వేటగాడి మంచితనం

Goodness of the hunterకాకులకొండకు దిగువన రాయపురం అనే గ్రామంవుండేది. గ్రామానికి కొండకు మధ్యన పెద్ద కీకారణ్యం. అందులో అధికసంఖ్యలో జంతువులు, పక్షులు నివసిస్తూ వుండేవి. వేసవికాలం వచ్చింది. ఎండలు ఎప్పుడూ లేనంత తీవ్రంగా మండిపోసాగాయి. ఒకరోజు మిట్టమధ్యాహ్నం ఒక జింక గ్రామంలోకి వచ్చింది. గ్రామ పొలిమేరల్లో వ్యవసాయ పనుల్లో వున్న యువకులు దాన్ని చూసి తెలివిగా పట్టుకున్నారు. ”ఈరోజు మనకు మంచి విందురా” అంటూ దాన్ని చంపాలనుకున్నారు. ఈ విషయం గ్రామాధికారి చెవిన పడింది. ఆయన ఆగమేగాలమీద బయలుదేరి వచ్చి, యువకుల్ని గట్టిగా మందలించి, జింకను వదిలిపెట్టమని ఆజ్ఞాపించాడు.
”ఎండాకాలం అడవిలో నీటిమడుగులు ఎండిపోవడంతో దప్పిక తీర్చుకోడానికి జంతువులు గ్రామంవైపుకు వస్తాయి. అవి మనకు అతిథులు. చంపకూడదు” అని మందలించాడు. వాళ్ళు క్షమాపణలు చెప్పి జింకను వదిలారు. అది బతుకుజీవుడా అని శరవేగంతో అడవిలోకి పరుగెత్తింది. మరోసారి ఏనుగుల గుంపు రాత్రిపూట గ్రామంవైపు వచ్చింది. పొలాల్లోవున్న పంటను తొక్కి పాడుచేశాయి ఏనుగులన్నీ. కంచెల్ని తోసివేశాయి. అప్పుడుకూడ గ్రామస్థులు నీళ్ళకోసం జంతువులు గ్రామంకేసి వస్తున్నట్లు ఊహించారు. ఏం చేయాలో వారికి పాలుపోలేదు. గ్రామాధికారి చెవినవేశారు. ఆయన కొంతమంది యువకుల్ని పొలిమేరలో కాపలా వుంచాడు. దానివల్ల సరయిన ఫలితం కనిపించలేదు.
అదే ఊర్లో వుండే వేటగాడు ఒకడు గ్రామంలోని బలిష్టులయిన యువకులను ఒకచోట చేర్చి, ”నేను వేటకు వెళ్ళినపుడు గమనిస్తూవుంటాను. వర్షాకాలంలో అడవిలోని మడుగులు నీటితో కళకళలాడుతుంటాయి. మరీ ఎండలు పెరిగినపుడు వాటిలో నీటిజాడ లేకుండా పోతున్నది. దానికి కారణం ఏమంటే కాలక్రమేణా ఆకులు, చెత్తచెదారం పడి మడుగులు పూడుకుపోయి, వర్షాకాలం నీటిని ఎక్కువగా నిలవచేయలేక పోతున్నాయి. అలా ఎండాకాలంలో నీటి మడుగులు ఎండిపొవడం వల్ల నీళ్లకోసం జంతువులు గ్రామంకేసి వస్తున్నాయి. ఎంత ఎండాకాలం అయినా మన చెరువులో కొంతనీరు వుంటుంది. ఎందుకంటే తరచూ పూడిక తీస్తుంటాంకదా” అన్నాడు వేటగాడు.
”అయితే ఇప్పుడు మనం ఏంచేయాలి?” అని అడిగారు యువకులు వేటగాడ్ని.
అందుకు వేటగాడు, ”అడవి మధ్యలో వున్న మడుగుల్లో మనం పూడిక తీద్దాం. శ్రమ అనుకోకుండా మడుగులను తవ్వి మరింత లోతు చేద్దాం. వర్షాకాలంలో మడుగుల్లో వాననీరు ఎక్కువ చేరి నిలువ వుంటుంది. ఎండాకాలంలో కూడా జంతువుల దప్పిక తీరుతుంది. అవి గ్రామంకేసి రావడం మానేస్తాయి” అన్నాడు.
వేటగాడి మాటలు అందరికీ నచ్చాయి. గ్రామంలో మరికొంతమంది వేటగాడి ఆలోచనకు మద్దతు పలికారు. పని ప్రారంభమయింది. మడుగుల్లో పూడిక తీసి, లోతు తవ్వారు. త్వరలోనే పనులు పూర్తయ్యాయి. గ్రామాధికారి వేటగాడ్ని, యువకుల్ని పిలిచి గ్రామస్తుల సమక్షంలో అభినందించి వేటగాడితో, ”చాలామంచి ఆలోచన చేశావు. కానీ నాకొక సందేహం. నిత్యం వేటమీద ఆధారపడి జంతుహింస చేసే నువ్వు వేసవికాలంలో జంతుదాహాన్ని తీర్చడానికి నడుం కట్టడం ఆశ్చర్యంగా వుంది” అన్నాడు.
దానికి వేటగాడు, అయ్యా! దప్పికతో క్రూర జంతువులు వూరిమీద పడితే గ్రామస్తులకు ప్రాణహాని పొంచివుంటుంది. అందువల్ల అవి గ్రామం వైపు చూడకుండా వుండడానికి ఈ ఉపాయం ఆలోచించాను. అదీగాక నాలాంటివాళ్ళ బతుకుతెరువు వేటే కదా! అడవిలో జంతువులు సమృద్ధిగా వుంటేనే కదా మా జీవనం జరిగేది. అది మరొక కారణం” అన్నాడు.
వేటగాడి మంచిమనసుకు, ముందుచూపుకు గ్రామాధికారి సంతోషించాడు. అతణ్ణి తగిన విధంగా సత్కరించాడు. ఆ తరవాత ఆ గ్రామస్థులు ఎండాకాలం అరణ్యంలోని జంతువుల దాహంగురించి కూడ ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ పైన జంతువులూ గ్రామంలోకి రావడం మానేశాయి.

– డా||గంగిశెట్టి శివకుమార్‌

Spread the love