‌ కేంద్రాలు, 1084 లోకేషన్లలో ఉన్నాయన్నారు. మొత్తం 16,31,039 మంది ఓటర్లు ఉన్నట్లు, ఇందులో 7,87,160 మంది పురుష, 8,43,749 మంది మహిళా, 130 మంది ట్రాన్సజెండర్లు ఉన్నారన్నారు. గురువారం నుండి ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రారంభించినట్లు, 1,01,616 ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. ఓటరు స్లిప్పులు కేవలం ఓటర్లకు సమాచారం మాత్రమేనని, పోలింగ్‌ కేంద్రానికి వచ్చేప్పుడు ఎన్నికల సంఘం సూచించిన ఏదేని గుర్తింపు కార్డు వెంట తేవాలన్నారు. 103 లోకేషన్లలో 230 క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. వందశాతం పోలింగ్‌ కేంద్రాల లోపల సిసి కెమెరాల ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. పోలీస్‌ శాఖవారి సలహాల ప్రకారం అవసరమున్న అన్ని పోలింగ్‌ కేంద్రాల వెలుపల సిసి కెమెరాల ఏర్పాటుచేస్తామన్నారు. జిల్లాలో నిఘాకు 22 ఎఫ్‌ఎస్టీ, 21 ఎస్‌ఎస్టీ, 37 ఎంసిసి టీములు ఏర్పాటుచేసినట్లు, 203 మంది సెక్టార్‌ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఎపిక్‌ కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇవిఎంల మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లు, రెండో ర్యాండమైజేషన్‌ ఈ నెల 30 నుండి చేపట్టనున్నట్లు తెలిపారు. హౌం ఓటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌కు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలీసు కమిషనర్‌ సునీల్‌ దత్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు చెక్‌పోస్టులలో సోదాలలో రూ.1,00,59,130 డబ్బులు సీజ్‌ చేశామని, రూ.47,36,883 విలువైన మద్యం సీజ్‌, రూ.11,47,000 విలువైన గంజాయి సీజ్‌ చేశామని తెలిపారు. డబ్బులు తీసుకెళ్లే వారు అన్ని ఆధారాలు ఉంటే వెంటనే వారి డబ్బు రిటర్న్‌ చేస్తామని, కానీ రూ.50 వేల కంటే ఎక్కువ తీసుకొని పోకూడదని తెలిపారు.

Spread the love