నీవే నేనై

నీవే నేనైసమయం సాయంత్రం 6.00 గంటలు
గంభీరంగా కనిపిస్తున్న సముద్రం…
సూర్యకిరణాలు పడి నారింజ రంగులో మెరిసిపోతున్న అలలు…
లయబద్ధంగా వినిపిస్తున్న సంద్రపు ఘోష…
వాటి మధ్య నిశ్శబ్దంగా కూర్చుని ఉంది సమీర
ఎగసిపడే అలలు ఆమె పాదాలను సుతారంగా తాకి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి.
జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లకు చిహ్నంగా కనిపిస్తోంది ఆ సంద్రం. ఒంటరిగా అనిపించినప్పుడల్లా అక్కడికి వచ్చి కూర్చోవడం అలవాటైపోయింది సమీరకు. మాటలలో చెప్పలేని ఎన్నో భావాలను ఆ అలలతో పంచుకుంటుంది ఆమె. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లే ఆమెను పెంచి పెద్ద చేసింది. బాగా చదువుకొని ఇంజనీరింగ్‌ కాలేజ్‌ లెక్చరర్‌గా స్థిరపడిందామె. చదువు మీద ఉన్న ఆసక్తితో తన పేరు వెనుక డిగ్రీలు పెంచుకుని పోతూ, ఇప్పటికీ నిత్య విద్యార్థిగానే ఉందామె. ఆ క్రమంలో తెలియకుండానే ఆమె వయసు మూడు పదులు దాటింది. పెళ్ళి చేసి ఒక ఇంటిదాన్ని చేయాలని తల్లి ఎంత ప్రయత్నించినా, ఇంకా చదువుకోవాలనే సమీర కోరికను తల్లి కాదనలేకపోయింది. చివరికి కూతురు పెళ్ళి చూడకుండానే ఆమె ఈ మధ్య కాలం చేసింది. తల్లి మరణంతో సమీర పూర్తిగా ఒంటరిదైపోయింది.
”హారు మేడం! ఎలా ఉన్నారు?” అంటూ వినిపించిన పిలుపుకు ఆలోచనల నుంచి తీరుకొని, తలతిప్పి చూసింది సమీర. ఎదురుగా ఆరడుగుల వ్యక్తి నిలుచుని ఉన్నాడు. వయస్సు ముప్పై కి దగ్గరలో ఉంటుంది. బ్లాక్‌ షర్ట్‌, గ్రే కలర్‌ ప్యాంట్‌ లో చాలా హుందాగా ఉన్నాడు. దృఢమైన శరీరం, చక్కని మేని ఛాయ, ఆకర్షణీయమైన కళ్ళు, పెదాలపై చెరగని చిరునవ్వుతో చూపరులను కట్టిపడేసేలా ఉందతని రూపం. అతనిని గుర్తుపట్టడానికి సమీరకు ఎంతో సమయం పట్టలేదు.
”రఘు.. నువ్విక్కడీ”
”మిమ్మల్ని చూడాలనే వచ్చాను” ఆమె మాట పూర్తి కాకముందే బదులిచ్చాడు అతను. అతనిని చూసిన మరుక్షణం సమీర కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతడు వద్దంటూ కళ్ళతోనే వారించాడు. పక్కనే కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ క్షణం ఆమెకు ఎంతో ధైర్యంగా అనిపించింది. ఆలోచనలు గతంలోకి పరుగులు తీస్తుంటే, కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది సమీర.
క్ష్మిక్ష్మిక్ష్మి
కాలేజీ గ్రౌండ్‌ అంతా కోలాహలంగా ఉంది. స్టూడెంట్స్‌ గేటు దగ్గరికి పరుగులు తీస్తున్నారు. అప్పుడే కాలేజీ లోపలికి అడుగు పెట్టబోతున్న సమీర ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూసి వణికిపోయింది. కాలేజీ గేట్‌ ముందు పెద్ద యాక్సిడెంట్‌. బైక్‌ నుంచి కింద పడిన ఒక వ్యక్తి రక్తం మడుగులో కొట్టుకుంటున్నాడు. ఏదో పెద్ద వాహనం అతనిని ఢ కొట్టి వెళ్ళిపోయిందని స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ గుమిగూడిన జనం అంతా ఆ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో బంధించే ప్రయత్నం చేస్తున్నారు.
”మై గాడ్‌! సేవ్‌ హిమ్‌” అంటూ అప్రయత్నంగా అరిచింది సమీర.
”అంబులెన్స్‌కి ఫోన్‌ చేసాం మేడం! వస్తోంది” పక్కనే ఉన్న వ్యక్తి కూల్‌ గా సమాధానం ఇచ్చాడు. ఇంతలో ఒక వైట్‌ కలర్‌ బెంజ్‌ కారు వచ్చి ఆగింది. కారులోంచి దిగిన వ్యక్తి రక్తం మడుగులో పడి ఉన్న అతనిని భుజంపై వేసుకొని, కారులో పడుకోపెట్టి రెప్పపాటు కాలంలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతా తేలిగ్గా ఊపిరి పీల్చుకొని కాలేజీ లోపలికి నడిచారు.
”దేవుడిలా వచ్చాడు ..ఎవరు అతను?” అక్కడే ఉన్న కో-లెక్చరర్‌ శృతిని అడిగింది సమీర.
”ఫైనల్‌ ఇయర్‌ స్టూడెంట్‌ ..పేరు రఘు” చెప్పింది శతి.
ఆ పేరు వినగానే అక్కడున్న అమ్మాయిలంతా వాళ్ళని చుట్టుముట్టారు.
”మేడం! రఘు చాలా మంచివాడు.. అందరినీ తనవాళ్లు అనుకుంటాడు. మన బ్రాంచ్‌ కాదు అందుకే మీరు ఎప్పుడూ చూసి ఉండరు. హి ఈజ్‌ వెరీ రిచ్‌ అండ్‌ ఫ్రెండ్లీ గై. కాలేజీ టాపర్‌ కూడా…” చుట్టూ చేరిన అమ్మాయిలంతా ‘రఘు’ ని పొగుడుతూ, చిన్న సన్మాన సభ పెట్టారు.
”ఓకే.. ఇనప్‌ .. గో టు యువర్‌ క్లాసెస్‌ ప్లీజ్‌” కాస్త గట్టిగా వినిపించిన సమీర స్వరానికి అంతా మౌనంగా అక్కడ నుంచి వెళ్లిపోయారు. సమీర అంటే స్టూడెంట్స్‌ అందరికీ చాలా గౌరవం.. ఒకింత భయం కూడా, ఆమె మాటకు ఎవరూ ఎదురు చెప్పరు.
”కూల్‌.. సమీరా! ఇక్కడ చాలామంది అమ్మాయిలు రఘు ఫాన్స్‌” అంది శతి నవ్వుతూ.
”వెరీ ఇంట్రెస్టింగ్‌ గై.. అతనిని ఒకసారి కలవాలి” అంది సమీర.
”ష్యూర్‌! నేను పరిచయం చేస్తానులే” అంది శతి. క్లాస్‌ టైం అవ్వడంతో వాళ్ళిద్దరూ కాలేజీ లోపలికి నడిచారు.
****
ఆరోజు తన పుట్టినరోజు కావడంతో అనాధాశ్రమంలో పిల్లలకు భోజనం పెట్టి, బయటకు వచ్చింది సమీర.
”హ్యాపీ బర్త్‌ డే సమీరా!” అంటూఎదురుగా ఉన్న శతి ఆమెను కౌగిలించుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.
”థాంక్యూ! శతి ..నువ్వెప్పుడు వచ్చావు?” ఆశ్చర్యంగా అడిగింది సమీర.
”ప్రతి పుట్టినరోజుకు నువ్వు ఈ టైంలో ఇక్కడే ఉంటావుగా అందుకే లంచ్‌ బ్రేక్‌ లో ఇలా వచ్చాను. నీ కన్నా బెస్ట్‌ ఫ్రెండ్‌ నాకు ఎవరూ లేరుగా.. నీ పుట్టినరోజు ఎలా మర్చిపోతాను? అన్నట్టు నీకు ఒక ముఖ్యమైన గెస్ట్‌ ని పరిచయం చేయాలి” అంటూ రఘు ని పిలిచింది.
”హారు మేడం! హ్యాపీ బర్త్‌ డే” చిరునవ్వుతో విష్‌ చేశాడు రఘు.
”థాంక్యూ.. నిన్న హాస్పిటల్‌ కి తీసుకెళ్ళిన వ్యక్తి…”
”బాగానే ఉన్నాడు మేడం! సరైన సమయానికి తీసుకెళ్ళడం వల్ల ప్రమాదం తప్పింది అన్నారు డాక్టర్లు” చెప్పాడు రఘు.
”థాంక్‌ గాడ్‌! యు డన్‌ ఎ వెరీ గుడ్‌ జాబ్‌” అతని వైపు కృతజ్ఞతా భావంతో చూస్తూ చెప్పింది సమీర.
”ఆశ్రమం చాలా బాగుంది మేడం! చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఎప్పుడూ ఇక్కడికి వస్తూ ఉంటారా?” చుట్టూ ఉన్న చెట్లూ, అందమైన పూల మొక్కలతో నిండిన పరిసరాలను గమనిస్తూ అడిగాడు రఘు.
”అప్పుడప్పుడు వస్తూ ఉంటాను” ముక్తసరిగా బదులిచ్చింది సమీర.
”మీరు ఎప్పుడూ పుట్టినరోజు ఇలాగే ..ఐ మీన్‌ ఇంత సింపుల్‌ గానే చేసుకుంటారా?” మళ్ళీ అడిగాడు రఘు.
”అవును.. నా దృష్టిలో పుట్టినరోజు సెలబ్రేట్‌ చేసుకోవడం అంటే ఆకలితో ఉన్న పదిమందికి ఆ రోజు అన్నం పెట్టి, వాళ్ళు మౌనంగా కళ్ళతో అందించే దీవెనలు తీసుకోవడం” చెప్పింది సమీర.
”చిన్నతనం నుంచీ మీరు ఇలాగే జరుపుకునేవారా?” అంటూ అడిగాడు రఘు.
”చిన్నతనంలో మా నాన్నగారు నా పుట్టినరోజును ఒక పెద్ద పండుగలా జరిపేవారు. బంధువులను స్నేహితులను ఇంటికి పిలిచి కేక్‌ కట్‌ చేయించేవారు. ఇల్లంతా రంగురంగుల బెలూన్స్‌తో నింపేసేవారు. నాకిష్టమైన వినీల ఐస్‌ క్రీమ్‌, చాక్లెట్స్‌ దగ్గరుండి తినిపించేవారు. తరువాత అనాధాశ్రమానికి వెళ్ళి అక్కడ పిల్లలకు భోజనం పెట్టి వచ్చాక అమ్మా,నాన్న, నేనూ కలిసి భోజనం చేసేవాళ్ళం. నా 13 ఏళ్ళ వయసులో నాన్న చనిపోయారు. ఆయనతో పాటే నా సరదాలన్నీ పోయాయి. ఆశ్రమంలో భోజనం పెట్టే అలవాటు మాత్రం మిగిలింది” నిర్లిప్తంగా నవ్వుతూ చెప్పింది సమీర.
ఆమె చెప్పేదంతా మౌనంగా విన్నారు రఘు, శృతి. తరువాత శృతిని పక్కకు పిలిచి ఏదో మాట్లాడి, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రఘు.
శృతి కాసేపు సమీరతో గడిపి, సాయంత్రం నాలుగు గంటలకు వస్తానని, బయటకు వెళదాం రెడీగా ఉండమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది.
****
నల్లని తాడు రోడ్డుపై కారు వేగంగా ముందుకు కదులుతోంది. రఘు కారు డ్రైవ్‌ చేస్తుంటే, పక్క సీట్లో కూర్చుని ఉంది సమీర. వెనుక సీట్లో ఆమె తల్లి, శతి కూర్చుని ఉన్నారు.
”ఒకే ఒక జీవితం ఇది చేయి జారి పోనీకు…” అంటూ కారులో ప్లే అవుతున్న పాట ఎంతో నచ్చింది సమీరకు. బయటకు వెళదామంటూ.. ఎక్కడికి వెళ్ళేదీ చెప్పకుండానే తనను, తల్లిని తీసుకొని బయలుదేరారు రఘు, శృతి. కారు సిటీ దాటింది. రోడ్డుకు ఇరు ప్రక్కలా చెట్లు, పొలాలు తప్ప ఏమి కనిపించట్లేదు. దాదాపు రెండు గంటల ప్రయాణం తర్వాత …కారు ఒక అందమైన లేక్‌ దగ్గర ఆగింది. ఆ లేక్‌ మధ్యలో చిన్న ఐలాండ్‌ ఉంది. అక్కడికి వెళ్లడానికి సన్నని వెదురు వంతెన కనిపిస్తోంది. కారు దిగి లగేజ్‌ తీసుకుని వెదురు వంతెన పై నడుస్తుంటే నీటి మీద నుంచి వచ్చే గాలి శరీరాన్ని తాకి హాయిగా అనిపిస్తోంది. నీళ్ళలో అక్కడక్కడ మోటర్‌ బోర్డ్స్‌ తిరుగుతున్నాయి. అప్పుడే కాస్త చీకటి పడుతుండడంతో రంగు రంగుల దీపాల వెలుగులో ఆ ప్రాంతమంతా అందంగా మెరుస్తోంది. వంతెన దాటగానే, ఐలాండ్‌ అంతా వెదురుతో కట్టిన చిన్న చిన్న హట్స్‌ ఉన్నాయి. వాళ్ళు అటువైపుగా నడిచారు. ఒక హట్‌ ముందు నిలుచుని తలుపు కొట్టాడు రఘు. తలుపు తెరుచుకున్న మరుక్షణం రంగురంగుల బెలూన్స్‌ బయటకు ఎగురుతూ వచ్చి సమీరను సున్నితంగా తాకాయి. గుడిసె లోపల అడుగు పెట్టిన మరుక్షణం ”హ్యాపీ బర్త్‌ డే మేడం” అంటూ స్టూడెంట్స్‌ అంతా ఒక్కసారిగా చుట్టుముట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గది మధ్యలో టేబుల్‌ పైన అందమైన కేక్‌ అమర్చబడి ఉంది. ఆమె పూర్తిగా తేరుకోకముందే ”ప్లీజ్‌ మేడం! కేక్‌ కట్‌ చేయండి” అంటూ క్యాండిల్‌ వెలిగించాడు రఘు.
ఆమె కేక్‌ కట్‌ చేసి, ఒక ముక్క తీసి తల్లి నోటికి అందించింది. సంతోషంతో మెరిసిన పలుచటి కన్నీటి పొర ఆమె తల్లి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. అందరితో చాలా సమయం సరదాగా గడిపింది సమీర. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపించాడు రఘు. ఆరోజు అక్కడే ఉండి మర్నాడు నలుగురం వెళదామంటూ సమీరను ఒప్పించింది శృతి. చాలా రోజుల తర్వాత తన పుట్టినరోజు ఇలా జరుపుకోవడం కొత్తగా ఉంది సమీరకు. రఘు తన కోసం ఇలా ఏర్పాటు చేశాడని శృతి చెప్పింది. అతను ఇదంతా తనకోసం ఎందుకు చేస్తున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు. హట్‌ బయటికి వచ్చి ఒంటరిగా అటూ, ఇటూ తిరుగుతూ అదే విషయం ఆలోచిస్తుంది సమీర.
”హారు మేడం! ఈ ప్లేస్‌ మీకు నచ్చిందా?”అంటూ అడిగాడు రఘు.
”చాలా బాగుంది ”అంది సమీర.
”థాంక్యూ.. రండి కాసేపు బోట్లో తిరుగుదాం. మీకు ఇంకా ఇష్టమైన వెనిలా ఐస్‌ క్రీమ్‌ తింటూ…” అని చెబుతూనే ఆమె చేతికి ఐస్‌ క్రీమ్‌ అందించి తన సమాధానం కూడా వినకుండా బోట్‌ వైపు నడిచాడు. అతనిని అనుసరించింది సమీర. ఆమెకు ఇదంతా ఒక కలలా ఉంది. తన కాలేజీస్టూడెంట్స్‌ ఎవరూ తనతో ఇలా మాట్లాడే ధైర్యం చేయరు. రఘు తనకి స్టూడెంట్‌లా కాక, ఒక మంచి స్నేహితుడిలా కనిపిస్తున్నాడు. బోట్‌ స్పీడ్‌గా కదులుతోంది. నీటి తుంపరలు ఎగిరి ముఖంపై పడి హాయిగా అనిపిస్తోంది. మబ్బుపట్టిన ఆకాశం, నిండైన చంద్రుడు, నీటిపై నుంచి వచ్చే చల్లని గాలి ఆమెకు ఎంతో ప్రశాంతతనిస్తున్నాయి.
”మేడం! మీకు చిన్న గిఫ్ట్‌”
”సారీ రఘు! నాకు గిఫ్ట్స్‌ తీసుకోవడం నచ్చదు’ ‘వెంటనే చెప్పింది సమీర.
”ఈ గిఫ్ట్‌ చూస్తే మీరు కాదనరు ప్లీజ్‌ ఓపెన్‌ చేసి చూడండి” అంటూ బ్రతిమాలాడు. కాదనలేక అఇష్టంగానే తీసుకుని ఓపెన్‌ చేసింది సమీర.
‘అమతం కురిసిన రాత్రి’.. బాలగంగాధర్‌ తిలక్‌ పుస్తకం.. తనకు ఎంతో ఇష్టమైన పుస్తకం…. ఆమె కళ్ళల్లో ఆనంద స్పష్టంగా కనిపిస్తుంది.
”ఈ పుస్తకం మీకు ఎంతో ఇష్టమనీ.. ఈమధ్య ఎక్కడో పోగొట్టుకున్నారనీ .. శృతి మేడం చెప్పారు. అందుకే మీకు ఇది గిఫ్ట్‌ గా ఇవ్వాలనిపించింది” అన్నాడు రఘు నవ్వుతూ..
”థాంక్స్‌” అప్రయత్నంగా అంది సమీర.
”మేడం! మీరు ఏమీ అనుకోనంటే మీకు ఒక మాట చెప్పనా? మీకు పుట్టినరోజు ఇలా జరుపుకోవడమే ఇష్టం. కానీ ఏవో జ్ఞాపకాలకు భయపడి మీకు తెలియకుండానే మీ పుట్టినరోజు ఒంటరిగా, బాధగా గడుపుతున్నారు. ఇకనుంచి ప్రతి సంవత్సరం ఇలా నలుగురితో కలిసి ఆనందంగా జరుపుకోండి” ఉన్నాడా మీ కళ్ళలోకి చూస్తూ.. ఏదో తెలియని ఆత్మీయత అతని చూపుల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఆమెకు. మొదటి పరిచయంలోనే తన ఇష్టాలను తెలుసుకొని మసులుకుంటున్న రఘుపై ప్రత్యేక అభిమానం, గౌరవం కలిగాయి ఆమెకు. అతనికి మనసులోనే కృతజ్ఞత తెలుపుకుంది సమీర.
****
రెండు రోజుల తర్వాత కాలేజీ క్యాంటీన్లో కూర్చుని కాఫీ తాగుతున్నారు సమీర, రఘు.
చాలామంది స్టూడెంట్స్‌ వాళ్ళను గమనిస్తూ అటూ, ఇటూ తిరుగుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల కళ్ళల్లో జెలసీ.. స్పష్టంగా కనిపిస్తోంది.
”మేడం మేం ఇక్కడ కూర్చోవచ్చా? మిమ్మల్ని డిస్టర్బ్‌ చేయడం లేదు కదా!” అంటూ అడిగింది ఒక అమ్మాయి. ఆమె కళ్ళలో బాధ, గొంతులో వెటకారం స్పష్టంగా అర్థం అవుతున్నాయి సమీరకు. ఆమెను చూసి తనలో తానే నవ్వుకుంది సమీర. తనను గమనిస్తూ తిరుగుతున్న అమ్మాయిలు అందరినీ పిలిచి కూర్చోపెట్టుకొని టీ ఆర్డర్‌ చేసింది. అందరూ కూర్చుని సమీర వైపే చూస్తున్నారు.
”మీ అందరి ఉద్దేశం నాకు అర్థం అయింది.. నిజమే! కొన్ని బంధాలు ఎందుకు ఏర్పడతాయో చెప్పలేం.. కొన్ని స్నేహాలకు కారణాలు ఉండవు. మీకు రతన్‌ టాటా, శాంతను నాయుడు మధ్య స్నేహం గురించి తెలుసా? తెలియకపోతే గూగుల్‌ లో సెర్చ్‌ చేయండి. 84 ఏళ్ళరతన్‌ టాటా గారు తన పుట్టినరోజును 28 ఏళ్ళ కుర్రాడితో చాలా నిరాడంబరంగా జరుపుకున్న చిత్రాలు మనం గూగుల్‌ లో చూడొచ్చు. రతన్‌ టాటా లాంటి వ్యాపార దిగ్గజం ఆ చిన్న కుర్రాడితో స్నేహం చేయడం ఏమిటి? ఆ కుర్రాడు అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ అందుకునే సమయానికి టాటా గారు అక్కడికి వెళ్లి అతనిని అభినందించడంతోపాటు, తన వ్యాపార సామ్రాజ్యంలోకి అతనిని ఆహ్వానించి కీలక పదవినిచ్చి గౌరవించడం ఏమిటి? దీనికి సమాధానం ఎవరూ చెప్పలేరు. కొన్ని బంధాలకు కారణాలు ఉండవు… కొందరు పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది.. వాళ్లతో సమయాన్ని గడపడం నచ్చుతుంది… వాళ్లతో చేసే జర్నీ బాగుంటుంది.. వాళ్ళ ఉనికి ప్రశాంతతనిస్తుంది. నాకు అలాంటి వ్యక్తే ‘రఘు’ చాలా స్థిరంగా చెప్పింది సమీర. అది విన్న పిల్లలంతా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. రఘు తన కారులో ఇంటి వరకు లిఫ్ట్‌ ఇస్తాను అనడంతో అతనితో పాటు కారులో బయలుదేరింది సమీర.
రఘు కారు నడుపుతుంటే ఆమె పక్క సీట్లో కూర్చుంది. స్టూడెంట్స్‌ తో తను చెప్పిన మాటలే పదేపదే గుర్తొస్తున్నాయి సమీరకు. ‘రఘు’ కంపెనీ తనకు ఇష్టమని అంత మందిలో అలా బోల్డ్‌గా ఎలా చెప్పగలిగిందో ఇప్పటికీ ఆమెకు అర్థం కావడం లేదు.
”మేడం! నా కంపెనీ నిజంగా మీకు అంత నచ్చుతుందా?” సడన్‌గా అడిగాడు రఘు. ఆమె బదులు ఇవ్వలేదు.
”నేను అమెరికా వెళ్ళిపోతే మీకు బాధగా అనిపించదా?” మళ్ళీ అడిగాడు అతను.
”తెలీదు” చెప్పింది సమీర.
”సిటీలో నాకు చాలా ఇష్టమైన ఒక ప్లేస్‌ ఉంది. అది మీకు చూపిస్తాను వస్తారా?”
”ఇప్పుడు వద్దులే రఘు.. మరోసారి వెళ్దాం” చెప్పింది సమీర.
”ఓకే మేడం! మీ ఇష్టం. నేను అమెరికా వెళ్ళిన తర్వాత మీకు ఫోన్‌ చేస్తాను. మీకు నాతో ఎప్పుడు మాట్లాడాలి అనిపించినా ఫోన్‌ చేయండి. చూడాలనిపిస్తే వీడియో కాల్‌ చేయండి. దేనికీ బాధపడకండి, ఎప్పుడు సంతోషంగా ఉండండి. నేను మళ్ళీ ఆరు నెలల్లో సెలవులకు వస్తాను.
వచ్చేటప్పుడు మీకు ఇష్టమైన చాక్లెట్స్‌ తెస్తాను. ఇంకేమైనా కావాలనిపిస్తే ఫోన్‌ చేయండి. అస్సలు ఆలోచించద్దు.. నాకోసం బెంగ పెట్టుకోకండి..” చెప్పుకుపోతున్నాడు రఘు.
సరే అన్నట్లు తల ఊపింది సమీర. మొట్టమొదటిసారిగా తనకు తాను చిన్న పిల్లలా కనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు తన తండ్రి నాలుగు రోజులు ఊరెళితే ఇలాగే తనకు నచ్చచెప్పి వెళ్ళేవాడు. ఆ రోజులు గుర్తొచ్చాయి సమీరకు. కొన్నిరోజుల తర్వాత రఘు అమెరికా వెళ్లిపోయాడు. కొన్నాళ్ళు కాల్స్‌ చేసేవాడు. క్రమంగా ఫోన్‌ కాల్స్‌ తగ్గిపోయాయి. తను ఎమ్మెస్‌ కంప్లీట్‌ చేసి అక్కడే స్థిరపడ్డాడు. రెండేళ్ళ క్రితం రఘుకి పెళ్ళి అయింది అన్న విషయం అతని స్నేహితుల ద్వారా తెలుసుకొని ఎంతో సంతోషించింది సమీర. ఇన్నేళ్ళ తర్వాత రఘుని మళ్ళీ ఇలా చూస్తోంది తను.
”ఇన్ని రోజులూ మిమ్మల్ని కలవలేకపోయినందుకు సారీ!” అన్న రఘు మాటలకు తిరిగి ఈ లోకంలోకి వచ్చింది సమీర. మెల్లగా కళ్ళు విప్పి అతని వైపు చూసింది. ఇప్పుడు అతనిలో పెద్దరికం, హుందాతనం కనిపిస్తున్నాయి.
”నేను అమెరికా వెళ్ళే ముందు మిమ్మల్ని ఒకచోటకు తీసుకెళ్తానని చెప్పాను గుర్తుందా? నాకు ఇష్టమైన ప్లేస్‌.. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాను రండి” అంటూ ఆమె సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళి కార్‌ స్టార్ట్‌ చేశాడు రఘు. సమీర మౌనంగా లేచి వెళ్ళి కారులో కూర్చుంది. అమెరికా నుంచి తెచ్చిన చాక్లెట్‌ బాక్స్‌ సమీరకు ఇచ్చాడు రఘు. దాదాపు గంట ప్రయాణం తర్వాత ఎత్తైన కొండపై కారు ఆపాడు. కారు దిగి చుట్టూ చూసిన సమీర. అప్పటికే కాస్త చీకటి పడుతుండడంతో జనసంచారం కాస్త తక్కువగానే ఉంది. చల్లని గాలి, రమణీయమైన ప్రకృతితో అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడి నుంచి కిందకు చూస్తే దీపకాంతులతో సిటీ అంతా అందంగా మెరిసిపోతోంది.
”మీతో చాలా విషయాలు చెప్పాలి”
ఏమిటన్నట్లు చూసింది సమీర.
”నాకు రెండేళ్ళ క్రితం పెళ్లయింది. పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా ముహూర్తాలు త్వరగా పెట్టడంతో ఎవరికీ చెప్పలేకపోయా.. మీతో సహా”
సమీర మౌనంగా వింటోంది.
”నాకు తెలిసి బాధ, ఒంటరితనం ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో అనుభవిస్తాడు. చుట్టూ ఎంత మంది ఉన్నా, ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒంటరితనంతో బాధపడుతుంటారు. నాలాగ…” అతను చెప్పేది ఏమిటో అర్థం కానట్టు చూసిన సమీర.
”నాకు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగుండడం లేదు. మీ అమ్మగారు చనిపోయారు అన్న వార్త తెలిసిన మరుక్షణం నేను అక్కడ ఉండలేకపోయాను. మిమ్మల్ని చూడాలని వెంటనే బయలుదేరాను. ఇక్కడికి రాగానే బాగా జ్వరం వచ్చింది. చాలా అలసటగా అనిపించింది. అందుకే ఈ వారం రోజులుగా మిమ్మల్ని కలవలేకపోయాను. అన్ని టెస్టులూ చేసిన తర్వాత నిన్ననే డాక్టర్లు అసలు విషయం చెప్పారు. నా గుండె పూర్తిగా పాడైపోయిందనీ, హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని.. అప్పుడే అర్థమైంది… నాకు హృదయం ఉందని..” నవ్వుతూ క్యాజువల్‌ గా చెప్పే ప్రయత్నం చేసినా, అది అతని వల్ల కాలేదు.
అతని మాటలకు ఉలిక్కిపడింది సమీర.
”రఘు! ఏం మాట్లాడుతున్నావ్‌?” అంటూ అరిచింది.
”నిజం.. మరో వారం లోపు ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు కచ్చితంగా చెప్పారు. ఆ సమయంలో నాకు ఏదైనా జరిగితే నా భార్య పరిస్థితి ఏమిటన్నదే నా భయం. ఇప్పుడు ఆమె ప్రెగెంట్‌ కూడా..” ఆ మాట చెబుతుంటే అతని గొంతు వణికింది.
”ఈ విషయం ఇంకా నా భార్యకు తెలియదు. డోనర్‌ దొరికి, ఆపరేషన్‌ కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాక ఆమెని ఇండియాకి రప్పించాలి. ఎందుకో ఈ విషయం ముందుగా మీతోనే షేర్‌ చేసుకుంటున్నాను. మీ కన్నా నాకు ఆప్తులు ఎవరూ లేరన్న సంగతి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది” ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు రఘు. అప్పటికే ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. ఇంక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక ఇంటికి బయలుదేరింది సమీర.
****
సమీర గుండె పగిలేలా ఏడుస్తోంది. తనకు ఎందుకింత ఏడుపొస్తుందో కూడా ఆమెకు అర్థం కావడం లేదు. దు:ఖం కట్టలు తెంచుకుంటోంది.. మొదటిసారిగా తన ఒంటరితనం తనను భయపెడుతోంది. రఘు రూపం, అతని మాటలే ఆమె కళ్ళ ముందు మెదులుతున్నాయి. వారం రోజులలో ‘అతనికి అంత పెద్ద ఆపరేషన్‌ జరగబోతుంది’ అన్న విషయాన్ని ఆమె ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. భగవంతునిపై పట్టరాని కోపం వచ్చింది. రఘు కోసం తను ఎందుకింత తల్లడిల్లి పోతుందో ఆమెకే అర్థం కావడం లేదు. ఆ రాత్రంతా నిద్ర పట్టకపోవడంతో తన కష్టసుఖాలలో తోడుగా నిలిచిన తన డైరీని చేతిలోకి తీసుకొని, ఆమె మనోభావాలను కాగితంపై పరిచింది.
****
శృతి ఉదయాన్నే లేచి స్టూడెంట్స్‌, కో-ల్లెక్చరర్స్‌ అందరికీ వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా ఆరోజు కార్యక్రమాన్ని మరొక్కసారి గుర్తు చేసింది.
అనుకున్న సమయానికి అంతా అక్కడికి చేరుకున్నారు. అందరి చేతుల్లోనూ పుష్పగుచ్చాలు ఉన్నాయి. శృతి ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగించి, ఒక్క అడుగు ముందుకేసి ఎదురుగా ఉన్న సమాధి దగ్గర ఉంచి దండం పెట్టుకుంది. సమాధిపై చిరునవ్వుతో కనిపిస్తున్న చిత్రాన్ని చూసిన అక్కడి వారి కళ్ళు వర్షించాయి. ఒక్కరొక్కరుగా వచ్చి, వారి చేతిలోని పుష్పగుచ్చాలని సమాధిపై ఉంచారు. చిరునవ్వుతో కనిపిస్తున్న ఆ చిత్రం కింద రాయబడిన ‘సమీర’ అన్న మూడు అక్షరాలు వారి పలుచని కన్నీటి పొరల మధ్య నుంచి మసగ్గా కనిపిస్తున్నాయి. ఆమె చనిపోయి సంవత్సరం అయిందన్న నిజాన్ని ఇప్పటికీ ఎవరూ నమ్మలేకపోతున్నారు. సమీర చనిపోయే ముందు రోజు శృతిని కలిసి, ఒక పెద్ద కవర్‌ ఇచ్చింది. దానిని ఏడాది తరువాత మాత్రమే తెరిచి చూడాలని మాట తీసుకుంది. ఆ విషయం సడన్‌గా గుర్తొచ్చింది శృతికి. కార్యక్రమం పూర్తి కాగానే ఇంటికి వెళ్ళి ఆ కవర్‌ తెరిచి చూసింది. అందులో సమీర ఇంటి తాళాలతో పాటూ కొన్ని డాక్యుమెంట్స్‌ ఉన్నాయి. అవి తీసి చదివిన మరుక్షణం శృతి ఆశ్చర్యపోయింది. ఆ ఇంటిని శృతి పేరు మీద రాసి రిజిస్టర్‌ చేయించిన డాక్యుమెంట్స్‌ అవి.
‘సమీర తన ఆక్సిడెంట్‌కి సరిగ్గా ఒక్కరోజు ముందు ఆ డాక్యుమెంట్స్‌ తనకు ఇవ్వడం ఏమిటి?’ కాస్సేపటి వరకూ శృతికి ఏమీ అర్థం కాలేదు. మరుక్షణం పరుగు లాంటి నడకతో బయటకు వచ్చి, ఆటో తీసుకుని సమీర ఇంటికి చేరుకుంది శృతి. ఏడాదిగా ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇల్లంతా బాగా దుమ్ము పట్టి ఉంది. ఎదురుగా మంచం పై సమీర డైరీ కనిపించింది. ముఖ్యమైన విషయాలన్నీ డైరీలో రాసుకునే అలవాటు సమీరకు ఉందన్న విషయం శృతికి బాగా తెలుసు. తన ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో ఆ డైరీని చేతిలోకి తీసుకుని దానిపై పేరుకుపోయిన దుమ్మును దులిపి పేజీలు తిరిగేసింది శృతి. చివరి పేజీలన్నీ ఆమె ‘రఘు’ గురించి రాసుకుంది. అతని అనారోగ్యం సంగతి తెలిసి ఆమె ఎంత ఆవేదన అనుభవించిందో అక్కడ కన్నీటితో తడిసిన ప్రతీ అక్షరం చెబుతోంది. ఆమె చూపులు ఆఖరి పేజీ దగ్గర ఆగిపోయాయి.
నేస్తం! నీకేమీ కాదు.. నేనున్నాను.. నీతోనే ఉంటాను… నీలోనే ఉంటాను.
నీతో ఎన్నో విషయాలు పంచుకోవాలనీ, మరెంతో సమయాన్ని గడపాలనీ ఉంది.
ఈ విశ్వం నాకు అందించిన అద్భుత వరం నువ్వు
ఉనికి నాకు ధైర్యాన్నిస్తుంది..
ఆలోచన నా పెదాలపై చిరునవ్వులు పూయిస్తుంది…
మాట నాకు మంత్రంలా తోస్తుంది…
చూపు నాకు బ్రతుకు పై ఆశను కలిగిస్తుంది…
ఆలోచన నాకు తెలియని ప్రశాంతతనిస్తుంది…
సమక్షంలో కాలం తెలియకుండా కరిగిపోతుంది.
స్నేహం, ప్రేమ, ఆరాధన, అభిమానం, ఆనందం, మౌనం,
వెరసి నువ్వు.
ఈ సృష్టి నాకు అందించిన అపురూపమైన బంధం నువ్వు.
ఈ బంధానికి నేను ఏ పేరూ పెట్టలేను.. ఎవరితోనూ పోల్చలేను.
ఒక స్వచ్ఛమైన ‘ప్రేమ’ నువ్వు..
ఈ ‘ప్రేమ’ అనే పదాన్ని కేవలం రెండు శరీరాలకు మాత్రమే పరిమితం చేసి చూసే వాళ్ళను తలుచుకుంటే జాలేస్తుంది నాకు. నాకు సంబంధించి ‘ప్రేమ’ అంటే ‘దైవత్వం’. స్వచ్ఛమైన ప్రేమకు ఈ విశ్వం ఎప్పుడూ సహకరిస్తుంది అంటారు. అందుకే వేల మైళ్ళ దూరాన ఉన్నా నిన్ను నేను చేరుకుంటానని నా నమ్మకం. చదువుతున్న ఆమె ఒక్క క్షణం ఆగింది. ఆమెకు రఘు గుర్తొచ్చాడు. సమీర చనిపోయిన విషయం ఇప్పటికీ రఘుకి తెలియదు. సమీరకు యాక్సిడెంట్‌ అయిన ఆ రోజే రఘుకి ఆపరేషన్‌ కావడంతో కోలుకునే వరకు ఎవరూ చెప్పకూడదు అనుకున్నారు. ఆరు నెలల తర్వాత అతను అమెరికా వెళ్ళిపోయాడు. తరువాత కంపెనీ మారాననీ, ఫోన్‌ నెంబర్‌ కూడా మారిందనీ చెబుతూ, సమీరకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్విచ్‌ ఆఫ్‌ వస్తోందని చెప్పాడు. ఆమె జాబ్‌ రిజైన్‌ చేసి వాళ్ళ ఊరు వెళ్లిపోయిందనీ తనకి కూడా కాంటాక్ట్‌లో లేదనీ చెప్పింది శృతి. తరువాత రఘు, తను ఇప్పటివరకూ మళ్ళీ మాట్లాడుకోలేదు. ఎందుకో సమీర లేదన్న విషయం ఈరోజు రఘుకి ఫోన్‌ చేసి చెప్పాలనిపించింది శృతికి. వెంటనే అతనికి వీడియో కాల్‌ చేసింది.
”హారు మేడం! చాలా రోజులకి గుర్తొచ్చాను నేను. ఎలా ఉన్నారు?” నవ్వుతూ పలకరించాడు రఘు.
”ఐ యాం గుడ్‌! నువ్వెలా ఉన్నావ్‌?”
”బాగున్నాను.. సమీరా మేడంకి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఇప్పటికీ రిప్లై లేదు.. ఏం జరిగింది?” అంటూ అడిగాడు.
సమీరా గురించి చెప్పాలనుకునే లోపే మువ్వల శబ్దం చేసుకుంటూ, ముద్దుగా ఉన్న ఒక చిన్న పాప బుడిబుడి అడుగులతో, అటుగా వచ్చింది. ఆమెని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు రఘు.
”సమీరా! పడిపోతావు జాగ్రత్త!” అంటూ అరుస్తున్న రఘు భార్య మాటలు ఆమెకు వినిపిస్తున్నాయి.
”మేడం! నా కూతురు సమీర” అంటూ ఆమెను శృతికి చూపిస్తూ, ”సమీరా మేడంకి నా కూతుర్ని చూపించాలనీ, తన పేరే పెట్టానని చెప్పాలనీ, ఎంతగానో ప్రయత్నించాను.. కానీ ఇప్పటివరకు కుదరలేదు. ఇంతవరకూ ఆవిడ నుంచి ఒక్క ఫోన్‌కాల్‌ కూడా లేదు. కనీసం నా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఆవిడ నన్ను పూర్తిగా మర్చిపోయారు” నిష్టూరంగా అన్నాడు రఘు. సమీరలేదన్న నిజం ఇంక ఒక్క క్షణం కూడా రఘు దగ్గర దాచాలనిపించలేదు శృతికి. ఎందుకో అతన్ని మోసం చేస్తున్నానన్న భావన కలిగింది. ఆ విషయం చెప్పడమే కాక రఘుని సమీర ఎంతగా అభిమానించిందో తెలిపే ఆడైరీ ని అతనికి చూపించాలి అనుకుంది.
”రఘు! నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి” అంటూ పక్కనే ఉన్న డైరీ చేతిలోకి తీసుకుని, అతనికి చూపించబోతూ, ఇందాక చదువుతూ ఆపిన ఆఖరి వాక్యన్ని మళ్ళీ చూసింది.
వేల మైళ్ళ దూరాన ఉన్నా నిన్ను చేరుకుంటానని నా నమ్మకం…
ఎప్పటికీ నీ హృదయంలో ఉంటాను…
నీ హృదయాన్నై ఉంటాను.
ఎందుకంటే రేపు జరగబోయేది యాక్సిడెంట్‌ కాదన్న విషయం నాకు మాత్రమే తెలుసు..
ఆఖరి వాక్యం చదవగానే శృతికి గుండె ఆగినంత పనైంది. తన కళ్ళను తానే నమ్మలేక మరోసారి చదివింది. అంటే! సమీర….. ఇక ఆలోచించ లేకపోయింది. ఆమె ఒళ్ళంతా చెమటలు పెట్టాయి.
”మేడం! ఏదో చెప్పాలన్నారు? ఏమైంది? ఎందుకలా చెమటలు పడుతున్నాయి? హలో..” రఘు పిలుస్తూనే ఉన్నాడు ఏదో మాట్లాడుతున్నాడు ఆమెకు అతని మాటలు వినిపించడం లేదు.
”వేల మైళ్ళ దూరాన ఉన్నా నిన్ను నేను చేరుకుంటాను.. స్వచ్ఛమైన ప్రేమకు ఈ విశ్వం సహకరిస్తుంది” అన్న సమీర మాటలే వినిపిస్తున్నాయి ఆమెకు.
రెప్పవేయడం కూడా మర్చిపోయి రఘు గుండెలపై ఉన్న ఆ చిన్నారిని చూస్తోంది శృతి.
స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నంలా తన హృదయం పై తానే ఆదమరిచి నిద్రిస్తోంది చిన్నారి సమీర.
శ్రీమతి వందన ద్విభాష్యం
94419 29950

Spread the love