
– సీపీఐ ( ఎంఎల్ ) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు సారా సురేష్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
గోదావరిలోయ ప్రతిఘటన యోధుడు కామ్రేడ్. రవన్న అని, ఆయన ఆశయమైన జనతా ప్రజాతంత్ర విప్లవం సాధించిన రోజే కామ్రేడ్ రవన్నకు ఘనమైన నివాళి అర్పించినట్లు అవుతుందని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు సారా సురేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ (రవి) 8వ వర్ధంతి సభను మండల కమిటీ కార్యదర్శి అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు రాయల సుభాష్ చంద్రభోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కార్యకర్తలను ఉద్దేశించి సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు సారా సురేష్ మాట్లాడుతూ ఆదివాసుల విముక్తి కోసం, ఆదివాసులకు భూమిపై హక్కు కల్పించడం కొసం 40 సంవత్సరాలు అజ్ఞాత జీవితంలో అనేక పోరాటాలు నిర్వహించిన గొప్ప విప్లవ యోధుడు కామ్రేడ్ రవన్న అన్నారు. అడవి ఉద్యమాన్ని, మైదాన ప్రాంత ఉద్యమాన్ని సమన్వయం పరుస్తూ పేద ప్రజలు విముక్తి కోసం తమ రక్తాన్ని ధారబోసినటువంటి గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్మిక వర్గ పోరాటాలు కూడా కార్మికుల శ్రమను ఏ విధంగా పెట్టుబడిదారులు దోచుకుంటున్నారో సంక్షిప్తంగా కార్యకర్తలకు చెప్పి వాళ్ళును కూడా చైతన్యం పరిచినటువంటి గొప్ప వ్యక్తి కామ్రేడ్ రవన్న అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజా ఉద్యమాల ద్వారానే, కార్మిక వర్గ పోరాటాల ద్వారానే ఈ వ్యవస్థ మార్పు చెందుతుందన్నారు. అదే భావనలో కూడా ఈరోజు సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ పనిచేస్తున్నదని, కామ్రేడ్ రావన్న లక్ష్యాలు ఆశయాలు నేరవెరలంటే ప్రతి కార్యకర్త ప్రజా సమస్యలపై నిరంతరం పని చేయాలని కోరారు. కార్మిక వర్గం, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ కార్యకర్తలు కూడా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించి, రవన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన నాడే అయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు రాజేశ్వర్, కిషన్, సత్యనారాయణ గౌడ్, సతేక్క, బాలన్న, తదితరులు పాల్గొన్నారు.