గాంధీ గిరీ కాదు..గులాబీగిరే..!

Not Gandhi Giri..Gulabigiri..!– ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలతో.. బీఆర్‌ఎస్‌కు కొత్త తలనొప్పులు
– గులాబీ కండువాలకే ప్రభుత్వ పథకాలట!
– అధికారులను కించపరిచేలా మాటలు
– సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌
– ఈసీ దృష్టికి తీసుకెళ్లే యోచనలో విపక్షాలు
– ఖండించిన తాతా మధు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
”ఇల్లొచ్చినా లాట్రీ సిస్టమే.. గొర్రెలొచ్చినా లాట్రీ సిస్టమే.. ప్లాట్లు వచ్చినా లాట్రీ సిస్టమే.. ఇప్పటి దాకా ఇలా గాంధీలాగా ఆలోచించాం.. మన నాయకుడూ అలాగే ఆలోచించాడు. ఇక గాంధీ గిరీ లేదు.. మన పార్టీ జెండా పట్టుకున్నోడికి, కండువా కప్పుకున్నోడికే ఏ స్కీమైనా..” అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ”వాడు ఎమ్మార్వో గానీ, ఆర్డీవో గానీ, కలెక్టర్‌ గానీ మన పార్టీ మాట వినాల్సిందే..! ఎందుకంటే ప్రభుత్వం మనది.. ఎస్‌ఐ అయినా.. సీఐ అయినా.. ఏసీపీ అయినా.. ఏఎస్పీ అయినా.. కమిషనరైనా.. ఎవరైనా గానీ.. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాల్సిందే..” అంటూ ఆయన పార్టీ సమావేశంలో మాట్లాడిన వీడియా సైతం వైరల్‌ అవుతూ పెద్ద దూమారమే రేపుతోంది.ఇప్పటికే ఇల్లెందు నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరిప్రియకు వ్యతిరేకంగా అసమ్మతిని పోగేశారని తాతా మధు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ఆ దుమారం నడుస్తుండగానే మధుసూదన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఆ పార్టీకి ‘కొత్త’ తలనొప్పులు తెచ్చాయని ఆయన వ్యతిరేక గ్రూపు ఆరోపిస్తోంది. మరోవైపు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడుతోంది. ఆయనకు గాంధీ పైన గౌరవం లేదని, నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ హెచ్చరించారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.
ఇన్‌చార్జై పట్టుమని పదిరోజులు కాకముందే..!
బీఆర్‌ఎస్‌ భద్రాచలం పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న బాలసాని లక్ష్మీనారాయణను తప్పించి.. తాత మధును ఆ స్థానంలో నియమించి పట్టుమని పదిరోజులు కాకముందే చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలో పెట్టాయనే చర్చ నడుస్తోంది. ఇన్‌చార్జిగా తప్పించడంతో పాటు తెల్లం వెంకట్రావును తనకు తెలియకుండా తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంపై తీవ్ర అసహనంతో ఉన్న బాలసాని అనుచరులకు ఈ పరిణామం ఒకింత ఊతం ఇస్తోంది. ఓవైపు పువ్వాడ అజరుకుమార్‌ బాలసానిని బుజ్జగిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావుతోనూ ఫోన్‌లో మాట్లాడించారు. ఈ ప్రయత్నాలు సాగుతుండగానే మధు చేసిన ఈ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రతిపక్షాల విమర్శలకు అస్కారమిచ్చాయి. దీన్ని అవకాశంగా తీసుకుని ఆ పార్టీలో ఓ గ్రూపు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే బాలసాని ప్రాబల్యం అధికంగా ఉన్న వెంకటాపురం, వాజేడు నాయకులెవరూ మధు మీటింగ్‌లకు హాజరుకావడం లేదు. ఈ ఘటన ఆ పార్టీలో ఎలాంటి పరిణామానికి దారితీస్తుందనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అదీ పాత వీడియో..నాపై ప్రచారాన్ని ఖండిస్తున్నా..:ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌
నేను అధికారులను దూషించలేదు. నాపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాను. పాత వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసి తాజా వీడియోగా చిత్రీకరించేందుకు కుట్ర చేస్తున్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఎదు ర్కొనే సత్తాలేని కొన్ని పార్టీలు, ఓ సెక్షన్‌ ఆఫ్‌ మీడియా ఈ ప్రచారానికి తెరలేపింది. ఈ వీడియో 2019 నాటిది. అప్పుడు గ్రామపంచాయతీ ఎన్నిక ల్లో కొందరు అధికారుల తీరుకు నిరసనగా నేను మాట్లాడాను. ఆ కామెంట్స్‌ చేసినప్పుడు నేను ఎమ్మెల్సీగా లేను. ఈ వీడియోపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బహిరంగంగా ప్రెస్‌మీట్‌లు పెట్టి అధికారుల తాటతీస్తామని భయబ్రాంతులకు గురిచేస్తున్న రేవంత్‌రెడ్డిలాగా మేము బరితెగించి లేము. పదేపదే తెలంగాణ అధికారుల మనోభావాలు దెబ్బతీస్తున్న రేవంత్‌రెడ్డి సంగతి ప్రజలు గమనిస్తున్నారు. అప్పటి పరిస్థితుల్లో కార్యకర్తల రక్షణ కోసమే అలా మాట్లాడాను తప్ప అధికారులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు.
అధికారుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా ఎమ్మెల్సీ వ్యాఖ్యలు
అధికారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎమ్మెల్యీ తాతా మధు వ్యాఖ్యలు చేశారు. వీడియో ఎప్పటిదైనా అధికార బలంతో అధికారులు, లబ్దిదారులపై ఆయన మాట్లాడిన తీరు బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ప్రభుత్వం ఏదైనా అధికారులు విధేయతతో పనిచేస్తారు. అలా అనిచెప్పి వారి పట్ల అమర్యాదగా వ్యవహరించేలా మాట్లాడటం సరైంది కాదు.
అన్నవరపు కనకయ్య, సీపీఐ(ఎం) భద్రాద్రి జిల్లా కార్యదర్శి

Spread the love