నిజాం షుగర్ ఫ్యాక్టరీ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం విడనాడాలి..

– సీపీఐ(ఎం) డిమాండ్..

నవతెలంగాణ- బోధన్ టౌన్ 
నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 20 రోజులకు పైగా జరుగుతున్నటువంటి దీక్షలకు శుక్రవారం రోజున సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అలాగే నాయకులు సంఘీభావం ప్రకటించి మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శించి పరిశ్రమను ప్రైవేటీకరించి నష్టం చేశారని తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 100 రోజుల్లో పరిశ్రమను ప్రభుత్వ పరం చేసుకొని పూర్వ వైభవం తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత స్థానిక ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ అనేక సందర్భాల్లో వాగ్దానాలు ఇచ్చి ఎన్ఎస్ఎఫ్ కార్మికులను రైతులను నమ్మించి ఓట్లు వేసుకొని రెండుసార్లు అధికారంలోకి వచ్చిన నడుస్తున్న పరిశ్రమను మూసేశారు తప్ప దాన్ని తిరిగి తెరిపించడానికి కానీ గత తొమ్మిది సంవత్సరాలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వటం కానీ చేయకుండా కార్మిక కుటుంబాలు రోడ్డున పడి ఆకలి చావును గురి చేశారని ఆయన విమర్శించారు ఉమ్మడి రాష్ట్ర పాలనలోనైనా పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులతో నడిపించారని కానీ నేడు దాన్ని కూడా మూసేసి బోధన్ పట్టణ వైభవాన్ని లేకుండా చేశారని విమర్శించారు. అదేవిధంగా బిజెపికి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్ మెట్టుపల్లి నుండి బోధన్ వరకు పాదయాత్ర చేసి నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం తెరిపించకపోతే కేంద్రం నిధుల తీసుకువచ్చి తాను దాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చి కార్మికుల సమక్షంలో ప్రమాణం చేసి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయన కూడా తాను ఇచ్చిన హామీని మర్చిపోయారని. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజామాబాద్ జిల్లా ప్రజలను బోధన్ ప్రాంత కార్మికులను మోసం చేశారని ప్రభుత్వం ఇప్పటికైనా తాను ఇచ్చిన హామీని అమలు జరపాలని లేనియెడల ఈ ప్రాంత ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు ఎం గంగాధరప్ప, ఏరియా కమిటీ కార్యదర్శి వై.గంగాధర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జై.శంకర్ గౌడ్ కార్మిక సంఘం నాయకులు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love