ఎస్ఎఫ్ఐ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గు చేటు

నవతెలంగాణ- కంటేశ్వర్

సంక్షేమ హాస్టల్స్ సమస్యలను పరిష్కరించమంటే ఎస్ఎఫ్ఐ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ చేపట్టిన ఛలో కలెక్టరేట్ కార్యక్రమం సందర్భంగా నల్లగొండ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులపై పోలీసులు అక్రమ కేసులను కొట్టివేయాలని నగరంలోని 10వ డివిజన్ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోశమైన మహేష్ మాట్లాడుతూ.. నిన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని , ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టిందని ఈ సందర్భంగా కనీసం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టకుండా, సమస్యలను పరిష్కరించమని అడగడానికి వచ్చిన విద్యార్థులను, ఎస్ఎఫ్ఐ నాయకులను కొట్టి , ఎస్ఎఫ్ఐ నాయకుల పైన అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని అన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ,ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో సోయలేని ప్రభుత్వం, ఈరోజు స్మశానవాటికలని, ప్రభుత్వ నూతన కార్యాలయాల భవనాల కోసం అని అనేక వేల కోట్లు ఖర్చు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని గాలికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలోనే ఉండడం మన దౌర్భాగ్యం అని అన్నారు. సంక్షేమ హాస్టల్లో ఈరోజు అనేకమంది విద్యార్థులు సుదూర ప్రాంతాలు నుండి వచ్చి మండల,జిల్లా కేంద్రాల్లో చదువుకోవడం కోసం వస్తే సౌకర్యాలు ఉండాల్సిన హాస్టల్స్ శిథిలావస్థలో ఉండి ,ఎప్పుడు కూలిపోతయో అనే భయాందోళనలో విద్యార్థులు ఉన్న పట్టించుకునే నాథుడు దిక్కు లేదు.వీటితోపాటు అనేక నెలలుగా కాస్మోటిక్, మెస్ చార్జీలు బిల్లులు విడుదల చేయకపోవడం, ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ పోస్టులను భర్తీ చేయకపోవడం,విద్యార్థులకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్స్ సీట్లను పెంచకపోవడం వంటివి నిరసిస్తూ నిన్న రాష్ట్రవ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుండి మేల్కొని ప్రభుత్వ విద్యా రంగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని లేనియెడల రానున్న ఎన్నికల్లో విద్యార్థుల్లోకాన్ని ఏకం చేసి, ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు ముఖ్యపాత్ర వహించరో,అదే తరహా ఉద్యలమతో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు వేణు ,గణేష్ నగర్ కమిటీ నాయకులు సాయి ,రాహుల్ మరియు విశాల్ ఆసిఫ్ పాల్గొన్నారు.
Spread the love