బంగార్రాజు

King of gold”ఏమయ్యో! వింటున్నావా? రేపు బంగారమ్మ జాతర కదా! నువ్వు తలస్నానం చేసి కొత్త బట్టలంటే లేవు కానీ, ఉతికిన బట్టలన్నా కట్టుకొని మొక్కులు తీర్చేదాకా చుట్టా, బీడీ, ఏం కాల్చొద్దు. మందు జోలికి పోతివా!… మరి చూడు నీ తోటి నేను మాట్లాడ…” అని జోరీగవలె ముందురోజు నుండి భర్త మల్లయ్యకు చెప్తూనే ఉన్నది లక్ష్మమ్మ.
పాపం ఆమె ఆరాటం ఆమెది. పెళ్లై పదేళ్ళైయినా తన కడుపు పండలేదు. చుట్టుపక్కల తన తోటి పెళ్లయిన వాళ్లందరికీ అప్పుడే బడికి పోయే వయసున్న పిల్లలు ఉన్నారని అత్త ఊరికే గొనుగుతూ ఉంటుంది. మల్లయ్యకు పిల్లలు పుట్టరా? ఏమిటీ? పిల్లలు పుట్టకపోతే మళ్లీ పెళ్లిచేయనా? అని అత్త అన్నప్పుడల్లా లక్ష్మమ్మ గుండెలు గుభేలుమంటూ రంపంతో కోసినట్లుంటుంది. మల్లయ్య మంచి మనసున్నోడు. వాళ్ళ అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటాడో… అంతకన్నా ఎక్కువగా తన మీద ప్రేమ చూపిస్తాడు. ఎంతగా పిల్లలులేరని బాధపడ్డా కానీ… మేకలు ఉన్నాయి… జీవాలు ఉన్నాయి.. పాలిచ్చే బర్రె ఉన్నది. ఊళ్ళ పటేల్‌ వాళ్ల ఎడ్లు, బర్రెలు, కాసినందుకు నెలకు అంతో ఇంతని డబ్బులు ఇస్తారు. ఏదో గొప్పగా లేకున్నా జీవితం ఎట్లనో అట్లా సాఫీగానే నడుస్తున్నది. ఏంచేయాలి? పిల్లలు ఎందుకు కలుగడంలేదో? అని మొక్కని దేవుడు లేడు… ఎక్కని గుడిమెట్టు లేదు… పెట్టని దండం లేదు. మొన్న ఎవరో చెప్పారు… బంగారమ్మ తల్లి దయగల తల్లనీ, చల్లగా చూస్తుందనీ, మొక్కిన మొక్కు తీరుస్తుందని చెప్తే… మేకలను ఇంటికి తోలుకొని వస్తూ ఉంటే… అమ్మవారి ఊరేగింపు పల్లకి ఎదురయింది. ముల్లుకర్ర పక్కన పడేసి, నెత్తిమీద ఉన్న గంప పక్కన పెట్టి, కొంగు తోటి చేయి తుడుచుకొని మనస్ఫూర్తిగా మొక్కుకొంది లక్ష్మమ్మ. మగనితో మంచిగా మొక్కమని చెప్పింది. పండంటి మగ పిల్లవాడు పుడితే పండగ చేయిస్తానని, అనగానే మల్లయ్య మారు మాట్లాడకుండా తలపాగా తీసి చంకన పెట్టుకుని, చేతిలోని కర్ర భార్యకిచ్చి, ”తల్లీ !బంగారమ్మా! మాకైతే ఏం తెలియదు. మనసునిండా నిన్నే నింపుకున్నాం. నా తల్లీ! నా భార్యను తల్లిని చెయ్యమ్మా!” అని మొక్కుకొని… ఇద్దరూ బంగారమ్మ తల్లి పల్లకి కింద ఇటు నుండి అటు, అటునుండి ఇటు మూడుచుట్లు తిరిగారు.
ఆ పల్లకి కనుమరుగయ్యే దాకా చూస్తూనే ఉండి, పల్లకి గుడిలోనికి వెళ్ళాక వాళ్ళు ఇంటికి వెళ్ళి పోయారు. ”నీ పిచ్చి గాని లక్ష్మమ్మా! మొక్కులు మొక్కితే పిల్లలు పుడతారా? ఆసుపత్రిలో చూపించుకో!” ‘అని రెడ్డిగారి భార్య అన్నది కానీ, ఒక పూట తిండి తింటే మరొక పూట పస్తు. ఇల్లు గడవడమే కష్టం. డాక్టర్ల దగ్గరికి ఎట్లా పోతారు? అందుకే లక్ష్మమ్మ అన్నది దయగల తల్లి బంగారమ్మ మనలను ఒక కంట కని పెడుతుందని. అంతేనేమో? లక్ష్మమ్మ అంత మనస్ఫూర్తిగా నమ్మినందుకు… నిజంగానే దయ తలచింది బంగారమ్మ తల్లి. మరో తొమ్మిది నెలలకు మగ పిల్లవాడికి తల్లి అయ్యింది.
ఉన్నంతలో బారసాల చేసుకొని పిల్లవాడికి బంగారమ్మ దేవత పేరు కలిసేటట్టుగా బంగార్రాజు అని పెట్టుకొని ముద్దుగా పెంచుకుంటున్నారు. సద్దిమూట నెత్తిన పెట్టుకొని, చంకలో పిల్లవాడిని ఎత్తుకొని మేకలు కాయడానికి బయలు భూములకు పోయేది లక్ష్మమ్మ. ఎండకు, వానకు లేకలేక పుట్టిన బిడ్డ ఎక్కడ కందిపోతాడో అని చెట్టుకు ఉయ్యాల గట్టి ఒక కన్ను కన్న పిల్లవాడి మీద, మరొక కన్ను కడుపునింపే మేకల మీద పెట్టి ఎట్లానో అట్లా మంచిగా పెంచుకుంటున్నారు. ఐదు సంవత్సరాలు వచ్చాయి పిల్లవాడికి.
బడిపంతులు ”ఏం మల్లయ్యా! పిల్లవాడిని బడికి పంపవా? నీలాగే మేకలకాపరిగా ఉండనిస్తావా?”.. అని అన్నప్పుడు కానీ లక్ష్మమ్మ, మల్లయ్యలకు పిల్లవాడిని బడికి పంపాలన్న ఆలోచన రాలేదు. రోజూ రెడ్డిగారి ఇంట్లో వాళ్ళ మనవడు ముద్దుగా బడికిపోయే బట్టలు (యూనీఫాం) వేసుకుని, బడికి పోయి, ఇంటికి వచ్చి ఇంగ్లీష్‌ పాటలు పాడుతుంటే ముద్దుగా అనిపిస్తుంది. కానీ నాకు బంగార్రాజును చదివించే తాహతు ఎక్కడిది? వాడిని బడికెలా పంపించాలి? అని ఊరికే బాధపడుతుంటే మన బిడ్డ ఈ ముళ్ళల్లో, రాళ్ళల్లో, మైళ్ళకు మైళ్లు నడిచి, ఎండనకా వాననకా మనం పడుతున్న కష్టం వాడు పడవద్దు మామా! ఇంకొక రెడ్డిగారి బర్రెలు, గొర్రెలు కాద్దాం! కానీ మన పిల్లవాడిని మాత్రం తప్పక బడికి పంపాలని గట్టి పట్టుపట్టింది లక్ష్మమ్మ.
లేకలేక పదేళ్ల తర్వాత పుట్టిన పిల్లవాడు కావడంతో మల్లయ్యకు కూడా పిల్లవాడిని పశువుల కాపరిని చెయ్యొద్దు… వాడు సర్కారు నౌకరి చేయాలని అనుకొని, ఇంకో రెడ్డి దగ్గర ఎడ్లు కూడా కాయడానికి ఒప్పుకొని, బంగార్రాజును బడిలో చేర్పించాడు మల్లయ్య.
మల్లయ్యకు లక్షమ్మకు మేకలు కాయడం అంటే ముండ్లు, రాళ్లు గుచ్చుకొని కాళ్లకు రక్తం కారుతాయని తెలుసు. వడగళ్ల వాన పడ్డప్పుడు ఒక్క చెట్టు కూడా ఉండని ఆ బయలు బీడుభూముల్లో… టపటపమని వడగళ్ళు నెత్తి మీదపడి బొప్పెలు కడతాయి. ఎప్పుడో పొద్దున తిన్న సద్దన్నం జీవాల వెంట పరిగెత్తుతుంటే ఎప్పుడో అరిగిపోయి ఆకలివేస్తుంది. ప్రతి సంవత్సరం లక్ష్మమ్మ, మల్లయ్యలు అనుకుంటారు మంచి చెప్పులు కుట్టించుకోవాలనీ, ఒక గొంగడి కొనుక్కోవాలనీ… కానీ వచ్చే డబ్బులు తిండికే సరిపోవు.. అవసరాలు తీరవు. ఇంకా చెప్పులు, గొంగడి కొనడం ఎలా? కాళ్లకు చెప్పులు లేకుండానే… ఆ భగభగ మండే ఎండాకాలంలో చెమటలు కారుతుంటే… నెత్తిమీద సూర్యుని మంట, కడుపులో ఆకలిమంటతో తలమీద ఒక తుండుగుడ్డ కప్పుకొని, మేకలు కాసికాసి ప్రాణాలు విసిగి పోతున్నాయి. తమ వలె తమబిడ్డ కష్టపడ కూడదు వాణ్ణి మంచిగా పెంచాలని అనుకునే ఆ తల్లిదండ్రుల ఆశలకు తగినట్లుగానే ఏకసంతాగ్రహి వలె చెప్పింది చెప్పినట్టు నేర్చుకొని, మంచి మార్కులతో ఒక్కో తరగతి పాస్‌ అవుతూ, బహుమతులు గెలుచుకుంటూ, తల్లిదండ్రులను సంతోషపెడుతూ… గురువుల మెప్పులు, దీవెనలు అందుకుంటున్నాడు బంగార్రాజు.
ఆ ఊళ్లో చదువు అయిపోయింది. పై తరగతులకు పక్క ఊరికి పోవాలి. కానీ వేరే ఊర్లో చదువంటే మాటలా! ఉండడానికి, తినడానికి కూడా డబ్బులు కావాలి. ఇన్ని రోజులు ఊర్లోని బడికి ఉన్నదో లేనిదో తిని, తల్లిదండ్రులతో పాటు ఇంట్లో ఉండడంతో అద్దె ఇంటి బాధ తెలియలేదు. పక్క ఊర్లో చదువు అనగానే తల్లీ తండ్రీ…తమ ఖర్చులు తాము తగ్గించుకోవాలని అనుకొని మరింత డబ్బు ఫీజులకు కావాలంటే ఎలా సంపాదించాలనీ? డబ్బుల ప్రణాళికలు వేసుకుంటూనే ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వారివి. బడి ఫీజులు కట్టాలంటే మాటలా? రెండిళ్ళలో పాచి పనికి కుదిరింది లక్ష్మమ. ఇంకో రెడ్డిగారి పశువులను కాయడానికి కుదుర్చుకున్నాడు మల్లయ్య. కొడుకును పక్క ఊరికి తీసుకొని వెళ్లి కాలేజీలో చేర్పించి, కావలసిన వస్తువులు సర్దిపెట్టి ఇంటికి వచ్చారు మల్లయ్య దంపతులు.
ఆ రోజే కాలేజీకి వెళుతున్నాడు మొదటి సారి బంగార్రాజు. ఆరోజు బాగానే గడిచింది. తరువాత రోజునుంచి కొత్త కొత్త స్నేహాలు, కొత్త కొత్త అలవాట్లు. సిగిరెట్‌ తాగమని ఒత్తిడి చేస్తాడు ఒక స్నేహితుడు… మందు కొట్టి మజా చేద్దాం రమ్మంటాడు మరొకడు… ఇక నెమ్మదిగా చదువును పక్కనపెట్టి వ్యసనాలకు లోనయ్యాడు. సరిగ్గా కాలేజీకి వెళ్లడం లేదు. క్లాసులో కూర్చొని పాఠాలు వినడం లేదు, చదవడం లేదు. క్రమంగా మొదటి రాంకులో ఉన్న మన బంగార్రాజు కాస్తా ఫెయిల్‌ అవడం మొదలైంది… ఒక్కొక్క సబ్జెక్టులో.
కానీ ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు.. కొడుకు కాలేజీకి వెళుతున్నాడనీ, మంచిగా చదువుకుంటున్నాడనీ, అనుకుంటున్నారు. అబద్దాలు ఆడని బంగార్రాజు అబద్ధాలు ఆడటం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులకు మంచిగా చదువుతున్నానని చెబుతున్నాడు. క్రమంగా వ్యసనాలకు బానిస అయిపోయాడు.
ఒకరోజు తండ్రి మల్లయ్య కొడుకును చూడాలని బంగార్రాజు గది దగ్గరకు వచ్చాడు. పిల్లవాడు గదిలో లేడు. గదంతా చిందరవందరగా ఉంది. చదువుకుంటున్న దాఖలాలు కనబడడం లేదు. పుస్తకాలు బూజుపట్టాయి. బట్టలు జిడ్డోడుతున్నాయి. కొడుకు ఎంతకు రాకుంటే కాలేజీలోనే కలుసుకుందామని మల్లయ్య కాలేజీకి వెళ్లి బంగార్రాజు కొరకు వాకబు చేశాడు. అక్కడ అందరూ మీ అబ్బాయి కాలేజీకి వచ్చి చాలా రోజులైందని చెప్పారు. అది విని చాలా బాధపడ్డాడు మల్లయ్య. తిరిగి గదిలోకి వచ్చి తను కొడుకు ఖర్చులకు ఇవ్వాలనుకున్న డబ్బును… ఒక్కొక్క పుస్తకంలో కొన్ని పేజీల తరువాత, కొన్ని పేజీల మధ్యలో ఒక్కొక్కచోట నూరు రూపాయల నోటును పెట్టి ఊరికి వెళ్ళిపోయాడు. బంగార్రాజుకు తండ్రి వచ్చి వెళ్లిన సంగతి తెలియదు. అతని వ్యసనాలకు డబ్బులు అవసరమై ఇంటికి ఫీజులు కట్టాలని.. తండ్రిని డబ్బులు పంపమని ఉత్తరం రాశాడు. తండ్రి కొడుకును నువ్వు అన్ని పుస్తకాలు చదువుతున్నావా? అని ప్రశ్నిస్తూ మాష్టారుతో కార్డు రాయించాడు. అన్ని పుస్తకాలు చదువుతున్నానని అబద్ధం రాశాడు బంగార్రాజు. కానీ ఒక్క పుస్తకం కూడా తెరవలేదని… క్రమంగా చదువు వదిలేసి వ్యసనాలకు లోనైన వాడి కోసం ఇంకా డబ్బు ఖర్చు పెట్టడం అనవసరమని తల్లీ తండ్రీ మాట్లాడుకొని బంగార్రాజును ఇంటికి తీసుకుని వెళ్లారు.
రోజూ తల్లి చద్దన్నం మూట కట్టి ఇచ్చి మేకలను కాయమని అడవికి వెళ్ళమన్నది. బంగార్రాజు పొడవాటి కర్ర మెడమీద నుండి రెండు భుజాల మీదకు వచ్చేటట్టుగా పెట్టుకొని ఆ కర్ర మీద అటో చెయ్యి ఇటో చెయ్యి పెట్టుకొని… కూని రాగాలు తీస్తూ అమ్మ వేయించి ఇచ్చిన శనగలను తింటూ మేకలను బీడుభూముల దారికి పట్టించాడు.
కొండలూ, గుట్టలూ, వాగులూ, వంకలూ దాటి మేకలు పరిగెత్తుతుంటే వాటి వెనుక ”టుర్ర్‌ ..ఎహే! టుర్ర్‌…” అంటూ బంగార్రాజు కూడా పరిగెత్తి, పరిగెత్తి అలసిపోతున్నాడు. బస్తీలో తిని హాయిగా తిరగడం అలవాటైన వాడికి ఈ ఎండకు ఒళ్లంతా చిరచిర లాడుతున్నది. నాలుక పిడచ కట్టుకొని, గొంతంతా ఎండిపోతున్నది.
దూరాన మేకపిల్ల ఈనింది. బంగార్రాజు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి, చంటిమేకపిల్లను ఎత్తుకొని భుజానికి తల్లిదండ్రులు ఉన్న దగ్గరికి తేవాలని ప్రయత్నిస్తున్నాడు కానీ మేకపిల్ల జిగురు జిగురుగా ఉండి జారిపోతున్నది. పైన ఎండ మండిపోతున్నది. తన ఒంటి మీద ఉన్న అంగీ విడిచి మేకపిల్ల పొట్టకు చుట్టి, మెడ మీదకు ఎత్తుకొని, ఒక చేత్తో రెండు కాళ్లు, ఇంకో చేత్తో మరో రెండు కాళ్లు పట్టుకొని ఇంతకు ముందే దారి చూడక నడుస్తూ ఉంటే.. కాల్లో ముల్లు కసుక్కున దిగింది. అది అప్పుడే వాచిపోయి నొప్పి పెడుతున్నది. ఆకలి, చెమట, ఎండా, మేకపిల్ల జిగురు అన్ని చిరాకు పుట్టిస్తున్నాయి. కానీ అక్కడ మేకపిల్లను వదిలిపెడితే నక్కలు ఎత్తుకు పోతాయి. అంతేకాదు బంగారమ్మ జాతర వరకు ఎలానో ఒకలా మేకపిల్లను సాకితే… జాతర సమయంలో అమ్మితే చాలా డబ్బు వస్తుంది. అందుకే ఎంత కష్టమైనా ఓర్చుకొని, కాలుకింద పెట్టనివ్వక పోయినా కుంటుకుంటూ… తల్లి ఉన్న వైపు వస్తున్నాడు బంగార్రాజు. తండ్రేమో రెడ్డిగారి పశువులమంద తోలుకొంటూ వస్తున్నాడు. ఆమందలో ఒక దొంగ కోడెదూడ ఉన్నది. అది మరీ మంకుది… తప్పించుకొని ఉరికి ఉరికి ఇంకో రెడ్డిగారి చేలో పడింది. దాన్ని తోలుకొని రావాలంటే మల్లయ్యకు చుక్కలు లెక్క పెట్టినట్టైంది. దేవుడా! ఇవాళ కోడెను ఇంటికి తీసుకొని వెళ్లకుంటే రెడ్డిగారి తోటి తిట్లు తినాలి. అంతేగాక చేను యజమాని తోటి తిట్లు తినాలి.
పిల్లవాడన్నా బుద్ధిగా చదువుకుని ఏదైనా కొలువు చేస్తే.. ఈ కష్టాలు ఉండకపోవు. సుఖంగా ఉందామనుకుంటే వాడు కూడా మేకలు కాయడానికే వచ్చే.. ఆ బంగారమ్మ తల్లికి దయ లేదా!… ఇటువంటి పిల్లవాణ్ణి ఇచ్చింది.. అని అనుకుంటూ ధారగా కారుతున్న చెమటను తలకు చుట్టుకున్న తువ్వాలు తోటి తుడుచుకొని? కొడుకు కోసం చూస్తే వాడు కనపడలేదు. చేతులు నొసటి మీద ఆనించుకుని చూస్తే దూరంగా… మేకపిల్లను ఎత్తుకొని కుంటుతూ వస్తున్న కొడుకు కనిపించాడు.
బంగార్రాజు మేకలు కాయడం అంత సులువైన పని కాదని మనసులో అనుకున్నాడు. అవును మరి! పొలాలు, బీడు భూములు తిరిగి తిరిగి కాళ్ళు అరిగి పోతాయి. మేకలు కాయడం అంటే ఆషామాషీ కాదు. అసలే సరైన వర్షాలు లేక బీడుభూముల్లో పచ్చిక మొలవలేదు. అందుకే పచ్చిక కోసం దూరంగా వెళ్ళాలి. పురుగూ పుట్రా, పాములను కనిపెడుతూ, మేకలు తప్పించుకొని పోకుండా కంటికి ఏమరుపాటు లేకుండా మేకలను కాయాలి. రాళ్ళల్లో, రప్పల్లో రక్కిస మొక్కల్లో ఎదరు దెబ్బలు తగిలీ తగిలి కాలివేళ్ళు గాయాలతో రక్తం కారుతూ కొంకర్లు పోతాయి. తెల్లారి పొద్దున్నే లక్ష్మమ్మ కొడుకును స్నానం చేయమన్నది. తాను తలారా స్నానం చేసి, గుగ్గిళ్ళు వండింది. కొబ్బరికాయ, పసుపు కుంకుమ, గాజులు పూలు పట్టుకొని బంగారమ్మ గుడికి వెళ్ళింది కొడుకుతో సహా…
అప్పుడే ఆ ఊళ్లో రాజావారి బడిలో ఉద్యోగం చేస్తున్న మాస్టారు బంగారమ్మ దర్శనం చేసుకుందామని వచ్చారు. బంగార్రాజును తల్లి బంగారమ్మకు దండం పెట్టుకొమ్మని ముందుకు తోసింది. బంగార్రాజు దండం పెడుతూ ఉంటే మాస్టర్‌ గారు చూశారు. ”నువ్వా? బంగార్రాజూ! బాగా చదువుకుంటున్నావా?” అని అడిగారు.
ఆ మాట వినగానే లక్ష్మమ్మ కొడుకు బాగోతం చెప్పడం మొదలు పెట్టింది… ”ఎక్కడ సారూ! బొత్తిగా పాడైపోయాడు. ఈడ చదువుతున్నప్పుడు నువ్వు ఎన్ని సార్లు అన్నావు గుర్తుందా? మీ బంగార్రాజు అందరిలోకి ఫస్ట్‌ వస్తాడనీ, మంచి భవిష్యత్‌ ఉందనీ, బాగా చదివించాలనీ… మీ లాంటోళ్లు అందరూ అంటుంటే నిజం అనుకొని, అప్పు సప్పు చేసి వాణ్ని పట్నంలో మా తాహతుకు మించి ఖర్చుపెట్టి, ఫీజులు కట్టి, అన్ని ఏర్పాట్లు చేస్తే వీడు ఏం చేశాడో తెలుసా సారూ? చెప్పొద్దు కానీ, అన్ని పాడు అలవాట్లు చేసుకుని చదవడం లేదు. ఒక్క పుస్తకం ముట్టలేదు. వాడి తండ్రి పట్నం పోయి వచ్చిన కాడి నుండి ముద్ద ముట్టడం లేదు. కంటి మీద కునుకే లేదు. మేమేమో మేకలు, జీవాలు కాసుకుని అరకొర బతుకుతున్నాం అంటే… మా వాడు కూడా మాలాగే తయారయ్యాడు. కాబట్టే…. ఏం చేయాలి సారూ? బెంగ తోటి ఏడుస్తూ ఈ బంగారమ్మ దీవనతోనే వీడు పుట్టాడు. మరి అమ్మా ఇట్లు ఎందుకు చేసావు? నువ్వు ఇచ్చిన బిడ్డ మంచిచెడ్డలు విచారించేది లేదా?” అని అడుగుదామని వీడిని ఇక్కడికి తీసుకొని వచ్చాను అంది.
”తల్లీ! బంగారమ్మా! ఏందమ్మా? మన బిడ్డ సెడి పోతుంటే కళ్ళు మూసుకొని ఈ గుడిలో కూర్చుంటవా?” అని ఏడుస్తూ అడిగింది.
”బంగార్రాజూ! మీ అమ్మా నాయనా కష్టపడి నిన్ను చదివిస్తుంటే… అలా చెడు అలవాట్లకు అలవాటు పడడం మంచిదేనా? మంచిగా చదువుకొని గొప్పవాడివి కావాలి. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి” అంటూ మాస్టారు గారు చెప్పడం.. చిన్నప్పటినుండి ఎంతో ప్రేమగా చూసిన తల్లి ఏడ్వడం, తండ్రి అన్నం తినడం లేదనీ, నిద్ర పోవడం లేదని అమ్మ చెప్పడంతో… మనసు చాలా బాధపడి ఒక్కసారిగా మనసు మార్చుకున్నాడు. ఇన్ని రోజుల నుంచి ఎండలో వానలో మేకలు కాయడం ఎంత కష్టమో అనుభవించిన బంగార్రాజు…
”అమ్మా! ఏడ్వకే! నేను మంచిగా చదువుకుంటాను. నాయనను అన్నం తినమని, నిద్ర పొమ్మని చెప్పు! రేపు నేను పట్నం వెళ్ళిపోతాను” అని తల్లికి చెప్పి తెల్లవారి పట్నంకు వెళ్ళి మళ్ళీ కాలేజీలో అడుగు పెట్టాడు.
ఆ సాయంత్రం తను అద్దెకు తీసుకున్న గదికి వచ్చి దుమ్మంతా దులుపుకొని పుస్తకం తెరిచి చదువుదామని చూడగా పుస్తకాలలోని ఒక పుటలో వంద రూపాయల నోటు కనపడింది… మళ్ళీ కొన్ని పేజీలు తిప్పేసరికి ఆ పేజీలోనూ డబ్బులు కనబడ్డాయి. ఇవి ఎక్కడివి? ఈ పుస్తకంలో డబ్బులు ఎవరు పెట్టారు? అని అతనికి ఆశ్చర్యమై ఆదివారం ఊరికి వెళ్ళినప్పుడు తండ్రిని అడిగాడు. అప్పుడు సంతోషంతో కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా… ”ఇప్పుడు నువ్వు చదువుతున్నావా! కొడకా! నా తండ్రీ! మా నాన్నా!” అని కొడుకును గట్టిగా కౌగలించుకుని సంతోషంతో తలను ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు అర్థమయింది తండ్రి హృదయం బంగార్రాజుకు…. ఓహౌ! తండ్రే ఇందులో డబ్బులు పెట్టాడని, నేను చదువుతుంటే కనబడతాయని. కానీ నేనే ఎన్నడు పుస్తకం ముట్టక, ఒక్కపేజీ కూడా తిరగేయక అందులోని డబ్బులు చూడలేదని అనుకున్నాడు. ఇక అప్పుడే గట్టి నిర్ణయం తీసుకున్నాడు బంగార్రాజు.
తాను బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని, తల్లిని తండ్రిని మేకలు కాసే కష్టం నుండి తప్పించాలని అనుకున్నాడు. అసలే తెలివైనవాడు ఒకసారి జీవితంలో చేదు రుచి చూసిన వాడు కాబట్టి చాలా పట్టుదలగా కష్టపడి చదువుకొని మొదటి ర్యాంకులో పాసై మంచి ఉద్యోగం సంపాదించు కొన్నాడు.
తల్లీదండ్రీ తాను బంగారమ్మకు మొక్కు చెల్లించుకోవడానికి బంగారమ్మ గుడికి వచ్చారు సంతోషంగా. అప్పుడే మళ్లీ ఆ మాస్టారు కూడా ఎదురయ్యాడు. బంగార్రాజు బంగారమ్మకు మొక్కిన తర్వాత ”మాస్టారూ! మీరు నాకు మంచి మాటలు చెప్పకపోతే నా జీవితం అస్తవ్యస్తం అయిపోయేది … మీరే నా గురువు, దైవం” అంటూ సాగిలపడ్డాడు. మాస్టారు బంగార్రాజును ప్రేమగా లేవనెత్తి… చదువుకున్న వాడు ఎప్పుడూ, ఎవడూ చెడిపోడు… నువ్వు ఇంకా పై చదువులు చదువుకోవాలని దీవించారు మాష్టారు.
– రంగరాజు పద్మజ, 9989758144

Spread the love