ఒక్క చెయ్యితోని చప్పట్లు ఏగుతయా!

ఒక్క చెయ్యితోని చప్పట్లు ఏగుతయా!ఇద్దరు కల్సి చెయ్యరాని పని ఏదైనా చేస్తే ఇద్దరిని తప్పు అనాలె. కానీ సమాజం ఒక్కలనే నిందిస్తది. తప్పును తప్పు అనడంలో లింగబేధం కూడా చూస్తరు. అందుకే ఆ తప్పు బయటికి వచ్చి పంచాయితీల కూర్చుంటే ఆండ్ల పెద్ద మనిషి ‘ఒక్క చెయ్యి తోని చప్పట్లు ఏగుతయా’ అని ఆ పనిని సాధారణీకరణ చేస్తరు. నిజమే ఒక్క చెయ్యితో కరతాళ ధ్వనులు చెయ్యలేం. అట్లనే ఇద్దరు హేమాహేమీలు ఒక్క సంఘంలోని ఒక్క పార్టీలోనే వుంటే వాల్లకు ఇగో ప్రాబ్లం వల్ల పడదు. అప్పుడు ‘ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడయి’ అని ఆ విషయాన్ని సూక్ష్మం చేసి చెప్పుతారు. అట్లనే అందరు సమానంగా లేనప్పుడు, స్థాయీభేదాలున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే, ‘ఒక్క చెయ్యి వేళ్లే సమానంగ లేవు’ ఎందుకీ తొందర అంటూ అక్కడి ఘర్షణ వాతావరణం తేలిక పరుస్తరు. ఒక్క సామెత వాడినమంటే అందులో తాత్వికత, అక్కడి వాతావరణంకు వర్తిస్తది. విషయం బోధపడతది. అట్లాగే ఎవరైనా ఒక్కసారే రెండు పనులు చేసికొని వస్తరు. లేదా ఎవరినో కల్సిందుకు వెళ్లితే రెండు పనులు లేదా ఇద్దరి పనులు అయితయి అనుకుంటే అప్పుడు ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’ అనే సామెతను అప్రాప్రియేట్‌గా వాడుతరు. అట్లనే ఇంకో మాట కూడా అంటరు. అంత సమానంగా లేవు, వివక్ష కన్పిస్తుందని ఎవరైనా అంటే ‘ఒక్క చెట్టు కాయలే ఒక్క తీరుగ లేవు’ కదా అని అంటరు. కొందరు అవసరం వున్నా లేకున్నా అబద్దం ఆడుతరు. అబద్దాలు ఆడటం హాబీగా మార్చుకుంటరు. ఇటువంటి వాల్ల అబద్దపు తెలివి బయటకు వస్తే మరో అబద్దం ఆడతరు. వీల్లను ‘ఒక్క అబద్దాన్ని కప్పిపుచ్చేందుకు వంద అబద్దాలు’ ఆడుతరు అంటరు. ఒక్కో ఊరి సామెత ఒక ఫిలాసఫీ చెప్పుతది.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love