గర్భ ‘సంస్కారం’

”ఏమిటి రమేష్‌! ఫోన్లో ఎంటో వెతుకుతున్నావు? నేనొచ్చింది నీకు తెలుసా లేదా!” అంటూ వచ్చాడు శివ.
శివ ఫోన్లో ఉన్నాడు. తలెత్తి కూడా చూడలేదు.
”ఆయన ఈ మధ్య ఫోన్లోనే జీవిస్తున్నాడు. మనను పట్టించుకోవటం లేదు” అంటూ ఛాయి తీసుకుని వచ్చింది వాణి. తను రమేష్‌ భార్య. ఆరు నెలల గర్భిణి.
”అయ్యో! నీవు ఎందుకు శ్రమ పడుతున్నావమ్మా! ఆరోగ్యం ఎలా ఉంది?” అడిగాడు శివ అప్యాయంగా.
”ఆరోగ్యం బాగుందన్నయ్యా! ఈయన పరిస్థితే ఏమీ బాగాలేదు!” అన్నది వాణి బెంగగా.
”వీడికేమయ్యిందమ్మా! బాగానే కనబడుతున్నాడు!” అన్నాడు శివ.
”అది కాదన్నా! ఈ మధ్య వాట్సప్‌ సందేహాలు చదవమని నన్ను సతాయిస్తున్నాడు” అన్నది వాణి.
వాళ్ళిద్దరూ ఇంత మాట్లాడుకుంటున్నా రమేష్‌ మాత్రం వాట్సప్‌ నుండి బయటకు రావటం లేదు.
”ఒరేరు రమేష్‌!” అని ఓ మోస్తరు గొంతుతో పిలిచాడు శివ.
”ఆఁ ఏంటీ!” అన్నాడు రమేష్‌. వాల్తేర్‌ వీరయ్య సినిమాలో చిరంజీవిలా తల ఎగరేస్తూ.
”ఏం చేస్తున్నావు? ఆ ఫోన్లో నుండి బయటికి రా!” అన్నాడు శివ.
”ఏమనుకున్నాడో గాని ఫోను పక్కన పెట్టాడు శివ. ఆ తర్వాత మెల్లిగా అన్నాడు.
”ఎంతైనా పురాణ విజ్ఞానం ఎంతో గొప్పది!”
”ఫోను, వాట్సప్‌లో పరిశోధించి, ఇదే కనుకున్నావా?” అన్నాడు శివ నవ్వుతూ.
”రేరు నవ్వకురా! గర్భంలో ఉన్న శిశువుకి అన్ని విషయాలు నేర్చుకునే అవకాశం ఉందంట. మన పురాతన గ్రంథాల్లో చెప్పారు!” అన్నాడు రమేష్‌.
”అవున్నా! ఆ మధ్య శస్త్రవేత్తలు కూడా ఇలాంటిదే చెప్పినట్లు గుర్తు!” అన్నాడు శివ.
”ఏడిచారు! ఆ శాస్త్రవేత్తలకేం తెలుసు! ఆ ఇంగ్లీషువాడొచ్చి మన దేశంలోని పురాతన గ్రంథాలు ఎత్తుకెళ్ళి, వాటిల్లోంచి ఒక విషయాన్ని తామే కనుక్కున్నామని ఫోజులు పెడుతున్నారు!” అన్నాడు రమేష్‌.
”అంతేనా!” అన్నాడు శివ.
”ముమ్మాటికీ అంతే!” అన్నాడు రమేష్‌ కుండ బద్దలు కొడుతూ.
”అందుకేనా! మీరు వాట్సప్‌ సందేశాలు నాతో చదివించుతున్నారు!” అన్నది వాణి.
”మీ అన్నా చెల్లెళ్ళు ఇంతే! ఓ పట్టాన విషయం అర్థం కాదు గదా! మీరిద్దరూ రెండు పేద్ద ట్యూబ్‌లైట్లు!” అన్నాడు రమేష్‌ వేళాకోళంగా నవ్వుతూ!
వాణి, శివ కూడా నవ్వారు.
”ఇట్లా గర్భంలోని శిశువు నేర్చుకోవటానికి ఏమైనా ఆధారాలున్నాయా?” అమాయకంగా అడిగింది వాణి.
”నీకు ఎన్నో వాట్సప్‌ సందేశాలు చదివించినా నీవు జ్ఞానం సంపాదించుకోలేక పోయావు. నీవే ఇలా ఉంటే, నీ కడుపులో ఉన్న నా కొడుకు ఎట్లా తయారవుతాడో!” అన్నాడు రమేష్‌.
”హిరణ్యకశ్యపుని కొడుకు ప్రహ్లాదుడు తన తల్లి కడుపులోనే హరికథలు విని విష్ణుభక్తుడయ్యాడు! రమేష్‌కి కూడా అట్లా ఉందేమో!” అన్నాడు శివ.
”నిజమే అన్నా! నాకు రామాయణ భాగవతాలు విన్పించినా బాగుండు! ఆ వాట్సప్‌లో వచ్చే నమో కధలంటూ చిదివి విన్పించుతున్నాడు. వినలేకపోతున్నాను” అన్నది వాణి.
”నోర్మురు! నమో అంటే ఎవరుకున్నావు. సాక్షాత్తూ భగవంతుడి అవతారం! భారతదేశాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి భూమి మీది వచ్చిన దేవతా స్వరూపం! ఆయన లేకపోతే ఈ దేశాన్ని చైనానో, పాకిస్థానో ఆక్రమించేది! ఇప్పుడు మన దేశం ఇంత గొప్పగా ఉండటానికి ఆయనే కారణం తెలుసా?” కోపంగా అన్నాడు రమేష్‌.
”’మన దేశ గొప్పతనానికంతా ఆయనే కారణమా?” అడిగాడు శివ.
”నా విష్ణూనాం! ఫుధ్వీపతిః” అంటే రాజే దేవుడు. కాబట్టి ఆయన దేవుడు. ఈ దేశం ఉపగ్రహాలు విజయవంతంగా ప్రవేశపెడుతున్నా, దేశంలో వర్షాలు పడుతున్నా, ఎండలు కాస్తున్నా ఆయనే కారణం. క్రికెట్‌లో ఇండియా గెలిచినా, బాక్సింగ్‌లో మనకు పతకాలు వచ్చినా, ఆఖరుకి ఆస్కార్‌ అవార్డు వచ్చినా ఆయనే కారణం! ఇంకా…
రమేష్‌ మాటలు పూర్తి కాలేదు.
”ఆపు నాన్నా ఆపు! వినలేకపోతున్నాను” అంటూ సన్నటి గొంతు వన్పించింది.
రమేష్‌తో పాటు అందరూ అటూ ఇటూ చూశారు.
”మీరు అటూ, ఇటూ చూడకండి! నేను కనబడను. ఎందుకంటే నేను మా అమ్మ బొజ్జలో వెచ్చగా ఉన్నాను. మా నాన్న ఇప్పుడు మాట్లాడిందే కాదు, కొన్ని రోజులుగా వాట్సప్‌ సందేశాలు విని, విని భరించలేకపోయాను. ఏమిటి నాన్నా నీవు విన్పించిన సందేశాలు? ఆడపిల్లలు వంటిల్లు దాటకుండా ఎప్పుడూ ఒక మగవాడి సంరక్షణలోనే ఉండాలా? ఏం ఆడపిల్ల స్వతంత్రంగా జీవించలేదా? సత్యభామ, దుర్గామాతలు తమ భర్తల వల్ల కానిది, శత్రువులను జయించారు కదా! వారి గురించి ఎందుకు చెప్పరు?” ప్రశ్నించింది మళ్ళీ సన్నటి గొంతు.
అంతా ఆశ్చర్యంగా వింటున్నారు.
”దేశంలో ఉన్న ప్రజలను కులాలు, మతాలు అంటూ విడదీస్తారా? ఒక్క మతానికే దేవుడుంటాడా? ఎదుటి మతానికి దేవుడు ఉండడా? ముస్లింలు, క్రిస్టియన్లు, సైతానును హిందువులు రాక్షసులను పూజిస్తున్నారా? మీరు అధికారంలో ఉండటానికి దేవుడిని వాడుకుంటారా? ఇది దుర్మార్గం కాదా?” దేవుడే సృష్టించిన మనుషుల మధ్య కులాలు, మతాలు అంటూ కొట్లాటలు పెడతారా? ఇది ఆ దేవుడికి నచ్చుతుందా?” ప్రశ్నించిందా గొంతు.
”మీరు వాట్సప్‌లు, కంప్యూటర్లు, శాటిలైట్లు వాడుకుంటారు! మిగిలిన వారిని వెనకటి కాలానికి వెళ్ళమంటారా? ఇదేం న్యాయం. ప్రజలు చదువుకుని విజ్ఞానవంతులు కాకుండా, చదువును ఖరీదైన వ్యాపారంగా మార్చేశారు! ఇదేనా ధర్మం?” మళ్ళీ ప్రశ్నించింది ఆ గొంతు!
రమేష్‌ గొంతు ఎండిపోయింది! వాణి, శివ ఆశ్చర్యంలో మునిగిపోయారు.
నాన్నా! నీవు చదివిన వాట్సప్‌ సందేశాలు విన్న తర్వాత నా ఈ డౌట్లు వచ్చాయి! శివ మామ, అమ్మ మాట్లాడుకుంటుంటే సత్యభామ, దుర్గాదేవి గురించి, దేశం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను! లేకపోతే పుట్టక ముందు నా బుద్ది మందబుద్ధి అయ్యేది! కాదు! కాదు! నా బుద్ధి అంతా మూఢత్వంతోనూ, విద్వేషంతోనూ, అశాస్త్రీయమైన భావాలతో నిండిపోయేది! అందుకే, నాన్నా నీ వాట్సప్‌ సందేశాలు బంద్‌ చేయి! మామా, అమ్మా మీరు ఇంతకు ముందులాగే మంచి, మంచి విషయాలు మాట్లాడుకోండి! అమ్మా నాకు ఆకలవుతుంది! ఏదైనా తిను! ఉంటాను బై!” అంటూ వాణి బొజ్జలోని పాప విశ్రాంతి తీసుకుంది.

Spread the love