ప్లాస్టిక్‌ లేని భూగోళం కోసం

ప్లాస్టిక్‌ లేని భూగోళం కోసంఆ రోజు చిట్టి పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజు సాయంత్రం మిత్రులను పిలుస్తుంది. కేక్‌ కట్‌ చేసి పార్టీ చేసుకుంటుంది. అందరితో సరదాగా గడుపుతుంది చిట్టి.
ఈ పుట్టిన రోజు కూడా శ్రావణి, చింటూ, శేఖర్‌, ఫాతిమా, మల్లిక, వీణ, చరణ్‌, వంశీ, విక్రమ్‌, రాజేశ్వరి లను పిలిచింది. ఆ రోజు రెండో శనివారం. బడికి సెలవు దినం. రోజంతా నేస్తాలతో సరదాగా గడపాలి అనుకుంది. కానీ అలా జరగలేదు. కేక్‌ లేదు. పార్టీ లేదు.
నిన్న చిట్టి ఇంటి దగ్గరలో జరిగిన ఓ సంఘటన అందుకు కారణం. చిట్టి ఇంటి సమీపంలో ఉన్న చెట్టుకింద రెండు పశువులు చనిపోయి కనిపించాయి. అవి ఎలా చనిపోయాయి అని అమ్మని అడిగింది.
చెత్తకుప్ప మీది పడేసిన ప్లాస్టిక్‌ కవర్లతో కలిసిన ఆహారం తిన్నాయి. ప్లాస్టిక్‌ కవర్లు వాటి పొట్టలోకి పోయి అరగలేదు. చచ్చిపోయాయని అమ్మ చెప్పింది.
అప్పటినుంచీ చనిపోయిన పశువులే ఆమె కళ్ళముందు మెదిలాయి. గతంలో అవి చెత్తకుప్పలో ఆహారం వెతుక్కోవడం చాలాసార్లు చూసింది. అయ్యో.. ఎంత పని అయిపొయింది. ప్లాస్టిక్‌ తిని చనిపోతాయని తెలిస్తే కాపాడేదాన్ని అని బాధపడింది.
అంతకు రెండు రోజుల ముందే ప్లాస్టిక్‌ వల్ల కలిగే నష్టాలను బడిలో చెప్పారు. అప్పుడు అంత పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నది.
ప్లాస్టిక్‌ వస్తువులు తయారు చేసేది మనుషులే. వాడుకునేది మనుషులే. శిక్ష పశువులకా? అన్యాయం కదా! ఆ రాత్రి చిట్టికి అస్సలు నిద్ర పట్టలేదు. చాలా ఆందోళన కలిగింది. ఏదైనా చేయాలని ఆలోచన చేసింది. ఉదయం లేవగానే తన ఆలోచన అమ్మకి నాన్నకి చెప్పింది. చిన్న పిల్లవు నువ్వేం చేయగలవు అన్నారు అమ్మానాన్న. చిట్టి కొద్దిసేపు దిగులు పడింది.
అట్లా దిగులుగా ఉండకు. ఈ రోజు నీ పుట్టిన రోజు. నీ మిత్రులతో సరదాగా గడుపమని చెప్పారు అమ్మానాన్న. పుట్టిన రోజు పండుగలా చేసుకునే కంటే మంచి పని చేస్తే తనకు సంతోషమని అనుకుంది. తన ఆలోచన అమలు చేయాలని నిర్ణయించుకుంది.
వంశీ తప్ప మిగతా మిత్రులు చిట్టి పుట్టినరోజు అని వచ్చారు. ప్లాస్టిక్‌తో కూడిన వ్యర్థాలు తిని పశువులు చనిపోయిన విషయం బాధగా చెప్పింది చిట్టి. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో డ్రైనేజి పూడుకుపోయి మురుగునీటితో కలిసిన వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నామని శ్రావణి చెప్పింది. ప్లాస్టిక్‌ వ్యర్థాల చెత్త వల్ల పందులు, దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నామని ఫాతిమా చెప్పింది.
మా ఇంట్లో మేం ప్లాస్టిక్‌ వస్తువులు వాడం గొప్పగా చెప్పాడు చరణ్‌. ప్లాస్టిక్‌ బ్యాగులు వాడకుండా ఎట్లా ఉంటాం అన్నాడు శేఖర్‌. గుడ్డ సంచీ తీసుకుపోవాలి చెప్పాడు చరణ్‌. నిజమేనన్నట్టు తలూపారు వీణ, చింటూ.
చిట్టికి మరణించిన పశువులు పదేపదే కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ప్లాస్టిక్‌ వల్ల కలిగే నష్టాలు, కష్టాలు ఆ పిల్లలకు కనిపిస్తున్నాయి. హాని చేసే ప్లాస్టిక్‌ వద్దు. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించడానికి ఏమి చేయాలని చాలాసేపు చర్చించుకున్నారు.
చివరికి వీధుల్లో, పార్క్‌లో ప్లాస్టిక్‌ చెత్తంతా ఏరి శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే అమలు పరిచారు. ఇద్దరు ముగ్గురు కలిసి ఒక వీధిలోకి వెళ్లాలని గ్రూపులుగా విడిపోయారు. వీళ్ళతో మరి కొందరు పిల్లలు చేరారు. కొందరు పెద్దలు మీకేం పనిలేదా అని తిట్టారు. అయినా తమ పని ఆపలేదు.
ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు, ప్లాస్టిక్‌ గ్లాసులు, కప్పులు, వాటర్‌ పాకెట్స్‌, కుర్‌కురే రేపర్లు, చిప్స్‌ పాకెట్స్‌, పాల పాకెట్స్‌, స్ట్రా, కూల్‌ డ్రింక్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ సంచులు, ప్లాస్టిక్‌ జెండాలు, థర్మోకోల్‌ షీట్లు, స్పూన్లు, ఫోర్కులు, స్వీట్‌ బాక్స్‌లు పెద్ద కుప్పగా పోగయ్యాయి. వాటన్నిటినీ చూసి విస్తుపోయారు. ఈ చెత్తంతా చెత్తకుండీలో వేస్తే పశువులు తింటాయని వేయొద్దు అనుకున్నారు.
మరి ఏం చేయాలి? చరణ్‌ కాల్చేద్దాం అన్నాడు. ఆ వాసన నాకు పడదు అన్నది రాజేశ్వరి. వాతావరణంలో కాలుష్యం ఏర్పడుతుందని ఒప్పుకోలేదు. వద్దన్నారు. ఆలోచిస్తుంటే కాళీ మంచినీటి సీసాలతో చేసిన గోడ గుర్తొచ్చింది విక్రమ్‌కి. ఆ విషయం చెప్పాడు. అందరికీ నచ్చింది. తెచ్చిన చెత్తను వీలయినంత వరకు ప్లాస్టిక్‌ బాటిల్‌లో కూరారు.
ఆదివారం ఉదయం మొదట వీధుల్లోని మొక్కల చుట్టూ ఏరుకొచ్చిన ప్లాస్టిక్‌ బాటిళ్లు ఇటుకల్లా పేర్చి గోడ కట్టారు. నీటి గుంతలో దోమలు గుడ్లు పెట్టి రోగాలు తెస్తున్నాయి. ఆ గుంతలను పూడ్చారు. తన దగ్గర ఉన్న పైసలతో కొన్ని అట్టలు, తెల్ల కాగితాలు స్కెచ్‌ పెన్‌ లు తెచ్చింది చిట్టి. వెదురు బద్దలు తెచ్చాడు శేఖర్‌.
‘ప్లాస్టిక్‌ సంచులు వద్దు – కాటన్‌ సంచులు ముద్దు. ప్లాస్టిక్‌ వాడకం తగ్గిద్దాం – భూమిని కాపాడుకుందాం. ప్లాస్టిక్‌ వాడకు – ప్రాణం తీయకు. ప్లాస్టిక్‌ నిషేధిద్దాం – పశువుల ప్రాణాలు కాపాడదాం. ప్లాస్టిక్‌ వాడకు – ప్రకతిని నాశనం చేయకు. ప్రకతిని ప్రేమించు – ప్లాస్టిక్‌ తొలగించు’ వంటి నినాదాలు తెల్ల కాగితాలపై రాజేశ్వరి, వీణ, చింటూ, విక్రమ్‌ రాశారు.
అంతలో మరో పిల్లడు తుమ్మ జిగురు తెచ్చాడు. అందరూ కలిసి నినాదాలు రాసిన కాగితాలు అట్టలకు అతికించారు. ఆ తర్వాత వెదురు బద్దలతో బిగించారు.
ఆ సాయంత్రం శుభ్రంగా కనిపించే వీధుల్లో రాసుకున్న నినాదాలతో ఊరేగింపు మొదలుపెట్టారు. ప్రతి వీధిలో పిల్లలు ఆ ఊరేగింపులో భాగం అయ్యారు. చిన్న చినుకులే.. ఉప్పెనై పొంగుతున్నట్లుగా ఉంది.
పిల్లలు చేసే పని చూస్తూ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ఊరేగింపు తర్వాత చిన్న సమావేశం పెట్టారు. తమ ఇళ్లలో ప్లాస్టిక్‌ వాడకూడదని, బయటకు పోతే చేతి సంచి తీసుకుపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్‌ వాడితే ఫైన్‌ వేసే విధంగా గ్రామ పెద్దల దష్టికి తీసుకుపోవాలని అనుకున్నారు.
మన అమ్మమ్మ తాతయ్యల చిన్నప్పుడు ప్లాస్టిక్‌ లేదట. అటువంటి ప్లాస్టిక్‌ లేని భూగోళం చేసుకుందాం అన్నది చిట్టి. 1
వి. శాంతి ప్రబోధ 

Spread the love