Friday, June 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతుపాకులతో సంచరిస్తున్న ముఠాగుట్టురట్టు

తుపాకులతో సంచరిస్తున్న ముఠాగుట్టురట్టు

- Advertisement -

రెండు అక్రమ తుపాకులు, ఏడు బుల్లెట్లు స్వాధీనం
ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను అరెస్ట్ చేసిన కమిషనర్స్ టాస్క్ ఫోర్స్

నవతెలంగాణ-సిటీబ్యూరో
కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్), మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఉమ్మడిగా జరిపిన తనిఖీల్లో ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు నాటు తుపాకులు (పిస్టల్స్), 7 రౌండ్ల బుల్లెట్లతోపాటు నిందితులు ప్రయాణిస్తున్న బెలేనో కారు, రూ.5000 నగదును టాస్క్‌‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం టాస్క్‌‌ఫోర్స్‌ డీసీపీ గైక్వాడ్‌ ‌వైభవ్‌ రఘునాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చార్మినార్‌, ఖిల్వత్‌‌కు చెందిన ముదస్సిర్‌ ‌హుస్సేన్‌ కార్‌ ‌డీలర్‌‌గా పనిచేస్తున్నాడు. అతను ఇంటర్మీడియట్ వరకు చదివాడు. 2022లో ముంబై వెళ్లి 6 నెలల పాటు ‘ఏబుల్-బాడీడ్ సీమన్’ కోర్సు పూర్తి చేసి ఎల్‌అండ్‌టీ సంస్థలో రెండు నెలలు పనిచేశాడు. చదువుకునే రోజుల్లోనే కారు రెంటల్ వ్యాపారంలో కమిషన్ ఏజెంట్‌గా పనిచేసిన అనుభవంతో, ముంబైలో ఒక చేవ్రొలెట్ కారును రూ. 1,35,000కు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో ఓఎల్‌ఎక్స్‌ ద్వారా రూ. 1,75,000/- కు విక్రయించాడు. ఆ లాభంతో 2024 వరకు ముంబై నుంచి పాత కార్లను కొని హైదరాబాద్‌లో అమ్మే వ్యాపారం చేశాడు. ఈ క్రమంలో ఇతని స్నేహితుడు షోయబ్ ద్వారా మహారాష్ట్రలో నేరచరిత్ర కలిగిన సూరజ్ సింగ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. సూరజ్ సింగ్ ముఠాతో చేతులు కలిపిన ముదస్సిర్.. కర్నాటకలో ఒక దోపిడీలో, అలాగే మహారాష్ట్రలో ఒక వ్యాపారవేత్త కిడ్నాప్ కేసులో పాల్గొని మహారాష్ట్రలోని పర్భణి జైలుకు వెళ్లాడు.

జైలు నుండి విడుదలయ్యే సమయంలో ఇతని సహచరుడు ఒకరు భద్రపరచడానికి ఒక పిస్టల్, బుల్లెట్లను ఇచ్చాడు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముదస్సిర్ ఆ తుపాకులను చూపించి దోపిడీలు చేసి సులభంగా డబ్బు సంపాదించాలని తన స్నేహితులతో కలిసి ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్ అమీర్ ఖాన్‌తో పరిచయం పెంచుకుని, అతడిని కూడా ఈ నేరాల్లో భాగస్వామిని చేశాడు. సమాచారం అందుకున్న టాస్క్‌‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. ఈ క్రమంలో మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో ఒక ‌బోలెనో కారులో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో తిరుగుతూ, ఏదైనా పెద్ద వ్యవస్థీకృత నేరానికి పాల్పడేందుకు ప్లాన్ చేస్తున్నారనే పోలీసులకు సమాచారం వచ్చింది. టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు మైలార్‌దేవ్‌పల్లిలోని ‘మెహఫిల్ హోటల్’ సమీపంలో సదరు కారును అడ్డుకున్న పోలీసులు.. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానాలను చెప్పారు. దాంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ టాస్క్‌‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్ సీహెచ్‌ ‌యాదేంద్ర, సబ్-ఇన్‌ ‌స్పెక్టర్ మహమ్మద్ జాహెద్, టాస్క్ ఫోర్స్ సిబ్బందితోపాటు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించి నిందితులను పట్టుకున్నందుకు వారిని ఈ సమావేశంలో డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -