బహుమతి

giftతలుపు కొట్టగానే లోపలినుండి తలుపు తీసి బావా ఎప్పుడు వచ్చితీవు అంటూ కౌగివించురున్నంత పనిచేస్తూ లోపలికి ఆహ్వానించాడు మా బావ పరమేశం. మా భార్యాభర్తలిద్దరమూ లోపలికి అడుగు పెట్టే సరికి, మా చెల్లి సీత లోపలి నుంచి వస్తూ ‘రా అన్నయ్యా, రా వదినా’ అంటూ దగ్గరికి వచ్చి చేతిలోని సూట్‌ కేసు తీసుకుని లోపల పెట్టింది. ఎలా వున్నారమ్మా అంటూ రిలాక్స్‌గా కూర్తున్నాం. మా చెల్లి కాఫీ తెస్తా అంటూ లోపలికి వెళ్ళింది.
‘మాకేం బావా సూపర్‌’ అంటూ లేని నవ్వును తెచ్చుకుంటూ సమాధానమిచ్చాడు మా బావ. మా చెల్లి పెళ్ళై ఆరు నెలలయింది. మా బావ సాఫ్ట్‌ వేర్‌. పెళ్ళైన నెలకే హైదరాబాదులో మకాం పెట్టారు. ఏం సంగతులు బావా అంటూ అందరి కుశలాలు అడిగా.
అంతా బాగున్నారు బావా అంటూ సమాధానమిచ్చాడు. భార్యాభర్తలిద్దరూ ఏదో దాస్తున్నారనిపించింది. నేను మా ఆవిడను చూసా. తనకూ అనుమానం వచ్చినట్లు ప్రశ్నార్థకంగా నా వైపు చూసింది. ఇంతలో కాఫీ తీసుకొస్తే తాగుతూ కూర్చున్నాం. కాఫీలయ్యాక వంట చేస్తా అన్నయ్య అంటూ చెల్లి లోపలికి పోయింది. వెనుకే మా ఆవిడా వెళ్ళింది.
నీకేం బావా, నీ చెల్లితో రాఖీ కట్టించు కోవడానికి వచ్చావు. నాకు లేరుగా కట్టేవాళ్లు అన్నాడు.
అందుకే కదా బావా మీ అక్కని తీసుకొచ్చింది అన్నాను భుజం మీద చేయివేస్తూ.
సాయంత్రం 6 అయింది. అలా బయటకు వెళ్ళొద్దాం బావా అంటూ లేచాను. తనూ బట్టలు మార్చుకుని వచ్చాడు. అలా నడుస్తూ దగ్గరలోని పార్క్‌కి వెళ్లి కూర్చున్నాం. ఇక చెప్పు విశేషాలంటూ ముఖంలోకి చూసా. ఏమనుకున్నాడో సర్‌ప్లస్‌ లో ఉద్యోగం పోయి మూడు నెలలయిందని, ఇల్లు గడవటం కష్టమవుతోందని, కొన్ని అప్పులు కూడా అయ్యాయని, నాకు చెపుదామంటే బాగుండదని సీత చెప్పనీయలేదని, ఎంత ప్రయత్నించినా ఇద్దరికీ ఉద్యోగం దొరకలేదని, కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా చెప్పాడు. అంతా విని మౌనంగా ఉండి ఇంటికి వచ్చాం.
ఆ రాత్రి మా ఆవిడ, డాబా మీదున్న నా దగ్గరకు వచ్చి అదే విషయం చెప్పి, ఏదో ఒకటి చేయండి అంది. తెల్ల వారి రాఖీ పండుగ. ఇద్దరికీ ఇద్దరూ రాఖీ కట్టారు. మేం తెచ్చిన స్వీట్లు తిన్నాం. సీతా మధ్యాహ్నం ఊరెళ్తున్నాం అన్నా.
అన్నాలు తిన్నాక వెళ్ళండి బావా అన్నాడు. వెళ్ళండి ఏంటి మీరూ వస్తున్నారు మా తోటి అన్నాను. మేమెందుకన్నయ్యా అంది సీత అర్థమైనదానిలా కన్నీళ్ళు తుడుచుకుంటూ. ఎందుకేంటి సీతా కొన్ని రోజులు మా ఇంట్లో ఉండకూడదా ఏంటి అన్నది మా ఆవిడ. సీత లోపలికి వెళ్ళబోతుంటే చేయి పట్టి ఆపి, బావా నేనూ అలా వెళ్ళేస్తాం. ఇంతలో బట్టలు సర్ది ఉంచు. హోటల్లో తినేసి మన ఊరెళదాం. అమ్మ చూడాలంటోందని చెప్పి బావకెలాగయినా నేను చేసే కంపెనీలో ఉద్యోగం ఇప్పించి, మళ్ళీ దంపతులిద్దరూ ఆనందంగా ఉండేట్లు చేయాలని నిర్ణయించుకుని బావని తీసుకుని బైటికి వెళ్ళి షాపులో, స్నేహితుల దగ్గరి అప్పులు తీర్చేసి, ఇంటికి వచ్చేటప్పటికి మా ఆవిడ ఏం చెప్పిందో తయారయి ఉన్నారు. లోపలికి రాగానే భార్యా భప్తలిద్దరూ మా దంపతుల కాళ్లపై పడ్డారు కన్నీళ్ళతో. పైకి లేపాను. మీ చెల్లి రాఖీ కట్టి నందుకు జీవితాన్ని నాకు బహుమతిగా ఇస్తున్నావా బావా అంటూ కౌగిలించుకున్నాడు. మా బావ కన్నీళ్ళు తుడిచి, ఏంటి బావా ఇది. నాకు ఇంకెవరున్నారు బావా మీరు గాక. అంతా సవ్యంగా జరుగుతుంది. బాధ పడకండి. మా అమ్మకి ఏమీ చెప్పకండి. మెల్లిగా నేను చెపుతానంటూ సూట్‌ కేసులు పట్టుకుని అందరం బైటికి వచ్చాం మా వూరు వెళ్ళడానికి.
– జి. మధు మురళి,
భీమారం, హన్మకొండ

Spread the love