మా ఓట్ల తాత

*****”ఏరు నువ్వెంత? నీ లెక్క ఎంత?”
”నీ లెక్క ఎంతరా”
”ఒరేయి రంగయ్య.. ! ఈసారి నీ పార్టీ గెలిస్తే నా ఎకరం పొలాన్ని వదులుకుంటా పో”
”ఇప్పుడు మొగోడి మాట మాట్లాడినవ్రా, ఈసారి గనక నీ పార్టీ గెలిస్తే నా ఎకరం పొలాన్ని వదులుకుంటా పో” అని అనుకుంటున్న మాటలు నా చెవున పడటం, నేను దిగ్గున లేవడం ఒకేసారి జరిగిపోయాయి. కళ్ళు నులుముకొని బయటకు వచ్చి చూడగానే, మా ఇంటి పక్కన ఉన్న మల్లయ్య తాత, మా ఇంటికి ఆ పక్క ఉండే రంగయ్య తాత చెరో వైపు చేరి బట్టలు చింపుకొని అరసుకుంటున్నారు. వాళ్ళ పంచాయితికి కారణం, అంతకు ముందు రోజే జరిగిన అసెంబ్లీ ఎన్నికలే అని అర్ధం అయ్యింది. ఎంత సేపు చూసినా, ఎవరు ఆపిన, ఏ రకంగా ఆ గొడవ ముగింపుకు రావట్లే. ఈలోగా పెద్ద మనుషులు చేరి, మా మల్లయ్య తాత, మా రంగయ్య తాతల శపథాలని నిజం చేసేటట్టుగా అనిపించింది. గొడవకు ముగింపుగా, మా మల్లయ్య తాత పార్టీ గెలిస్తే, మా రంగయ్య తాతది ఎకరం రాసియ్యలి, మా రంగయ్య తాత పార్టీ గెలిస్తే, మా మల్లయ్య తాతది ఎకరం రాసియ్యలి అనే ఒప్పందం మీద సంతకాలు అయిపోయి, పంచాయితీ తీర్పు జరిగినది. అటుగా పోతున్న అమ్మలక్కలకి మాత్రం మా మల్లయ్య, రంగయ్యల గోల చూసి ”ఊళ్ళో పెళ్ళికి ఎంది ఈ కుక్కల కొట్లాట” అని మొకం విరుచుకుంటూ వాళ్ళ దారిన వాళ్లు పోయారు.
గొడవ జరిగిన తర్వాత రోజే ఎన్నికల ఫలితాలు. మా ఊరు పట్వారీ ఇంట్లో ఉన్న ఒకే ఒక్క రేడియో దగ్గర చేరారు ఊరి జనం. ఫలితాలు వెలువడ్డాయి, దరిద్రానికి మా మల్లయ్య తాత పార్టీ ఓడింది, రంగయ్య గెలిచాడు. పౌరుషానికి ఊరి జనం ముందు రాసిన కాగితానికి కట్టుబడి, ఉన్న ఎకరం భూమిని రంగయ్య చేతిలో పెట్టాడు మా మల్లయ్య తాత. ఈ చోద్యం చూసిన జనం మాత్రం పార్టీ ఎవడిది? అధికారం ఎవరిది? ఎవడికి పట్టనిది ఈ ఇద్దరికే పట్టింది అని దుమ్మెత్తి పోశారు. ఎన్నికల ఫలితాలకోసం శపథం చేసి భూమిని కోల్పోయిన మా మల్లయ్య తాతకి, ఆ రోజు నుండి ‘ఓట్లు తాతగా’ పేరు పడింది.
*****
నగర వాతావరణ ఛాయలు మచ్చుకు కూడా కనిపించని మా ఊర్లో, ఏ విషయంలో పోటీకిరాని తత్వం ఒక్క పార్టీ విషయాల్లో వస్తుంది. నాగరికత, విద్యా విషయంలో కొంత వెనకబాటు ఉన్నప్పటికి విలువలతో కూడిన జీవితాలని సంతరించుకున్న ఊరు అనే చెప్పవచ్చు. 2002 కి ముందు 2002 కి తర్వాత అనే సుధీర్ఘ అధ్యాయాలకి, ఊరి రాజకీయాలకి నిలువెత్తు నిదర్శనాలు మా ఊరి మద్య నిలిచిన గుర్తులే. అలాంటి మా ఊళ్ళో మా మల్లయ్య తాత అలియాస్‌ ‘మా ఓట్ల తాత’ ఒక ప్రత్యకమైన వ్యక్తి. మేం బడికి పోవాలంటే, దేవస్థానం మీదిగా పోవాల్సిందే. దేవస్థానంలో ఉన్న చెట్లలో, ఒక మర్రిచెట్టు కింద ఉన్న బండకి దేవుడి బండ అని పేరు. ఆ బండ మీద ఎవరో ఒకళ్ళు కూర్చొని మాటా మంచీ తెల్సుకోవడం ఒక అలవాటు. ఒకరోజు బడిగంట మోగిందన్న తొందరలో నేను పరుగులు పెడుతుంటే, ”ఏరా పాదరి పిలగా మన ముఖ్యమంత్రి పేరు ఏందిరా చెప్పు” అన్న మాట నా పరుగుని ఒక్కసారిగా ఆపి, అడిగిన మా తాతని పైకి కిందకి చూసి మళ్ళీ పరుగుపెట్టా. నిజానికి అ ప్రశ్న అడిగింది మా ఇంటి పక్కకే ఉండే మల్లయ్య.
*****
1960 లో 12 ఏండ్ల వయసులో జీతం చేయడానికి పడమట నుండి మా ఊరికి చేరిన మా ఓట్ల తాత, 2 పూటలు బువ్వ పెట్టి, సంవత్సరానికి 6 బస్తాల వడ్లకి జీతానికి చేరాడట. దీపావళి నుండి దీపావళికి ఒక ఏడు అనే గుర్తుగా పెట్టుకొని పనికి కుదిరి, మా ఊరీ అమ్మాయినే లగ్గం చేసుకున్నాడు. పిల్లలు కలగక పోయినా ఏ నాడూ మొగుడూపెళ్ళాలు గొడవ పెట్టుకొనేవాళ్ళు కాదు. వయసు ఉన్నన్నాళ్ళు జీతం చేసి, మా ఓట్ల తాత భార్యని సాకినాడు. భార్య పోయి, వయసు మీద పడినాక, కూలి పనికి పోలేక రోజు మా ఊరి దేవస్థానం దగ్గర ఉండే చెట్టు కింద ఉన్న దేవుడిబండ మీద కూర్చొని, ఆయన వయసు ఉండే మరో నలుగురిని పోగేసుకొని, లోకాభిరామయణం మాట్లాడుకొనేవాళ్ళు. ఆయన చుట్టూ చేరేవాళ్ళలో మా ఊరి షావుకారి బొర్రా కిట్టయ్య, మా ఓట్ల తాత, రంగయ్య, వాళ్ళకి తోడు ఇంకొంతమందికి అక్కడే పొద్దుగుంకేది. ఇలాంటి వారికి సహాయంగా, అక్కడికే దిన పత్రికలని వేయించేది మా ఊరి గ్రామ పంచాయితీ. మా ఓట్ల తాతకి పెద్దబాల శిక్ష పుణ్యాన అక్షరాలు చదవడం వచ్చు. ఏది చదివినా బాగా గుర్తు పెట్టుకొనేవాడు. అలా పేపర్‌ చదివితే వచ్చిన తెలివితోనే, నాలాంటి బడికి పోయే పొరగాళ్లని నానా ప్రశలు వేసి విసిగించేవాడు. ఎప్పుడు మాట్లాడినా దేశం- రాజకీయాలు- ఓట్లు ఈ మూడు విషయాల చుట్టే తిరిగి, కొన్నిసార్లు మా మల్లయ్య తాతకి, తనలా అక్కడ చేరిన వాళ్ళకి గొడవలు అయ్యి, అక్కడ నుండి లేచి వెళ్లిపోయేవాళ్ళు. మళ్ళీ తర్వాత రోజు రావడం, దేవుడి బండ మీద కూర్చోడం, యవ్వారాలు పెట్టడం ప్రతిరోజూ జరిగే తంతు. ఇంత చరిత్ర ఉన్న మా మల్లయ్య తాతకి, ఎన్నికలు అన్నా, వాటి ఫలితాలు అన్నా ఎక్కడ లేని ఉత్సాహం. పౌరుషం కోసం ఎకరం పొలం పోగొట్టుకున్నా, ఏనాడూ డబ్బుకి మద్యానికి ఓటుని అమ్ముకోని నిస్వార్ధజీవి మా ఓట్ల తాత.
*****
మా ఊళ్ళో జరిగిన పార్టీ గోడవల్లో మా తాత కూడా దెబ్బలు తిని, జైలుకు పోయా అని చెప్పేవాడు. చిన్నప్పుడు అవన్నీ వింటున్న మాకు మా ఓట్ల తాత ఒక పెద్ద హీరోలాగా కనపడేవాడు. నాకు ఊహ వచ్చిన నాటినుండి మా ఓట్ల తాతని చూసుకుంటూనే బడికిపోయినా. బడికిపోయే పొరగాళ్ళం మేం పెద్ద వాళ్ళం అవుతున్నాం గాని, మా ఓట్ల తాతలో మాత్రం ఏ మార్పూ వచ్చేది కాదు. అదే పేపరు, అదే సోపతి. ఈలోగా నేను మా ఊరి నుండి వేరే ఊరికి పై చదువుల కోసం వెళ్లిపోయా. వచ్చిన ప్రతిసారీ మా ఓట్ల తాతతో మాట్లాడటం నాకు అలవాటే. కారణం..! ఊరి విషయాలన్నీ దేవస్థానం చెట్టుకింది దేవుడి బండకాడికి రావడం ఆనవాయితీ. ఎప్పుడు మా ఓట్ల తాతని చూసినా, ”ఎట్లుండే నీ ఓట్ల గోల” అని ఎచ్చిడి మాటల మాట్లాడేటోడిని. నా ఓట్ల గోల ఏమో గాని, నీ నౌకరీ బాగుండెనా అని మెల్లగా అనెటోడు.
ఈ మద్య మా ఊరికి వచ్చినప్పుడు, ఏరా పాదిరబ్బాయి, ఈసారి ఎటు నీ ఓటు. ఎవల్లకే అని అడిగినాడు. ”ఏ చల్‌ తీయి ఓట్ల తాత, పైసల ఎవడిస్తే వాడికే నా ఓటు’ ‘అని కొంచె కటువుగా సమాధానం చెప్పడంతో మా తాత ”ఏరా పాదిరి పిలగా..! చదువుకున్న నీకు, నిషానిగాడిని నాకు ఏం తేడారా?” ఓటు అమ్ముకుంటే, మళ్ళా పెద్దోళ్ల దగ్గరకి పోయి ఏం మొఖం పెట్టుకొని మన పనికోసం అడుగుతం చెప్పు? ఆలోచించుకో బిడ్డా అని తనలో ఉన్న జీవిత విలువలతో కూడిన ఒక ఉపన్యాసాన్ని వినిపించిండు. ఈలోగా మా ఊరి షావుకారి బొర్రా కిట్టయ్య దేవుడి బండ మీదకి రాగానే, మా ఓట్ల తాత కె.ఎన్‌.వై. పతంజలి రాసిన ‘ఏన్నికలైపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటది?’ అనే శీర్షిక చదవడం మొదలు పెట్టాడు.
”ఎన్నికలైపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?
దగా పడిన ఒక ఆడకూతురిలాగా వుంటుంది!
దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా
రైలెక్కిపోయిన పల్లెటూరి పిచ్చి పిల్లలాగా ఉంటుంది దేశం.
ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది?
చిరిగిపోయిన ప్రచార పత్రాల గుట్టలాగుంటుంది.
ఎన్నికలైపోయినాక ఏమౌతుంది?
మనకి భోజనం లేదని గుర్తుకొస్తుంది.
మనకి ఉపాధి లేదని, మనకి దిక్కూ, దివాణం లేదని,
మనకి తెరువూ, తీరూ లేదని మళ్లీ గుర్తుకొస్తుంది.
మన ఇంట పుట్టిన దోమైనా, పరాయింట పుట్టిన జలగైనా
మన రక్తం పీల్చే బతుకుతాయని స్పష్టపడుతుంది.
తెలిసి తెలిసీ అయిదేళ్లకోసారి జీవితాంతం
మోసపోవడం గూర్చి ఏడుపొస్తుంది.
మనమీద మనకి కొంచెం అసహ్యం వేస్తుంది.
మన బుద్ధి గడ్డి తింటున్నాదని తెలిసి సిగ్గేస్తుంది.
ఎన్నికల పతాకాలు విప్పేసిన తర్వాత, గుడారాలు పీకేసిన తర్వాత,
పట్టాభిషేక మహోత్సవం ముగిసిన తర్వాత
తుపాకీ ఇంకా మనకేసే గురి పెట్టి ఉందని తెలుస్తుంది.
మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది.”
అని చదువుతుంటే చుట్టూ చేరి వింటున్న అందరు, నిజమే కదా, ఈ ఓట్లు వచ్చినప్పుడే ఈ హంగు, ఆర్భాటం. ఓట్లు అయిపోనంక ఎవడు ఎవడిని పట్టించుకొనే నాధుడు ఉండదని లోక సత్యాన్ని మాట్లాడుకుంటుండగా నేను అక్కడ నుండి చిన్నగా జారుకున్న.
కొంచెం దూరం పోయిన నన్ను ”ఓ పాదిరి పిలగా మళ్ళీ ఎప్పుడు రాక”? అని మా ఓట్ల తాత పిలుపుతో, ఓటుకి వస్తాలేవే అని వెళ్లిపోయా. ఈలోగా ఎన్నికల హడావిడి మొదలైంది. మా ఓట్ల తాత చుట్టూ జనం మూగడం, మా పార్టీ గెలుస్తాది అంటే, మా పార్టీ గెలుస్తాది అని ఒకడు, ఒడిపోతే నా ఎకరం రాసిస్తా అని ఒకడు, మీసాలు గీసుకుంటా అని ఇంకొకడు రోజూ ఇదే గోల. మా ఊరి జనం మాత్రం బొర్రా కిట్టయ్య, మల్లయ్య తాత దగ్గరకే వచ్చి విషయాలు అడిగే వాళ్ళు. ఈ లోగా ఆ చెట్టు కింద కూర్చొనే జనం క్రమక్రమంగా తగ్గడం మొదలైంది. దానికి గల కారణం, మా ఊరి గ్రామ పంచాయితీ ఓట్ల ప్రచారాల కోసం జనం పోయినా, మా ఓట్ల తాత మాత్రం ఆ చెట్టుకిందే కూర్చొని పేపర్‌ ఈ ఆ చివర నుండి ఈ చివర వరకు చదివేవాడు.
*****
ఈలోగా నాకు సెలవలు దొరికి ఒక వారం ముందే ఇంటికి వచ్చేసా. రావడం రావడమే మా ఓట్ల తాతనే పలకరించా, ”ఏందే ఓట్ల తాత, ఎట్లా ఉంది ఈ సారి ఊపు?”
”ఏం ఊపో ఏందో, ఈ సారి ఓటు ఏసే కథ లేనట్టే ఉందిరా పిలగా” అని కొంచెం నీరసంగా అన్నాడు.
”ఏందే? పానం బాగలేదా” అని అడిగినా
”ఊరు పోమ్మనటుంది, కాడు రమ్మంటుంది” అని నీరసంగా మాట్లాడినాడు
”ఏందే? ఏరి నీ సోపతి”
”ఓట్ల ప్రచారానికి పోయుండే”
”వదిలేయి, ఏం కత? ఎట్లుంది నీ నౌకరీ? అని కొన్ని విషయాలు ఆరా తీశాడు.
ఈలోగా ప్రచారానికి వచ్చిన నాయకులు, మా తాతని వెతుక్కుంటూ వచ్చి ”ఏందే మల్లయ్య బాపు, ఈసారి మాకు వేయాలే మరి ఓటు, ఏరి నీ సొపతి? అని ఆరా తీసి, అక్కడే మా ఓట్ల తాత దగ్గర కూర్చొని, అన్నీ వాకబు చేసినారు. మా ఓట్ల తాత వాళ్ళ ముందు పెట్టిన డిమాండ్లని, గెలవంగానే చేస్తాం అని మాట ఇచ్చి, మా ఓట్ల తాత ఓటుని వాళ్ళ ఓటు అని మాట తీసుకొని పోయినారు. ఇలా రోజుల్లో 3 పార్టీలోళ్ళు రావడం, మా తాతని ఒప్పియడం జరుగుతూ వస్తుంది. నాకేమో మా ఓట్ల తాత ఆరోగ్యం క్షీణిస్తుంది అని అర్ధం అవుతుంది.
*****
ఈలోగ ఎన్నికలు ప్రచారం ఊపందుకుంది, దాంతో పాటు మా ఓట్ల తాత అనారోగ్యం కూడా. ఎంత వాన వచ్చిన, ఎంత ఎండ కొట్టిన దేవుడి బండ మీదకి వచ్చే మా ఓట్ల తాత, ఆరోజు రాలే. నేనే ఆయన గుడిసెలోకి పోయా. మా ఓట్ల తాత వొళ్ళు కాలిపోతుంది. అసలే చూసే దిక్కు లెనోడు. రోజు గడా గడా మాట్లాడే మా ఓట్ల తాతని అలా చూసి ఏడుపొచ్చింది. నా సోపతి గాడిని పిలిచి, ధావాఖానాకి పోతుంటే, మా ఓట్ల తాత రోజు కూచునే బండని అలాగే చూస్తూ ఉన్నాడు. అ రోజు ప్రచారంలో పడి మా తాత దోస్తానా కూడా ఎవ్వరూ రాలే. ధావాఖానాలో మా ఓట్ల తాతని చూసి, కొంచెం ఆలస్యంగా తగ్గిద్ది అన్నాడు మా ఊరి శాస్త్రి. ఇంటికి వచ్చినాక కూడా, మా ఓట్ల తాత కోసం పార్టీ వాళ్ళు రావడం ఆగలే, బాగాలేదు అని చెప్పినా, ఎలా ఐనా ఓటుకోసం రావాలని బతిమిలాడి పోయినారు.
ఓటు వేసే రోజు దగ్గర పడుతున్న కొద్దీ మా ఓట్ల తాత బతుకు మీద ఆశ తగ్గిపోతుంది. మా ఓట్ల తాత వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి అని అందరినీ దగ్గరకు పోగేసుకుంటున్నాడు. సరిగ్గా, ఓట్ల రోజు కంటే ముందు రోజే, మా ఓట్ల తాత మాట పడిపోయింది. ఇక చూపు మాత్రమే. అన్నీ సైగలే మీద నడుస్తున్నాయి. దాదాపుగా అందరూ వచ్చి చూసి వెళ్లిపోయారు. తెల్లరితే ఓట్లు. మా ఊరి జనానికి ఓట్ల గురించి సమాచారం లేదని, నువ్వు లేక మాకు ఆ విషయాలే తెలియట్లేదే మల్లయ్య అని ఆయన సొపతి గాళ్ళు ఏడవడం నాకు ఇంకా గుర్తు. సైగతో కూడా అందరికీ ఓటు వేయమని మా ఓట్ల తాత చెప్తున్నాడు. నాకేమో ఈ రాత్రి గడిస్తే గగనమే అని అనిపించింది.
అరోజు పొద్దున్నే, మా ఇండ్ల ముందు నుండే పోలీసు జీబులు పోవడం నా చెవిన పడింది. సరిగ్గా 7 గంటలకు ఓట్లు మొదలయ్యాయి. పొద్దున నుండే మా ఓట్ల తాత సొపతి గాళ్ళు, మా తాత మంచం చుట్టూ చేరి పేపర్‌ చదవడం లాంటివి చేస్తున్నారు. ఈలోగా ఓటు వేయడానికి వచ్చిన మా ఓట్ల తాత బలగం, మా తాతని చూసి మళ్ళీ ఎప్పుడు రావాల్సి వస్తాదో అని అనుకుంటూ పోతున్నారు. ఇంతలో ఓట్ల ఏజెంట్లు వచ్చి మా తాతని తీసుకొని పోయినారు. మా తాత ఓటు మా తాత వేశాడో, ఆ ఏజెంటు వేశాడో పైనున్న ఆ దేవుడే ఎరుగు. చిన్న చిన్న సంఘటనల మినహా ఎన్నికలు ముగిశాయి. ఆ రాత్రి ఎవ్వరూ మా తాతని చూడటానికి రాలే. అలా రెండు రోజులు గడిచాయి, దిన దిన గండం అన్నట్టుగా ఉంది మా ఓట్ల తాత పరిస్థితి.
*****
ఓట్ల సంబరం తుది అంకానికి చేరింది.
ఆ పొద్దు ప్రతిరోజు కంటే చాలా భీతి వాతావరణంతో మొదలైంది. ఈలోపు మా ఓట్ల తాత చూపు కూడా పోయింది. మా ఊరిబడిలో ఓట్ల లెక్కింపు, అటు పక్కకి పురుగుని కూడా పోనీయని పోలీసోళ్ళు. ఊరు ఊరంతా మా బడి మీద కట్టిన మైకులకే చెవులు అంటించారు. ఓట్ల ఫలితాల కోసం ఊరు ఎదురుచూస్తుంటే, మేము మాత్రం మా ఓట్ల తాత గురించి మొక్కని దేవుడు లేడు.
సరిగ్గా సాయంత్రం 4.30కి గెలిచిన వాళ్ళ పేర్లు, మా ఊరి మైకులు పగిలేటట్టు మారుమ్రోగింది. బడి దారి మొత్తం బుక్క పులిమారు గెలిచిన పార్టీ వాళ్ళు. గెలిచిన ఆనందంలో ఒక గుంపు, ఓడిపోయిన కోపంలో మరో గుంపు తోపులాట జరిగింది. పోలీసులు వచ్చి, ఎటు ఉరికిచ్చే వాడిని అటే ఉరికిచ్చారు. రాత్రి అయ్యింది. ఓట్ల సంబరం ముగిసింది.
ఊరంతా ప్రశాంతంగా నిద్రలో ఉండగా, ఆ తెల్లవారు జామున మా ఓట్ల తాత కన్ను మూశాడు. ఊరు ఊరంతా ఒకటయ్యయి మా ఓట్ల తాతని చూడటానికి వచ్చారు. ఆ పొద్దు ఎవ్వరూ పనులకి పోలే. వచ్చిన ప్రతి వాళ్ళు ఏడ నుండి వచ్చి మా ఊళ్ళో జీవి విడిచిండు ఈ మల్లయ్య. దేవుడసువంటోడు, ఎవ్వడికి కీడు చేయలే. పిలగాళ్లు ఉంటే ఎంత ఏడిచేటోల్లో అని, ఉన్న దాంట్లోనే తిని బతికి ఈ పొద్దు ఇట్లా అయ్యిండు అని కంట నీరు పెట్టినారు. మా ఓట్ల తాతకి స్నానం చేయించి, కొత్త బట్ట కట్టాం.
సరిగ్గా ముందు రోజు ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయానికి సాయంత్రం 4.30కి మా ఓట్ల తాత పాడే పైకి లేసింది. ఇల్లు దాటి, దేవస్థానం, దేవుడి బండ, ముందు నుండి, మా బడి మీదిగా, కాస్టాల గడ్డకి మా మా ఓట్ల తాత ని తీసుకొని పోవడం అని చెప్పినారు. దేవుడి బండ ఎందుకో మౌనం గా చూస్తుంటె, మా తాత సోపాతిగాళ్ళు, ”ఆరేరు మల్లయ్య వచ్చి పేపర్‌ చదువురా” అన్న మాట అందరి కంట నీరు తెప్పించ్చింది. మా ఓట్ల తాత కోసం ఒక్క క్షణం అక్కడ ఆగి, ముందుకు సాగాం. నిన్నటి దాకా జనంతో ఉక్కిరిబిక్కిరి అయిన మా బడి ఇప్పుడు చాలా మౌనంగా ఉంది. నిన్ననేమో ఊరి నిండా కేరింతలు, ఈలలు, గెలిచిన అభ్యర్దుల మీద పూలు, సన్మానాలు, విజయ యాత్రలు, దారి పొడవునా వాళ్ళు చల్లుకున్న బుక్క.
ఇప్పుడేమో మా ఓట్ల తాత మీద పడే పూలు, విషాదంలో చల్లే బుక్క అందులో చిల్లర పైసలు. అలా నడుస్తున్న మాకు మా తాత ఎప్పుడూ చదివి వినిపించే కె.ఎన్‌.వై.పతంజలి రాసిన ‘ఏన్నికలైపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటది?’ అనే శీర్షిక గోడ మీద కనిపించేసరికి, మా ఓట్లతాత చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉన్నదో అర్దం అయ్యింది. అనుకున్నదే తడువుగా కె.ఎన్‌.వై. పతంజలి రాసిన ‘ఏన్నికలైపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటది?’ శీర్షిక ఉన్న పత్రికని తీసుకొని, చివరి సారిగా, మా తాత బొంద దగ్గర చదవాలని అనుకుంటుండగా, సాయంత్రం గాలికి పార్టీల జెండాలు రెపరెపలాడుతుండగానే, మా ఓట్ల తాత శవాన్ని వాళ్ళ ఇంటోళ్ళతో కలిసి, మా ఊరి జనం కాస్టాలగడ్డ వైపు ముందుకు నడిపారు.
ఓట్లకోసం ‘మూలాన ఉన్న ఎన్నికయ్య’ని వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన ఏ ఒక్క నాయకుడూ చనిపోయిన ఎన్నికయ్యని కడసారి చూడటానికి రాకపోవడం కొసమెరుపు.
– పడిగ భూపతి (డి.ఎస్‌.జీవా)
9676371743

Spread the love