సంక్షోభంలో వస్త్రపరిశ్రమ

Garment industry in crisis– పెండింగ్‌లో రూ.485.89 కోట్ల బకాయిలు
– సిరిసిల్లలో నెలలుగా ఉపాధి కరువు
– రోడ్డునపడ్డ నేతన్నల కుటుంబాలు
– తిలా పాపం..తలా పిడికెడుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సిరిసిల్లలోని 15 వేల మంది పవర్‌లూమ్‌ కార్మికుల కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉన్నది. ఒకరు తట్టాపనికి పోతుంటే…మరొకరు సుతారి(భవన నిర్మాణ రంగంలో) పనికి పోతున్నారు. కొందరు హోటళ్లలో పనికి కుదురుతున్నారు. ఉపాధిలేక వలసబాట పడుతున్నారు. అనారోగ్య సమస్యలు, ఇతర పనులు చేయలేని వారి పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైంది. ఓవైపు ఉపాధిపోయి పెండ్లీడుకొచ్చిన ఇద్దరు ఆడబిడ్డలను పోషించలేక..మరోవైపు అనారోగ్య సమస్య తీవ్రమవ్వడంతో తడక శ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకోవడం సమస్య తీవ్రతను ఎత్తిచూపుతున్నది. ఈ పరిస్థితికి కారణం ఎవరు అని మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తే తిలా పాపం.. తలా పిడికెడు అన్నట్టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..గతంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం..ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కారు పాత్ర స్పష్టమవుతున్నది. కాగా, ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ-కాంగ్రెస్‌ ఒక్కటే అని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తుంటే… బీఆర్‌ఎస్‌-బీజేపీ ఒక్కటని కాంగ్రెస్‌ విమర్శలు ఎక్కుపెడుతుంటే… బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ ఒక్కటని బీజేపీ గొంతుచించుకుంటున్నది. రాజకీయ విమర్శలు ఎన్ని చేసుకున్నా..కార్మికులకు అన్యాయం చేయడంలో మాత్రం అన్ని పార్టీల విధానాలూ ఒక్కటేనని సిరిసిల్ల నేత కార్మికుల కష్టాలు స్పష్టం చేస్తున్నాయి.
బీజేపీకి ఓట్లు తప్ప నేతన్న వ్యథలు పట్టవా?
కరీంనగర్‌ పార్లమెంటరీ స్థానంలో సిరిసిల్ల ఉంది. ప్రస్తుతం అక్కడ ఎంపీగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజరు ఉన్నారు. ఆ నియోజకవర్గంలో వస్త్రపరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవించే వారు లక్షమందికిపైనే ఉంటారనేది నిజం. కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంలో గెలుపోటముల్లోనూ వారి పాత్ర కీలకం. అలాంటి వారి సంక్షేమం కోసం ఎవ్వరూ ముందుకు రావడం లేదు. సమస్యను మాత్రం రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. బండి సంజరు పార్లమెంట్‌లో తన ఎంపీ పరిధిలోని నియోజవర్గ పరిధిలోని సిరిసిల్ల పవర్‌లూమ్‌ కార్మికుల పక్షాన గొంతెత్తింది ఏనాడూ లేదు. పైగా, కేంద్రంలోని మోడీ సర్కారు వస్త్రపరిశ్రమను దెబ్బతీసి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ పోతున్నా తనకేం పట్టనట్టు వ్యవహరించారనే విమర్శ ఉంది. నేత కార్మికుడు చనిపోతే మహాత్మాగాంధీ బునకర్‌ బీమా యోజన పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. నేతన్నలకు ఐసీఐసీఐ లాంబాడ్‌ హెల్త్‌ స్కీమ్‌ ఉండేది. హౌస్‌ కమ్‌ వర్క్‌షెడ్‌ పథకం కింద చేనేత కార్మికునికి లక్షా 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందేది. కేంద్రంలోని మోడీ సర్కారు వీటన్నింటి రద్దు చేస్తు పోతున్నా నేతన్నల పక్షాన బండి ఏనాడూ నిలబడి కొట్లాడలేదు. గతంలో ఉన్న 22 రకాల రిజర్వేషన్లను 11 రకాలకు కుదించినా తనకేం పట్టనట్టు ఆయన వ్యవహరించారు. చేనేత రంగానికి ఏటేటా నిధులను తగ్గిస్తూ పోతున్నా..తన నియోజకవర్గంలో పవర్‌లూమ్‌ కార్మికుల పక్షాన పార్లమెంట్‌లో సంజరు ఏనాడూ మాట్లాడలేదు. పదేండ్ల కాలంలో వస్త్రపరిశ్రమ ముడిసరుకుల ధరలు రెట్టింపు అయ్యాయి. దీనికితోడు పట్టుపై 12 శాతం, నూలుపై ఐదు శాతం, రంగులు, రసాయనాలపై ఐదు నుంచి 12 శాతం, తయారైన వస్త్రం అమ్మే సమయంలో ఐదు శాతం ఇలా జీఎస్టీ మీద జీఎస్టీ వేస్తూ పోతున్నా ఏనాడూ అయ్యో సిరిసిల్ల నేతన్నలకు దెబ్బ మీద దెబ్బ తగిలి అన్యాయం జరుగుతుందనే సోయే ఆయనకు లేకుండా పోయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ భారాలతో నేతన్నలు మనుగడ సాగించలేని పరిస్థితి. జాతీయ చేనేత బోర్డును రద్దు చేసి చేనేత కార్మికుల గొంతును నొక్కేస్తున్నా బండిసంజరు తనకేం పట్టనట్టు వ్యవహరించడంపై కార్మికులు కోపంతో ఉన్నారు.
ఆర్డర్లిచ్చినా..బిల్లుల పెండింగ్‌తో బీఆర్‌ఎస్‌ అన్యాయం
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన హయాంలో పవర్‌లూమ్‌ కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్‌ను ఇచ్చింది. అదే సమయంలో టెస్కో ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలకు, వెల్ఫేర్‌ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలోని విద్యార్థులకు అవసరమైన వస్త్ర తయారీ ఆర్డరునూ ఇచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది. అసలు కథ ఇక్కడే మొదలైంది. అదే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పవర్‌లూమ్‌ పరిశ్రమకు చెల్లించాల్సిన 485.89 కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్డర్లు ఇచ్చి వస్త్రాన్ని తీసుకున్నాయి తప్ప టెస్కోద్వారా నిధులను చెల్లించలేదు. వందల కోట్ల బిల్లుల బకాయిలతో ఆసాములు కూడా చేతులెత్తేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చివరి రోజుల నాటికి సిరిసిల్ల వస్త్రపరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ప్రస్తుతం మూడు నెలలుగా పవర్‌లూమ్‌ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది.
విన్నపాలను కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా మన్నిస్తుందా?
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. కానీ, మూడు నెలలుగా సిరిసిల్ల కార్మికులు రోడ్లెకి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తమకు న్యాయం చేయాలని ఇప్పటికే ఉప ముఖ్యముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు, ఆ శాఖ కమిషనర్‌కు పలుమార్లు కార్మికులు వినతిపత్రాలు అందజేశారు. గత ప్రభుత్వం పెండింగ్‌ బిల్లులను చెల్లించకపోవడం వల్ల వస్త్రపరిశ్రమ దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని వేడుకున్నారు. అయినా, రాష్ట్ర సర్కారు వారిపట్ల కనికరనం చూపడం లేదు. ఫలితంగా పవర్‌లూమ్‌ కార్మికుల కుటుంబాలు గడవని పరిస్థితి నెలకొంది. వారంతా రోడ్లెక్కి నెలకుపైగా నిరసనలు చేస్తూనే ఉన్నారు. పెండింగ్‌ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి పవర్‌లూమ్‌ పరిశ్రమను ఆదుకుంటుందా? లేక బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాల మాదిరిగానే వ్యవహరి స్తుందా? అనేది వేచిచూడాల్సిందే.
అవసరమున్నా ఆర్డర్లేవి?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వస్త్రాల అవసరం ఉంటుంది. ఆస్పత్రు ల్లో బెడ్‌షీట్లు, ఇతర అవసరాలకు బట్టలు అవసరం. కానీ, ప్రభుత్వాలు మాత్రం చేనేతకు ఆర్డర్లు ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేసే ఆశాలు, అంగన్వాడీలకు, గ్రామపంచాయతీ, ఆర్టీసీ కార్మికులకు, విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్‌ల ఆర్డర్లను చేనేత కార్మికులకు ఇస్తే ఎంతో మందికి ఉపాధి కల్పించి వారి జీవనో పాధిని మెరుగు పర్చొచ్చు. పాలకులు ఈ దిశగా ఆలోచించాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తున్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ దిశగా ఆదుకునేలా చర్యలు తీసుకో వాలి. లేకపోతే, సిరిసిల్ల మరోమారు ఉరిసిల్లగా మారే ప్రమాదం పొంచి ఉంది.
కార్మికుల కోసం నేడు నిరాహార దీక్ష
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేశ్‌
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోని 485.89 కోట్ల రూపాయల పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించి సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల పవర్‌లూమ్‌ పరిశ్రమను గట్టెక్కించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నాం. ఏటా ప్రభుత్వ శాఖలకు అవసరమయ్యే వస్త్రతయారీ ఆర్డర్లను చేనేత, పవర్‌ లూమ్‌ కార్మికులకు ఇచ్చేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. త్రిఫ్ట్‌ ఫండ్‌, యారన్‌ సబ్సిడీ, నేతన్న బీమా పథకాలను అమలు చేయాలి. నేత కార్మికుల సంక్షేమ కోసం ప్రత్యేక పాలసీ రూపొందించాలి. నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం నిరాహార దీక్షకు కూర్చోబోతున్నాం.

Spread the love