నవతెలంగాణ – నల్లగొండ
నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్టలో గవర్నర్ తమిళిసై పర్యటించనున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారిని పరామర్శించి వివరాలు తెలుసుకునేందుకుగాను ఈ నెల 22వ తేదీన గువ్వలగుట్టకు ఆమె రానున్నారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి తొమ్మిది గంటలకు చింతపల్లికి చేరుకోనున్నారు. మండల కేంద్రంలోని షిర్డీసాయిబాబా దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. దేవరకొండ మీదుగా బయలుదేరి మధ్యాహ్నం 12గంటలకు గువ్వలగుట్టకు చేరుకుంటారు. గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారితో, గ్రామస్థులతో సమావేశమై సహపంక్తి భోజనం చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు దేవరకొండ రహదారి బంగ్లాకు చేరుకుని హైదరాబాద్‌కు బయలుదేరుతారు. గువ్వలగుట్టకు గవర్నర్ పర్యటన ఖరారు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గువ్వలగుట్ట గ్రామపంచాయతీ సమీపంలో టెంట్ వేసి సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు.