రేపు గద్దర్‌ సంస్మరణ సభ

– హైదరాబాద్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజాయుద్ధనౌక, ప్రముఖ వాగ్గేయకారుడు గద్దర్‌ సంస్మరణ సభ వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పది గంటలకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఈ మేరకు సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సభలో సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, ఎస్‌యూసీఐ(సీ), ఫార్వర్డ్‌బ్లాక్‌, ఆరెస్పీ, సీపీఐ (ఎంఎల్‌), సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, సీపీఐ ఎంఎల్‌ (జనశక్తి) పార్టీల రాష్ట్ర నాయకులు, అదే విధంగా ప్రముఖ సినీ దర్శకులు బి నర్సింగ్‌రావు, సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ, గద్దర్‌ కుటుంబ సభ్యులు, వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ప్రముఖ కవి జయరాజ్‌ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు, గద్దర్‌ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలంటూ సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌ బాలమల్లేష్‌, డిజి నర్సింహారావు కోరారు.

Spread the love