కవిని బతికించమంటున్న మౌనశ్రీ మల్లిక్‌

కవిని బతికించమంటున్న మౌనశ్రీ మల్లిక్‌కవి కవిత రాయడానికి వస్తువు ఎంపిక, శీర్షిక, శిల్పం, ముగింపు ఎంత ముఖ్యమో అతని చుట్టూ ఉన్న పరిసరాలు సహకరించడం అంతే ముఖ్యం. ఇంటి సభ్యుల ప్రోత్సాహం అత్యంత ఆవశ్యకం. కవిత బాగుంది అని చెప్పకున్నా పర్వాలేదు కానీ ఎక్కడి మాయదారి కవిత్వం అనే మాట వినపడేంత దూరానికి వెళ్ళకూడదు. కవి కవిత రాసేటప్పుడు తనను తానే మరిచిపోతాడు. ఇక పక్కవాడిని పట్టించుకునే పరిస్థితి ఎక్కడుంటుంది. కవి అంతలా మదనపడుతాడు కాబట్టే మంచి కవిత రాయగలుగుతాడు. కవిగా నిలదొక్కుకుంటాడు.

కవిత్వాన్ని శ్వాసలా భావించే వారు కుటుంబసభ్యుల నుండి కొంత వ్యతిరేకతను ఎదుర్కుంటారు. ముఖ్యంగా జీవితభాగస్వాములు తమకు సమయం కేటాయించకుండా కవులు కవితాప్రేయసి వెంట తిరుగుతుంటారని చికాకు పడతారు. కొంతమంది కవులు అదృష్టవంతులు. ఎందుకంటే మొదటి శ్రోత తమ శ్రీమతి అని చెబుతుంటారు. వారికి కవులంటే ఇష్టమెందుకు ఉండదు కానీ పని ఒత్తిడుల ప్రభావం ఓ కారణం కావచ్చు. కవి, కవికి సంబంధించిన కుటుంబ వాతావరణం గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇలాంటి సున్నితమైన విషయాన్ని తీసుకొని మౌనశ్రీ మల్లిక్‌ ”కవి భార్యకు విన్నపం” అనే శీర్షికతో కవిత రాశారు. అందులోని సారం నాచే ఇలా రాయిస్తుంది. మౌనశ్రీ మల్లిక్‌ కవి, సినీగేయరచయిత. పలు సీరియళ్లలో పాటలు రాశారు. వారు సాహితీ లోకానికి సుపరిచితులు.
కవి శీర్షికలో ఎంత ప్రేమను, శ్రద్ధను చూపారంటే ఈ విన్నపాన్ని కాస్త గుర్తించు అనేంతలా. అంత వినయంతో చెప్పినా ఫలితం ఉంటుందా అంటే అది సందేహమే. ఇది మీ స్వయం అనుభవమా? అనే ప్రశ్న మీలో మొలకెత్తవచ్చు. సగటు కవికి ఇది తప్పని పరిస్థితి. ఇది మల్లిక్‌ అనుభవం కాదు. ప్రతి కవి ఏదో ఒక సందర్భానుసారానుభవం. ఎన్నో ప్రయాసల్లోంచి ఈ శీర్షిక పుట్టింది.
కవి కవిత రాసే స్థితిలో ఉన్నప్పుడు మెదడును, చూపును ఎక్కడో పెట్టి వాక్యాన్ని తయారు చేయాలని చూస్తుంటాడు. అంతలోనే ఇంట్లోంచి ఓ పిలుపు వస్తుంది. కాస్త బయటికెళ్ళి పాలప్యాకెట్టో, ఇంకేదో తెమ్మని. కవి ఆ వాక్యం గురించి ఆలోచిస్తూ మరిచిపోతాడు. అక్కడ కవిత్వం పక్కకు పోయి వాళ్ళిద్దరి మధ్య కథొకటి మొదలవుతుంది. ఆమె తప్పు కూడా కాదు. కవిత్వాన్ని అంతలా ప్రేమించే కవి తప్పే. కవికది తప్పు కాదు. అర్థం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు ఆమెకు తప్పు అనిపించదు. విసుగెత్తిపోయినపుడు ఏదైనా తప్పులానే తోస్తుంది. ఇలాంటి సంఘటనలను ఎత్తుగడలో ఎంతో సాదాసీదాగా కవిత్వం చేశాడు కవి.
రెండో స్టాంజాలో కవి ఒక వాక్యం కోసం పడే యాతనను చెప్పాడు. ఎంతమంది మధ్యలో ఉన్నా అక్కడ కనిపించే దృశ్యం నన్నో కవితా వాక్యంగా మలచమని కవిని వేధిస్తుంటుంది. కవికి ఆ దృశ్యాన్ని మెదడులో ముద్రించుకునే సందర్భంలో ఎవరి మాటలూ వినపడవు. కవికి అప్పుడు ఒకే ప్రపంచం ఉంటుంది. అందుకోసమని ఈ కవిని హేళన చేయకండి అని గుర్తుచేస్తున్నాడు. ఈ కవిత ప్రారంభం ఎంత పటిష్టంగా ఉందంటే చివరివరకు కవిని కవితే నడిపించేంతలా. ఇందులో లేనివేవి సృష్టించలేదు. ఉన్నవి రాయకుండా కప్పిపెట్టలేదు.
కవికి ఎక్కడ కప్పాలో, ఎక్కడ విప్పాలో తెలియాలి. ఈ కవికిది బాగా తెలుసు.
సాధారణంగా కవికి, సాధారణ వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. అతడికి ఆలోచనలు చాలా తక్కువ. కవికి ఆలోచనే మూలాధారం. అటువంటి సందర్భాల్లో చెప్పినపనులు చేయకపోవడం, ఒకపనికి బదులు మరొకటి చేయటం లాంటివి సహజంగా జరుగుతుంటాయి. సాధారణంగా కవి కాని వ్యక్తులు కూడా మరిచిపోతుంటారు. అంతగా పట్టించుకోరు. కొన్ని సందర్భాల్లో కవి అని తెలిస్తే చాలు ఏదో ఒకటి ఆపాదిస్తుంటారు. సీరియస్‌ కవి అయితే కవి రాసిన ఈ మూడు, నాలుగో స్టాంజాలకు పూర్తి అర్హుడు. టైం పాస్‌ కవికి ఈ కవితాపాదాలు వర్తించవు.
ఐదో, ఆరో స్టాంజాలో కవికి సమాజం పట్ల ఎంత బాధ్యత ఉంటుందో తెలియజేస్తున్నాడు. కవి నిజంగా ఒంటరే. కవిత్వం కోసం జీవితాన్ని త్యజిస్తాడు. నలుగురితో కలిసి ఫంక్షన్‌కు వెళ్ళినా తాను అక్కడ ఉండడు. తన మనసు ఎక్కడో జరుగుతున్న అమానుష సంఘటనల వైపుగా తిరుగుతుంది. శ్రమజీవుల వెంట పరుగెడుతుంది. కవి నా దృష్టిలో సాధారణ మనిషికాదు. అంతకు పైబడిన వాడు. ఈ కవి దృష్టిలో కూడా కవి స్థానం అగ్రభాగం. అందుకు తార్కాణం ఈ కవితాపాదాలే.
కవికి సజీవత్వాన్ని ఆపాదించాడు. కవి యొక్క మనస్థితిపైన పరిశోధన చేశాడీ కవి.
ముగింపు స్టాంజాల్లో ‘అతడిలోని కవిని బతికించండి’ అంటూ హితవు పలికాడు. అతడికి ధైర్యాన్ని ఇచ్చే ఇంధనంగా మారండి అన్నాడు. కరుణ చూపండి అన్నాడు. పరోక్ష కారణాల వల్ల మంచి సాహిత్యాన్ని సృజించే కవి సాహిత్యానికి దూరం కాకూడదనే ఆవేదన కవిచే ఈ మాటలు పలికించింది. ఇంకో మాటగా కవిత పూర్తయ్యాక మళ్ళీ నీ కొంగుపట్టుకునే తిరుగుతాడుగా అంటూ వాళ్ళ ప్రశ్నలకు బదులునిచ్చారు. నిజానికి కవి భార్యలు ఓ మాట ఒప్పుకోవాలి. కవిత్వాన్ని అంతలా ప్రేమించే కవి ఎంతలా భార్యను ప్రేమిస్తాడో మీకు తెలియనిదా.
ఈ కవి ధైర్యజీవి. కవి భార్యలకు విన్నపం చేసిన సాహసి. చాలా మంది మనసుల్లో నిండిపోయి బయటపడని భావాలకు అక్షర రూపమిచ్చిన చైతన్యశీలి. సున్నితంగా కవితను నడుపుకుంటూ ప్రమాదాన్ని కొని తెచ్చుకోకుండా చక్కగా వస్తుభారత్వం గల కవితను ఎంపికచేసుకొని, తన భారాన్నంతా దింపుకున్నాడు. ఈ కవితను కవిభార్యలకు చేరవేసే బాధ్యత కవులదే. వినిపించి చూడండి. ఫలితాలను అనుభవించండి.
– డా||తండా హరీష్‌, 8978439551
కవి భార్యకు విన్నపం
అతడు
దేని గురించో ఆలోచిస్తూ ఉన్నప్పుడు
మీ పిలుపు వినిపించుకోకపోవచ్చు
దానికే విసుగును ప్రదర్శించకండి

అతడు మీ మధ్యలోనే ఉన్నా..
మీ సంభాషణ అతడికి చేరకపోవచ్చు
ఏ కవితా పాదమో అతడి మస్తిష్కంలో
ఊపిరి పోసుకుంటూ ఉంటుంది
ఆ మాత్రానికే.. తనను హేళన చేయకండి

అతడిని మార్కెట్టుకు పంపితే..
కొన్ని సరుకులు తేవడం మర్చిపోవచ్చు
కుక్కర్‌ విజిల్స్‌ లెక్క మరిచిపోతే అన్నం మాడిపోవచ్చు
పాలు పొంగిపోయి నేలపాలు కావచ్చు
అంత చిన్న విషయాలకే
మతిమరుపు మనిషి అని తిట్టకండి

అతడు మీ పుట్టినరోజును
చివరకు పెళ్లిరోజు కూడా మర్చిపోవచ్చు
ఎక్కడి వెర్రి మాలోకాన్ని కట్టబెట్టారని
మీ పుట్టింటితో మొర పెట్టుకోకండి

అతడు మీతో పాటు నడుస్తుంటాడు
మీతో పాటే నవ్వుతుంటాడు
మీ పక్కనే ఉన్నట్టు కనిపిస్తాడు
మీతో ఉన్నాడన్న మాటే గాని
ఈ జగత్తులో తను ఎక్కడో ఉంటాడు

అతడు
ఎక్కడో యుద్ధంలో గాయపడిన పసి పాపను
గుండెకు హత్తుకుని ఉంటాడు
ఎక్కడో అవమానానికి గురైన
ఆడబిడ్డను ఓదారుస్తూ ఉంటాడు
ఎక్కడో నయవంచనకు గురైన
మనిషి కన్నీళ్లను తుడుస్తుంటాడు

అంతలోనే మీరు గయ్యాళిలా మారి
సూటి పోటీ మాటలతో వేధించకండి
అతడు లోకం తెలిసిన పసివాడు
కవితలు రాసే నెలరేడు
కవిత కోసం అతడు
అనుభవిస్తున్న వేదనను అర్థం చేసుకోండి
రాయడం పూర్తయ్యాక
మీ కొంగు పట్టుకునే తిరుగుతాడు కదా!

అతడి పట్ల కాస్త కరుణతో ఉండండి
అతడిలోని కవిని బతికించండి

గుర్తుంచుకోండి..
ఈ భూమ్మీద అత్యున్నత పదవిలో ఉన్న
వ్యక్తికి మీరు భార్య
మీరూ కవికి భార్య
ఆ మాత్రం సంయమనం పాటించలేరా!?
అలాంటి కవికి ఇంధనంగా మారలేరా??
– మౌనశ్రీ మల్లిక్‌

Spread the love