నవతెలంగాణ – ప్రకాశం
ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఓ దళిత వితంతు మహిళపై సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అకృత్యానికి పాల్పడ్డారు. కళ్లలో కారం కొట్టి వివస్త్రను చేసి సజీవ దహనానికి యత్నించారు. స్వేచ్ఛ, సమానత్వం తెల్లబోయాయి. ప్రేమ పేరుతో తమ కుమార్తెను ఒక యువకుడు లోబరచుకుని తీసుకుపోయాడని కక్షకట్టిన కుటుంబం అతడి సోదరిపై దారుణంగా దాడి చేసి.. కళ్లలో కారం కొట్టి.. కత్తులతో విరుచుకుపడి.. క్రూరంగా హింసించింది.. అంతటితో ఆగకుండా వివస్త్రను చేసి అవమానించింది. అయినా వారి ఆగ్రహం చల్లారలేదు.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. సకాలంలో పోలీసులు చేరుకోవడంతో ఆమె ప్రాణాలతో మిగిలింది.
దర్శి మండలంలోని ఎస్సీ కాలనీకి చెందిన దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇంటిపెద్ద చాన్నాళ్ల క్రితమే మరణించారు. కుమార్తెకు పదేళ్ల క్రితం వివాహం కాగా రెండేళ్ల క్రితం భర్త చనిపోయారు. ఆమె నర్సు శిక్షణ తీసుకుని ప్రైవేట్ వైద్యశాలలో పనిచేస్తున్నారు. ఆమె సోదరుడు, బొట్లపాలెం గ్రామానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి కుమార్తె ప్రేమించుకున్నారు. మార్చిలో గ్రామం నుంచి వెళ్లిపోయి పెండ్లి చేసుకున్నారు. దానిని పరువు తక్కువగా భావించిన యువతి తల్లిదండ్రులు బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ కలిసి యువకుడి ఇంటిపై దాడి చేసి అతడి తల్లిని, సోదరిని కులం పేరుతో దూషించి తీవ్రంగా కొట్టారు. తమ కుమార్తెను తెచ్చి అప్పగించకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్శి పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అయినా కొద్దిరోజుల్లోనే బెయిల్ రావటంతో నిందితులు మరోసారి దాడికి ప్రయత్నించారు.
సోమవారం బాధితురాలు తన తల్లిని చూడడం కోసం పుట్టింటికి వచ్చారు. అర్ధరాత్రి కుళాయి నీరు విడవడంతో పట్టుకోడానికి ఆమె వీధిలోకి రాగా.. నిందితులు బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మ ఆమెపై దాడికి పాల్పడ్డారు. కళ్లలో కారం చల్లి.. కత్తులతో విచక్షణరహితంగా దాడి చేసి గాయపరిచారు. వీధిలో ఈడ్చుకుంటూ లాక్కెళ్లి వివస్త్రను చేయటంతో పాటు తాళ్లతో కాళ్లు, చేతులు కట్టి గొడ్డలి వెనక పిడితో తీవ్రంగా కొట్టారు. అనంతరం పెట్రోలు పోసి నిప్పంటించడానికి ప్రయత్నించారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ఈ దారుణం చోటుచేసుకుంది. దళిత వితంతు మహిళ పట్ల క్రూరంగా ప్రవర్తించడాన్ని చూసిన గ్రామస్థులు రాత్రి ఒంటిగంటకు డయల్-100కు ఫోన్ చేసి చెప్పారు. జిల్లా కేంద్రం నుంచి అందిన సమాచారంతో 1.20 గంటలకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బ్రహ్మారెడ్డి ఇంట్లో బందీగా ఉన్న బాధితురాలిని గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆమె కాళ్లూ చేతులకు ఉన్న కట్లు విప్పి.. వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాల మేరకు అపహరణ, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు బ్రహ్మారెడ్డిని, అతడి భార్య పుల్లమ్మను అరెస్టు చేశారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలిని శిక్షణ ఐపీఎస్ అధికారిణి అంకిత సురానా మహవీర్ మంగళవారం మధ్యాహ్నం పరామర్శించి ధైర్యం చెప్పారు.