చెత్త సిద్ధిపేట పట్టణ ప్రజల సంపద

– రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ – సిద్దిపేట 
తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇచ్చి ప్రజలు స్వచ్ఛతకు అడుగులు వేశారు,  చెత్త సిద్ధిపేట పట్టణ ప్రజల సంపద, ఆరోగ్య సిద్ధిపేటలో ప్రజల భాగస్వామ్యం ఉన్నదని, అద్వాన్నం నుంచి ఆకుపచ్చ సిద్ధిపేటగా అవతరించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.  మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్ లో బుధవారం సాయంత్రం తడి, పొడి చెత్త, వార్డుల్లో కంపోస్టు తయారీ కేంద్రాలు, డీఆర్సీసీ కేంద్ర పనితీరు, పట్టణ అభివృద్ధి పనులపై మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సు, అడిషనల్ జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ ముజమ్మీల్ ఖాన్, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కమిషనర్ సంపత్, పర్యావరణ ప్రేమికురాలు డాక్టర్ శాంతి, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందితో మంత్రి
సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆకుపచ్చ, ఆహ్లాదకరమైన సిద్ధిపేట పట్టణం చేద్దామని,  ఇందుకు మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది సహకారం అవసరమని,  నిధులు ఖర్చు చేయడం కంటే.. సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమని అన్నారు. డంప్ యార్డుకు చెత్త వెళ్లొద్దుని,  డంప్ యార్డు రహిత సిద్ధిపేటగా మారి దేశానికే ఆదర్శంగా మారాలన్నదే మన లక్ష్యమని అన్నారు. రోజుకూ పట్టణంలో 30 టన్నులు తడిచెత్త బుస్సాపూర్ వెళ్లి గ్యాస్ తయారు అవుతున్నదని అన్నారు. బుస్సాపూర్ డంపింగ్ యార్డుకు కేవలం తడిచెత్త మాత్రమే పోయేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో 113 బ్లాక్ స్పాట్లు ఉంటే, ప్రస్తుతం 41 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని, అన్నీచోట్ల సీసీ కెమెరాలు బిగించాలని పోలీసు నిఘా విభాగాన్ని ఆదేశించారు. పట్టణ బయట ప్రదేశాలలో చెత్త వేసే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే 90 శాతం స్వచ్ఛత సిద్ధిపేటగా మారిందని,  ఇక మిగిలిన పది శాతం మార్చేందుకు సమన్వయం చేసుకుంటూ , సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు,  సిబ్బంది , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Spread the love