ఆదర్శప్రాయుడు

ఆదర్శప్రాయుడుపూర్వం పాటలీపుత్రాన్ని ఆదిత్యవర్థనుడు పాలించేవాడు. ఆయనకు ఆనందవర్థనుడు ఏకైక కుమారుడు. ఆనందవర్థనుడు గురుకులంలో అన్ని విద్యలు నేర్చుకుని రాజ్యం చేరేసరికి ఆదిత్యవర్థనుడికి వార్థక్యం ముంచుకొచ్చింది. ఆయన కుమారునికి పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకోదలిచాడు. అనుకున్నట్లే పట్టాభిషేకం కనులవిందుగా జరిగింది. ఆ మరుసటిరోజు ఆనందవర్థనుడు సభ తీర్చి అందులో రాజ్యంలోని సమస్యలను పరిష్కారాలను చర్చిస్తున్నాడు.
అంతలో రాజధానిలో పేరెన్నికగన్న నగలవర్తకుడు వజ్రనాభుడు సభలో ప్రవేశించి తన బాధను చెప్పుకున్నాడు. అదేమంటే అతనిదగ్గర చాలాకాలంగా నమ్మకంగా పని చేస్తున్న నాగరాజు అనే పనివాడు దుర్బుద్ధి పుట్టి, లక్షలవరహాలు విలువచేసే నగలను తీసుకుని ఉడాయించాడు. వజ్రనాభుడు కొత్వాలుకు ఫిర్యాదు చేశాడు. కొత్వాలు మహా సమర్థుడు. క్షణాల్లో నగలతో సహా దొంగను పట్టి, సభలో రాజుగారి ముందు హాజరు పరిచాడు.
ఆ సందర్భంగా వజ్రనాభుడు రాచకొలువుకు వచ్చాడు. తన నగలను తనకు యిప్పించి, దొంగను కఠినంగా శిక్షించవలసిందిగా కోరాడు. ఆనందవర్థనుడు కొద్దిసేపు ఆలోచించి, వజ్రనాభుని నగలను అతనికి యిప్పించాడు. అయితే దొంగకు శిక్ష మరుసటిరోజు విధిస్తాననిచెప్పి వజ్రనాభుడ్ని పంపేశాడు.
సభికులకు, పెద్దరాజుకు శిక్షను ఎందుకు వాయిదా వేయవలసి వచ్చిందో అర్థంకాలేదు. రాత్రి భోజనాలయ్యాక ఆదిత్యవర్థనుడు, అలా చేయడానికి కారణం ఏమిటని కుమారుని అడిగాడు.
”నాన్నా! మీరు నన్ను క్షమించాలి. ఎవరికీ తెలియకుండా ఇప్పటిదాకా నేనొక విషయం దాచాను. గురుకులంలో వున్నప్పుడు తోటి విద్యార్థి ఇష్టపడి చేయించుకున్న బంగారు ఘంటాన్ని బలహీనతకొద్దీ దొంగిలించాను. వాడు గురువుగారికి ఘంటం కనిపించడంలేదని ఫిర్యాదు చేశాడు. ”ఎక్కడికిపోతుంది? నువ్వే ఎక్కడో పెట్టి మరిచివుంటావు! తీరిగ్గా వెతికితే అదే కనపడుతుందిలే. దిగులుపడకు. అంతదాకా నా దగ్గరున్న మరో ఘంటం ఇస్తాను. దాంతో రాసుకుందువుగాని” అని తన వద్దనున్న ఘంటాన్ని వాడికి గురువుగారు యిచ్చారు. అప్పటినుంచి నాలో తప్పు చేశానే అనే భావన వుంటూ వచ్చింది. గురువుగారితో అసలు విషయం చెబుదామని చాలా సార్లు అనుకున్నాను. కానీ ఆపైన నన్ను అందరూ దొంగగా చూస్తారేమోనని భయంతో చెప్పలేకపోయాను. విద్యాభ్యాసం కాగానే అంత:పురానికి వచ్చేశాను. కానీ నాలో ఆ భావన అలానేవున్నది. దానికి తగినశిక్ష నేను అనుభవించిన తరవాతే నిన్న సభకు వచ్చిన దొంగకు శిక్ష వేయాలని అనుకుని వాడికి శిక్ష వేసే పనిని వాయిదా వేశాను. ముందు మీరు నా నేరానికి శిక్షవేయండి. అది నేను అనుభవించాక నగలదొంగకు శిక్ష వేస్తాను” అన్నాడు.
కుమారునిలోని సత్యసంధతకు ఆదిత్యవర్థనుడు ఆశ్చర్యపోయాడు. కొంత గర్వం కూడా కలిగింది. ”పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు. అయినా అడిగావు గనక చెపుతున్నాను. వంద బంగారు ఘంటాలను తీసుకుని గురుకులం వెళ్ళు. అక్కడ ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు ఇవ్వు. గురువుగారికి క్షమాపణలు చెప్పు” అన్నాడు.
ఆనందవర్థనుడు తండ్రి చెప్పినట్లే చేసి సభకు వచ్చి, నగలదొంగకు కఠినశిక్ష అమలుచేశాడు. దొంగను చాకచక్యంగా పట్టుకున్న కొత్వాలును అభినందించాడు. సభ ముగించి అంత:పురాన్ని చేరిన కుమారునితో తండ్రి యిలా అన్నాడు…
”మంచి గుణాలను నేర్పని విద్య వృథా. నువ్వు గురుకులంలో విద్యతోపాటు సంస్కారాన్ని కూడా అలవరుచుకున్నావు. నిన్ను చూస్తే నాకు గర్వంగా వుంది. ఎందుకంటే నేను మన రాజ్యానికి ఒక మంచిరాజును ఇవ్వగలిగాను. అందువల్ల తృప్తిగా వుంది. రాజు ఉత్తముడయితే ప్రజలూ అతన్ని ఆదర్శంగా తీసుకుని ఉత్తములుగా జీవిస్తారు. రాజే దొంగ అయితే ప్రజలు ఎలా నిజాయితీగా వుండగలుగుతారు? ఈ సంగతిని నీవు చిన్నవయసులోనే గ్రహించగలిగావు. మంచిరాజుకు వుండాల్సిన లక్షణాలు నీలోవున్నాయి. నీ పాలనలో ఈరాజ్యం సుభిక్షంగా వుంటుంది. సందేహంలేదు” అంటూ ఆనందంగా కుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. తండ్రి ఊహించినట్లే ఆనందవర్థనుడు ప్రజల్ని కన్నబిడ్డల్లాగ చూస్తూ ఆదర్శరాజుగా పేరుపొందాడు.
డా||గంగిశెట్టిశివకుమార్‌

Spread the love