డిగ్రీలో ద్వితీయ భాషగా ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌

– విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
డిగ్రీ విద్యలో ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌ను ద్వితీయ భాషగా ప్రవేశపెట్టనున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫ్రెంచ్‌ సిలబస్‌ ముసాయిదా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిలబస్‌ కమిటీ సభ్యులను ఆమె అభినందించారు. తెలంగాణలో డిగ్రీ విద్యలో ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌ను ద్వితీయ భాషగా ప్రవేశపెట్టనున్నట్టు వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించే మార్గదర్శిగా తెలంగాణ అభివృద్ధి చెందిందని అన్నారు. గత విద్యాసంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ మహిళా డిగ్రీ గురుకుల కాలేజీల్లోని విద్యార్థులకు పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేశామని గుర్తు చేశారు. మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్‌ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌ కమిటీ సభ్యులు, టీయూ అంతర్జాతీయ సంబంధాల డైరెక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల, చిరశ్రీ బంధోపాధ్యాయ, పావని, అలయెన్స్‌ ఫ్రాంచైజ్‌ డైరెక్టర్‌ సామ్యూల్‌ బెర్తెట్‌, గోయల్‌ పబ్లిషర్స్‌ డైరెక్టర్‌ అశ్విని గోయల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love