Saturday, August 8, 2026
E-PAPER
Homeఖమ్మంబీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరుకు సిద్ధం కండి

బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరుకు సిద్ధం కండి

- Advertisement -

– ​ఆగస్టు 10న ‘జైలు భరో’ను జయప్రదం చేయండి
– ​సీఐటీయూ జిల్లా నాయకుడు మోరంపూడి పాండురంగారావు
నవతెలంగాణ – సత్తుపల్లి

కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, ఇందుకు పోరుకు సిద్ధంగా ఉండాలని సీఐటీయూ జిల్లా నాయకుడు మోరంపూడి పాండురంగారావు అన్నారు. శనివారం పట్టణంలోని సిద్దారం రోడ్డులోని గోల్డ్ స్పాట్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన గేట్ మీటింగ్ లో పాండురంగారావు మాట్లాడారు. కార్మికుల హక్కుల పరిరక్షణకై ఆగస్టు 10న జరగనున్న ‘జైలు భరో’ను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ‘జైల్ భరో’ ఆందోళన చేపడుతున్నామన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం నాలుగు కోడ్‌లుగా మార్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

మోడీ తెచ్చిన లేబర్ కోడ్‌ల వల్ల కార్మికుల హక్కులు కాలరాయబడి, తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, పని భద్రతను బలహీనపరిచే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనాలు పెంచాలన్నారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని (రెగ్యులరైజ్) డిమాండ్ చేశారు. ‘సమాన పనికి సమాన వేతనం’ సూత్రాన్ని అన్ని రంగాల్లో పక్కాగా అమలు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు కొలికపోగు సర్వేశ్వరరావు స్పష్టం చేశారు. కార్పొరేట్ శక్తులకు వేల కోట్ల రాయితీలు ఇస్తూ, సామాన్య ప్రజలు, కార్మికులపై భారాలు మోపడం సరికాదన్నారు.

హక్కుల సాధనకు కార్మికుల ఐక్య పోరాటాలు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని ఆయన ఉద్ఘాటించారు. కేంద్రం అవలంభిస్తున్న శ్రమదోపిడీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం మరింత ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఈ ‘జైలు భరో’ కార్యక్రమంలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు, సీఐటీయూ నాయకులు బీకే ప్రసాద్, పుట్టపర్తి సత్యనారాయణ, రాజేష్, గాదె ప్రసాద్, కుమార్, శ్రీనివాస్, ప్రజా సంఘాల ప్రతినిధులు జయరాజ్, రాంబాబు, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -