పేరు యాది మర్సిన ఈగ

పేరు యాది మర్సిన ఈగఎన్కట ఒకూల్లె ఒక ఈగ వుండేటిది. అది ఇల్లు పెండనీళ్లతోని సాపు చేసుకుంట దాని పేరు యాది మర్సింది.
గప్పుడు గది ఒక పేదరాశి పెద్దమ్మ కాడికివోయి ”పెద్దమ్మా ! పెద్దమ్మా! నాపేరేందే!?” అంట అడిగింది. గప్పుడు ఆ పేదరాశి పెద్దమ్మ ”ఏమో! నాకు తెల్వది! గాడ చెట్టు కొడుతున్న మా పోరడ్ని అడుగు” అన్నది. గప్పుడు ఆ ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు కాడికివోయి ”పేదరాశి పెద్దమ్మా – పెద్దమ్మ పోరడా – నా పేరు ఏంది?” అని అడిగింది. అపుడు వాడు ”ఏమో ! నాకు తెల్వది! నా చేతిల వున్న గొడ్డలిని అడుగు” అన్నడు. గప్పుడు ఈగ గొడ్డలికాడికివోయి ”పేదరాశి పెద్దమ్మా – పెద్దమ్మ పోరడా – పెద్దమ్మ పోరడి చేతిల గొడ్డలా – నా పేరు ఏంది?” అంట అడిగింది. గప్పుడు గొడ్డలి ”ఏమో! నాకు సుత తెల్వది! నేను కొడుతున్న చెట్టును అడుగు” అన్నది.
గప్పుడు గా ఈగ చెట్టు మీద కూసోని ”పేదరాశి పెద్దమ్మా – పెద్దమ్మ పోరడా – పెద్దమ్మ పోరని చేతుల గొడ్డలా – గొడ్డలి కొడుతున్న చెట్టా – నా పేరు ఏంది?” అంట అడిగింది. గప్పుడు చెట్టు ”ఏమో! నాకేం ఎరుక! నా మీద కూసున్న పిట్టలని అడుగు” అన్నది. గప్పుడు ఈగ చెట్టు మీద కూసున్న పిట్టలకాడికివోయి ”పేదరాశి పెద్దమ్మా – పెద్దమ్మ పోరడా – పెద్దమ్మ పోరని చేతిల గొడ్డలా – గొడ్డలి కొడుతున్న చెట్టా – చెట్టు మీన కూసున్న పిట్టలార – నా పేరు ఏంది?” అంట అడిగింది. గప్పుడు పిట్టలు ”ఏమో! మాకూ తెల్వది! మమ్మల్ని పట్టనీకి వచ్చే వేటగాళ్ళని అడుగు” అన్నయి.
గప్పుడు ఆ ఈగ వేటగాళ్ళ కాడికివోయి ”పేదరాశి పెద్దమ్మా – పెద్దమ్మ పోరడా – పెద్దమ్మ పోరని చేతిల గొడ్డలా – గొడ్డలి కొడుతున్న చెట్టా – చెట్టు మీన కూసున్న పిట్టల్లారా – పిట్టలని పట్టుకోనీకచ్చిన వేటగాళ్ళారా నా పేరు ఏంది?” అంట అడిగింది. గప్పుడు వేటగాళ్ళు ”ఏమో! మాకు సుతా తెల్వది! మాకు వంట చేసి పెట్టె అమ్మలక్కలని అడుగు” అన్నరు. గప్పుడు ఈగ అమ్మలక్కల కాడికివోయి ”పేదరాశి పెద్దమ్మా – పెద్దమ్మ పోరడా – పెద్దమ్మ పోరని చేతిల గొడ్డలా – గొడ్డలి కొడుతున్న చెట్టా – చెట్టు మీన కూసున్న పిట్టలారా – పిట్టలని పట్టుకోనీకి వచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టె అమ్మలక్కలారా నా పేరు ఏంది?” అంట అడిగింది. గప్పుడు అమ్మలక్కలు ”ఏమో! మాకూ తెల్వది! గిప్పుడే రాజుగారు అచ్చి బువ్వతిని ఆడ పన్నడు. గాయన్ని అడుగు” అన్నరు. గప్పుడు ఈగ రాజుకాడికివోయి ”పేదరాశి పెద్దమ్మా – పెద్దమ్మ పోరడా – పెద్దమ్మ పోరని చేతిల గొడ్డలా – గొడ్డలి కొడుతున్న చెట్టా – చెట్టు మీన కూసున్న పిట్టలారా – పిట్టలని పట్టుకోనీకచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టే అమ్మలక్కలు – అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారూ – నా పేరు ఏంది?” అంట అడిగింది. గప్పుడు రాజు గారు ”ఏమో! నాకు తెల్వది! నేను ఎక్కి వచ్చిన గుర్రంని అడుగు” అన్నడు. గప్పుడు ఈగ గుర్రంకాడికివోయి ”పేదరాశి పెద్దమ్మా – పెద్దమ్మ పోరడా – పెద్దమ్మ పోరని చేతిల గొడ్డలా – గొడ్డలి కొడుతున్న చెట్టా – చెట్టు మీన కూసున్న పిట్టలారా – పిట్టలని పట్టుకోనీకి వచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టే అమ్మలక్కలు – అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారూ – రాజుగారు ఎక్కి వచ్చిన గుర్రమా – నా పేరు ఏంది?” అంట అడిగింది. గప్పుడు ఆ గుర్రం ”ఏమో! నాకేమీ తెల్వదు! నా బొత్తలున్న గుర్రం పిల్లని అడుగు” అన్నది. గప్పుడు ఈగ గుర్రం బొత్త మీద కూసోని ”పేదరాశి పెద్దమ్మా – పెద్దమ్మ పోరడా – పెద్దమ్మ పోరని చేతిల గొడ్డలా – గొడ్డలి కొడుతున్న చెట్టా – చెట్టు మీద వాలిన పిట్టలారా – పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టే అమ్మలక్కలు – అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారూ – రాజుగారు ఎక్కి వచ్చిన గుఱ్ఱమా – గుర్రం బొత్తల పిల్లా నా పేరు ఏంది?” అంట అడిగింది. గప్పుడు గుర్రం పిల్ల ”ఇహి… ఇహీ .. ఇహీ … ఈగ”… అన్నది. ఈగ కి దాని పేరు యాదికచ్చి ”నా పేరు ఈగ, నా పేరు ఈగ, నా పేరు ఈగ” అంట పెండ నీళ్లతోని ఇల్లు సాపు చేయనీకి ఎగురుకుంట వోయింది.
– పైడిమర్రి రామకృష్ణ, 92475 64699

Spread the love