గవర్నర్ వర్సెస్ సర్కార్

నవతెలంగాణ చెన్నై: తమిళనాడు రాజ్‌భవన్‌(Raj Bhavan)కు ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన దూరం మరింత పెరిగింది. తమిళనాడు రాజ్‌భవన్‌(Raj Bhavan) వద్ద పెట్రోల్‌ బాంబు విసిరిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. చెన్నై గిండిలోని రాజ్‌భవన్‌ ప్రధాన గేటు వద్ద ఓ వ్యక్తి పెట్రోల్‌తో ఉన్న సీసాను విసిరాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా… పోలీసులు కేసు నమోదు చేయలేదని రాజ్‌భవన్‌ ఆక్షేపించింది.
‘దాడి విషయంలో రాజ్‌భవన్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దర్యాప్తులో భాగంగా ఈ ఘటనను ఓ సాధారణ దాడిగా నీరుగార్చారు. ఆగమేఘాలపై నిందితుడిని అరెస్టు చేసి, అర్ధరాత్రి వేళ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి మరీ.. జైలుకు తరలించారు. దీంతో ఈ దాడి వెనుక ఎవరున్నారనేది బహిర్గతం చేసే సమగ్ర దర్యాప్తును అడ్డుకున్నట్లయ్యింది. నిష్పాక్షిత దర్యాప్తును ప్రారంభానికి ముందే చంపేశారు’ అని రాజ్‌భవన్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా పేర్కొంది.
రాజ్‌భవన్‌ వద్ద భద్రతలో ఎలాంటి లోపం లేదని పోలీసులు ఇప్పటికే తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిని వినోద్‌గా గుర్తించారు. అతడి వద్ద నుంచి మూడు పెట్రోల్‌ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఇదివరకే తొమ్మిది కేసులు ఉన్నట్లు తెలిసింది. ‘నీట్‌’కి మినహాయింపు తీర్మానానికి గవర్నర్‌ ఆమోదం ఇవ్వకపోవడంతోనే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి, డీఎంకే ప్రభుత్వానికి మధ్య ఆయా అంశాలపై ఘర్షణపూరిత వాతావరణం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

Spread the love