తల్లిభాష మీద పాయిరమున్న బాలల కవి

తల్లిభాష మీద పాయిరమున్న బాలల కవిసిద్ధిపేట నుండి బాల సాహిత్యం రాస్తున్న వారిలో కవి, రచయిత, ఉపాధ్యాయుడు, బాల సాహితీవేత్త గంభీరావుపేట యాదగిరి ఒకరు. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు, ప్రవృత్తి రీత్యా కవి, రచయిత, కవి. బాల వికాసోద్యమంలో ముందు నిలిచి పనిచేస్తున్న కార్యకర్త. మెతుకు సీమలోని రామాయంపేట మండలం రాయలాపూర్‌ గ్రామంలో జూన్‌ 6, 1972 న పుట్టారు యాదగిరి. శ్రీమతి గంభీరావుపేట బాలమ్మ-డాకయ్య వీరి అమ్మానాన్నలు.
‘అమ్మభాష మనకు నన్నింట తోడుండు/ సాగు జీవితంబు చక్కగాను/ తీపి పంచు భాష తిరుగులేదిలయందు/ భవిత పదము సాగు భాగ్యబాల’ అంటూ మాతృభాష గురించి చక్కగా చెప్పిన ఈ హిందీ ఉపాధ్యాయుడు పద్యం, గేయం, వచన కవిత్వం రాసి మెప్పు పొందాడు. హిందీ భాషాపాధ్యాయుడైన యాదగిరి హిందీతో పాటు తెలుగులో రచనలు చేస్తూ తాను పనిచేస్తున్న ప్రతి చోటా పిల్లలను కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాడు. గంభీరావుపేట యాదగిరి తొలి రచన పద్య కవిత. ‘భాగ్యబాల శతకం’ను తన తొలి వయ్యిగా ప్రచురించారు. యాదగిరి మిత్రబృందం ‘అమ్మ’ కవితల పోటీ నిర్వహించింది, వచ్చిన వాటిలో దాదాపు నూటా యాభై కవితలతో వీరి సంపాదకత్వంలో ‘అమ్మ’ కవితా సంపుటిగా వెలవరించారు. దీనిని తెలంగాణ రచయితల సంఘం ప్రచురించింది. తరువాత తన స్వీయ వచన కవిత్వాన్ని ‘గల్మ’ కవితా సంపుటి పేరుతో అచ్చు వేశారు.
‘జాతి ఖ్యాతి బెంచు జాతీయ చిహ్నంబు/ మూడు రంగులుండి ముదము గొలుపు’, ‘మాతృభాష మరువ మంచిదెపుడు గాదు/ పరుల భాషపైన పడకు మోజు/ కన్నతల్లి మరువ కలగదు యోగంబు’ అంటూ బాలలకు సుద్దులు చెప్పిన ఈ హిందీ ఉపాధ్యాయుడు వృత్తిభాష యైన హిందీలోనూ పిల్లలతో గేయాలు రాయించి, పాడించారు. ఇంకా… ‘పుస్తకములు మనుజ హస్త భూషణములు/ మస్తకమును బెంచి మంచి జూపు’ అని చెబుతారు పిల్లలకు. ‘మతములెన్నియున్న మానవత్వమె గొప్ప/ మానవత్వము లేని మతము సున్న’ అని నమ్మి చక్కని కవిత్వాన్ని చెప్పాడు. పిల్లల కోసం యాదగిరి తెచ్చిన పుస్తకం ‘సల్లు పందిరి’ బాల గేయ సంపుటి. తన పేరులోనే కాదు కవిత్వపు దారిలోనూ తెలంగాణ జీవభాషతోనే చరించే యాదగిరి కవితా సంపుటికి పెట్టిన ‘గల్మ’ లాగే బాల గేయాలకు ‘సల్లు పందిరి’ అని పెట్టడం విశేషం. తన తల్లి భాష మీదున్న పాయిరం. నిరంతరం బడి పిల్లల గురించే ఆలోచించి ‘రారండోరు రారండి…/ వేళకు బడికి రారండి…’ అంటూ పిల్లలను పిలిచిన యాదగిరి ‘పాఠం చక్కగా వినరండి/ ప్రశ్నలు ఎన్నో అడగండి’ అంటూ పిల్లలను చైతన్య పరుస్తాడు కవిగా, ఉపాధ్యాయునిగా. ఇంకా ‘అల్లరి చేష్టలు మానండి/ తల్లిదండ్రులను పూజించండి/ చెట్లు మొక్కలను కాపాడండి’ అంటూ హితం చెబుతాడు.
పైన చెప్పినట్టు సల్లు పందిరి అని పేరు పెట్టడంలోనే కవికి గ్రామీణ జీవితంతో ఉన్న సంబంధం, అనుబంధం తెలుస్తుంది. ఆ సల్లు పందిరి నీడలో కవికి కనిపించిన బాల్యాన్ని గేయంగా చెబుతాడు. ‘సల్లు పందిరి కింద/ చక్కగా కూర్చుని/ చదువులమ్తతో నేను/ స్నేహమే చేసి/ .. గుడ్డి దీపం ముందు/ శ్రద్ధగా చదువుతూ/ శారదమ్మ కృపను/ చక్కగా పొందిన’ అని తన నేపథ్యాన్ని ఈ పద్యంలో చెబుతాడు కవి. ‘జన్మనిచ్చిన అమ్మకు/ చదువు నేర్పిన గురువుకు/ .. బువ్వ పెట్టిన అవ్వకు/ పండ్ల నిచ్చిన చెట్టుకు/ పాట నేర్పిన పల్లెకు/ బుద్ధి చెప్పిన అన్నకు/.. చెరువు నింపిన వానకు/ చేలు తడిపిన నీరుకు/ పాలు తాపిన గోవుకు’ వందనం చెబుతూనే అంతే ప్రేమగా ‘ఆరుగాలం కష్టపడుతూ/ అన్నమెట్టే రైతుకు’ వందనం చెబుతాడు కవి తన గేయాల్లో.
విద్యార్థి పొద్దున్నే లేవాలని సుద్దులు, బుద్దులు చెప్పిన ఈ ఉపాధ్యాయకవి ‘పొద్దునే లేవాలె/ బుద్దిగా చదవాలె/ తల్లిదండ్రుల ఆశ/ తప్పక తీర్చాలె’ అని చెబుతాడు. మరో గేయంలో ‘బాలలం బాలలం/ బడి పిల్లలం/ బంగారు భవితకు/ చిరు దివ్వెలం/ పాఠశాలంటె మాకిష్టం/ పాఠాలన్నీ చదివేస్తాం’ అని చెబుతాడు. ‘స్వాతంత్య్ర దినోత్సవం/ సంతోష మహోత్సవం’ అని, ‘ఇలలో దేవుడు నాన్నేరా…/ మనలో ధైర్యం అయన రా…’ అంటాడు. సల్లు పందిరిలోని చక్కని గీతాల్లో ‘చిన్న బడి’ మరో మంచి గీతం. ఇది ఈ సంపుటికి పతాకం కూడా… ‘అమ్మ ఒడి చిన్న బడి/ ఆడుకునే నారుమడి’ అంటాడు యాదగిరి ఇందులో. అమ్మ ఒడిని నారుమడి అనడం గొప్ప ప్రయోగం. అక్కడే మనం అన్నీ నేర్చుకుంటాం… నారుమడి పంటకు పాదు… రెంటిని పోల్చి చెప్పడం కవికున్న అవగాహనతో పాటు అమ్మ పైన.. అన్నం పెట్టే పొలం పైన ఉన్న మమకారం… ప్రేమకు నిదర్శనం. బాలల కోసం ‘సల్లు పందిరి’ అల్లిన గంభీరావుపేట యాదగిరికి అభినందనలు.. జయహో! బాల సాహిత్యం!!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love