– అరచేతిలో సమాచారం ఉన్నా దాచిపెడుతోంది
– అబద్ధాలతో తప్పుదారి పట్టిస్తోంది
– ఈబీ వివరాల వెల్లడిపై ఎస్‌బీఐ కుంటిసాకులు
– నేడు సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐలో ఇప్పుడు కార్యకలాపాలన్నీ డిజిటల్ పద్ధతిలోనే జరిగిపోతున్నాయి. మీకు ఏదైనా రికార్డో లేదా సమాచారమో కావాలంటే కేవలం ఒకే ఒక ‘క్లిక్’తో అది మీ సొంతం అవుతుంది. అంటే సమాచారమంతా అరచేతిలోనే ఉంటుందన్న మాట. డిజిటలీకరణ యుగంలో ఇది సర్వసాధారణమే. ఇదంతా ప్రజలకు తెలిసిన విషయమే. కానీ న్యాయస్థానాన్ని, ప్రజలను పచ్చి అబద్ధాలతో ఎస్‌బీఐ మోసం చేస్తోంది. తాను విక్రయించిన ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. అందుకు చాలా సమయం పడుతుందంటూ నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఎవరి ఒత్తిడి కారణంగా ఎస్‌బీఐ ఇలా అబద్ధాలు చెబుతోంది అనేదే ఇక్కడ ప్రశ్న. ఈ వ్యవహార మంతా చూస్తుంటే ‘ప్రధానమంత్రి విరాళాలను గోప్యంగా ఉంచే పథకం’లా ఎస్‌బీఐ పని చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఎన్నికల బాండ్లను ఎవరు కొనుగోలు చేశారు? ఏ రాజకీయ పార్టీకి దానిని విరాళంగా అందజేశారు? అనే విషయాలను తెలుసుకోవాలని జాతి యావత్తూ ఎదురు చూస్తోంది. అయితే ఈ సమాచారం పొందడం అంత సులభమేమీ కాదని ఎస్‌బీఐ చెబుతోంది. అందుకు చాలా సమయం పడుతుందని కూడా అంటోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆ సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఆ బ్యాంక్ నిర్ణయించుకున్నట్లు కన్పిస్తోంది.
నేడు విచారణ
ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించేందుకు మరింత గడువు కావాలని కోరుతూ ఎస్‌బీఐ సుప్రీంకోర్టులో దరఖాస్తు సమర్పించింది. దీనిని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), కామన్‌కాజ్ అనే సంస్థలు న్యాయస్థానంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాయి. ఎస్‌బీఐ దరఖాస్తు, కోర్టు ధిక్కరణ పిటిషన్ సోమవారం సుప్రీంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఎన్నికల బాండ్ పైన ఓ యూనిక్ సీరియల్ నెంబరు ఉంటుందని, దాని సాయంతో సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చునని ఏడీఆర్, కామన్‌కాజ్ చెబుతు న్నాయి. ఎన్నికల బాండును ఎవరు కొనుగోలు చేశారు ? దానిని ఏ రాజకీయ పార్టీ సొమ్ము రూపంలో మార్చుకుంది ? అనే విషయాలను తెలుసుకోవడం చాలా తేలికైన పని అని ఈ సంస్థలు వాదిస్తున్నాయి. ఎస్‌బీఐ అధికారులు చేయాల్సిందల్లా బ్యాంక్ డేటాబేస్ నుండి అవసరమైన సమాచారాన్ని తీసుకోవడమే. కానీ బ్యాంక్ ఉన్నతోద్యోగులు మాత్రం అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నారు. దీని వెనుక ఎవరి ఒత్తిడి ఉన్నదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అది బహిరంగ రహస్యమే.
సుప్రీంకోర్టు ఏమంది?
ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎన్నికల బాండ్ల పథకాన్ని ముక్తకంఠంతో తిరస్కరించింది. దానిని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. రాజకీయ పార్టీలకు ఎక్కడి నుండి నిధులు అందుతున్నాయో తెలుసుకునే హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఉన్నదని స్పష్టం చేసింది. ‘రాజకీయ పార్టీలకు ఎవరు విరాళాలు అందిస్తున్నారో వెల్లడించాల్సిన అవసరం లేదని ఈ పథకం చెబుతోంది. ఇది సమాచారాన్ని తెలుసు కునేందుకు ఓటర్లకు ఉన్న ప్రాథమిక హక్కుపై దాడి చేయడమే అవుతుంది. ఏ తేదీన ఎవరు ఎన్నికల బాండ్ కొనుగోలు చేశారు? ఎంత మొత్తంలో కొనుగోలు చేశారు? ఏ రాజకీయ పార్టీకి ఏ తేదీన దానిని అందజేశారు? దానిని ఆ పార్టీ ఎప్పుడు నగదుగా మార్చుకుంది? వంటి వివరాలు తెలిసే వరకూ సుప్రీంకోర్టు నిర్ణయం పూర్తిగా అమలు జరిగినట్లు కాదు’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎన్నికల బాండ్ల జారీని నిలిపి వేయాలని ఫిబ్రవరి 15న ఇచ్చిన తీర్పులో ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మూడు వారాల్లో తెలియజేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
గడువు ముగిసినా…
ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 6వ తేదీతో ముగిసింది. అయితే దానిని రెండు రోజుల ముందే ఎస్‌బీఐ చేతులెత్తేసింది. ఎన్నికల బాండ్ల సమాచారాన్ని గడువు లోగా అందజేయడం కష్టమని, మరో మూడు నెలల సమయం కావాలని కోరుతూ న్యాయస్థానంలో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. అంటే జూన్ 30 వరకూ సమయం కోరింది. అప్పటికి దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోతుంది.
ప్రభుత్వ ఆదేశాల ఫలితమే
నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆదేశాల కారణంగానే ఎస్‌బీఐ పనిచేస్తోందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికల బాండ్ల ద్వారా తనకు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేసిన వారి వివరాలు ప్రజలకు తెలియకూడదని ఆ పార్టీ భావిస్తోంది. రహస్య విరాళం ఇచ్చిన వ్యక్తి అందుకు ప్రతిఫలంగా ఏం పొందాడో ప్రజలు తెలుసుకోవడం కూడా కమలదళానికి ఇష్టం లేదు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఈ విషయంపై చర్చ జరగడం బీజేపీకి సుతరామూ నచ్చడం లేదు. అందుకే ఆ పార్టీ ఎస్‌బీఐపై ఒత్తిడి తెచ్చి కాలయాపనకు ప్రయత్నిస్తోంది.
ఏడీఆర్, కామన్‌కాజ్ వాదన ఏమిటి?
ఎస్‌బీఐపై ఏడీఆర్, కామన్‌కాజ్ సంస్థలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో పలు అంశాలను లేవనెత్తాయి. ఎన్నికల బాండ్ కొనుగోలు చేసిన ప్రతి వ్యక్తికి సంబంధించిన కేవైసీ బ్యాంక్ వద్ద ఉంటుంది. అంటే బాండ్లను కొనుగోలు చేసిన వారి సమాచారం బ్యాంక్‌కు అందుబాటులోనే ఉంటుంది. అదీకాక ప్రతి బాండ్‌పై యూనిక్ సీరియల్ నెంబర్ ఉంటుంది. బాండును ఎవరు కొనుగోలు చేశారు? ఏ రాజకీయ పార్టీ నగదుగా మార్చుకున్నది? అనే సమాచారం ఈ నెంబరు ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. సీరియల్ నెంబర్లను సరిపోల్చుకుంటే చాలు. ఎన్నికల బాండును ఎవరు కొన్నారు? ఎంత మొత్తంలో కొన్నారు? ఏ పార్టీ కోసం కొనుగోలు చేశారు? అనే విషయాలు తేలికగా తెలుస్తాయి.
‘రిపోర్టర్స్ కలెక్టివ్’ ఏం చెప్పిందంటే…
ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం కోరినప్పుడు ఎస్‌బీఐ దానిని 48 గంటల్లోనే అందజేసిందని, దీనిని రుజువు చేసేందుకు అనేక ఆధారాలు ఉన్నాయని ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ సంస్థ తెలిపింది. ఎన్నికల బాండ్లను సొమ్ము చేసుకునే గడువు పూర్తయిన వెంటనే ఎస్‌బీఐ అత్యంత ‘విశ్వాసం’తో ఆ వివరాలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఎన్నికల బాండ్ల విక్రయం, వాటిని రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకోవడంపై ఎస్‌బీఐ ఆడిట్ ట్రయల్ కూడా నిర్వహించిందని ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ తెలిపింది.
బ్యాంక్ వాదన పేలవం
ఎన్నికల బాండ్ కొనుగోలుదారుకు సంబంధించిన సమాచారం బ్యాంక్ వద్ద ఎప్పుడూ అందుబాటు లోనే ఉంటుందని, ఏ ప్రభుత్వ సంస్థ అయినా ఆ సమాచారాన్ని కోరితే దానిని వెంటనే అందజేస్తుందని ఎన్నికల బాండ్ల మాన్యువల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. వివరాలు బహిర్గతం చేయకుండా అడ్డుకోవడానికి ఎస్‌బీఐ చూపుతున్న కారణాలు చాలా పేలవంగా ఉన్నాయని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ చెప్పారు. ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశారు. ఏదేమైనా ఒక విషయం మాత్రం నిజం. తన పార్టీకి విరాళాలు అందించిన కార్పొరేట్ దాతల గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రధాని మోడీ భయపడుతున్నారు.
ఎస్‌బీఐ వాదన ఇలా…
ఇక ఎస్‌బీఐ వాదన మరోలా ఉంది. గోప్యత పాటించడా నికి ఎన్నికల బాండ్ల అమ్మకాలు, వాటి విత్‌డ్రాయల్స్ సమాచా రాన్ని విడివిడిగా నిర్వహించా మని బ్యాంక్ తెలిపింది. 2019 నుండి 22,217 బాండ్లను జారీ చేశామని, వాటిలో కొన్నింటిని రాజకీయ పార్టీలు నగదు రూపంలో మార్చుకున్నాయని అంటూ ఎవరు కొనుగోలు చేశారు? ఏ పార్టీ నగదుగా మార్చుకుంది? అనే విషయాలను సరిపోల్చడానికి అనేక నెలల సమయం పడుతుందని అంటోంది. అయితే నగదుగా మార్చుకోవడానికి ఎన్నికల బాండును బ్యాంకులో సమర్పించగానే ఆ బాండును ఎవరు, ఏ పార్టీ కోసం కొనుగోలు చేశారో ఎస్‌బీఐకి తెలిసిపోతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలోనే చెప్పింది.
సాఫ్ట్‌వేర్ వ్యవస్థ ఉన్నా…
ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేమంటే కేంద్ర ప్రభుత్వం 2019లో సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం చాలా తేలిక అని అందులో తెలిపింది. ఎన్నికల బాండ్ల నిర్వహణ కోసం ఐటీ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి ఎస్‌బీఐ సుమారు రూ.60 లక్షలు ఖర్చు చేసింది. దాని నిర్వహణ కోసం మరో రూ.89 లక్షల వరకూ వెచ్చించింది. ఎన్నికల బాండ్ల సమాచారం కోసం బ్యాంక్ వద్ద మంచి సాఫ్ట్‌వేర్ వ్యవస్థ ఉన్నదన్న విషయం దీనిని బట్టి తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న డాటాబేస్ నుండి అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవడం చాలా చాలా సులభం.