– అకాల వర్షంతో పంటలకు నష్టం
– ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు
రెండ్రోజులుగా పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురుస్తోంది. గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పైర్లు నేలకొరిగాయి. కొద్ది రోజుల్లో చేతికందాల్సిన వరి ధాన్యం, మొక్కజొన్న తదితర పంటలు నేలపాలైన రైతులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్‌లోనూ పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
నవతెలంగాణ- విలేకరులు
ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సిరికొండ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో భారీ వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్లపై చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లక్కంపూర్ గ్రామంలో పలు ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరింది. ఆదిలాబాద్ మండలంలోని అంకోలి గ్రామంలో వడగండ్ల వానతో జొన్న పైరు నేలకొరిగింది. ఏపుగా పెరిగి చేతికందే దశలో ఉన్న జొన్న పంట నేలకొరిగి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఎక్కంటి దత్తు, పూదరి శేఖర్, లచ్చన్న, అంగ పోశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. తంతోలి, అంకోలి, కచ్‌కంటి, బూర్నూర్ గ్రామాల్లోనూ వడగండ్ల వాన కురిసింది. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోనూ వడగండ్ల వర్షం కురిసింది. దీంతో చెట్లు నేలకొరిగాయి.
అకాల వర్షాల వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పంట నష్టమేర్పడుతుంది. సంగారెడ్డి జిల్లాలోని న్యాల్‌కల్, ఝరాసంగం, కంగ్టి, నారాయణఖేడ్, రాయికోడ్, అందోల్, మునిపల్లి, నిజాంపేట, నార్సింగ్ మండలాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, మామిడి వంటి పంటలకు నష్టమేర్పడింది. ఈదురు గాలుల వల్ల పైర్లు నేలవాలాయి. మామిడి కాయలు, పూత రాలిపోయింది. చేతికొచ్చే దశలో నీటి ఎద్దడితోపాటు అకాల వర్షాల వల్ల నష్టమేర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
విద్యుత్ స్తంభం కూలి వ్యక్తి మృతి
భారీ వడగండ్ల వర్షానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో సోమవారం రాత్రి భారీ చెట్టు విరిగి విద్యుత్ స్తంభంపై పడటంతో ఎల్లసాని ఎల్లయ్య(55) మృతిచెందాడు. చెట్లు నేల కూలి రహదారికి అడ్డంగా పడటంతో ఎస్‌ఐ శేఖర్ రెడ్డి మంగళవారం జేసీబీలు, కూలీలలో తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. విద్యుత్ స్తంభాలు విరగడంతో మరమ్మతులు చేపట్టి, కూలిన చెట్లను తొలగించేందుకు ఇన్‌చార్జి ఈవో శ్రీనివాస్, విద్యుత్ అధికారులు సాయంత్రం వరకు శ్రమించారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులను చనిపోయిన ఎల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.